న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా కేంద్ర క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. శనివారం కర్తవ్యపథ్ వద్ద ఆమె ‘ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పతకాలతో ఆమె దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఫొగాట్ ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను ఇచ్చింది.
అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ వర్గమే కొత్తగా ఎన్నికైంది. ఆయన విధేయుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడు అయ్యారు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చాడు.
బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఫొగాట్ కూడా ముందు ప్రకటించినట్లే ఖేల్‌రత్న, అర్జున అవార్డుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నివాసానికి బయల్దేరింది. కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అవార్డుల్ని రోడ్డుపైనే వదిలేసింది. ఆ పురస్కారాలు ఇప్పుడు పోలీసుల ఆ«దీనంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment