
ప్రిక్వార్టర్స్‌లో సింధు
టోక్యో: బలమైన స్మాష్‌లు... మెరుగైన డ్రాప్ షాట్లు... నెట్ వద్ద పూర్తి అప్రమత్తంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు... జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-13తో యుకినో నకాయ్ (జపాన్)పై విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచిన సింధు తర్వాత చెలరేగింది. దీంతో స్కోరు 10-4కు వెళ్లింది. ఈ దశలో మరోసారి విజృంభించిన ఆమె వరుసగా ఏడు పాయింట్లు నెగ్గింది. యుకినో ఒకటి, రెండు పాయింట్లకే పరిమితం కావడంతో సింధు సులువుగా గేమ్‌ను సొంతం చేసుకుంది. 6-0తో రెండో గేమ్‌లో ఆధిక్యంలోకి వచ్చాక సింధు కాస్త నెమ్మదించింది. దీంతో ఇరువురు ఒకటి, రెండు పాయింట్లతో సరిపెట్టుకున్నారు. అయితే స్కోరు 16-13 ఉన్న దశలో సింధు డ్రాప్ షాట్లతో ఐదు పాయింట్లు నెగ్గి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో నెట్ వద్ద 21 పాయి ంట్లు గెలుచుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సింధు... యమగుచి (జపాన్)తో తలపడుతుంది.
శ్రీకాంత్ జోరు
బ్యాడ్మింటన్ లీగ్‌లో మెరుగైన ర్యాంక్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన ఏపీ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్ ఈ టోర్నీలోనూ జోరు కనబర్చాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అన్‌సీడ్ శ్రీకాంత్ 22-20, 22-24, 21-18తో ప్రపంచ 22వ ర్యాంకర్ షో ససాకి (జపాన్)పై నెగ్గాడు. తద్వారా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
మరో మ్యాచ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 15-21, 21-17, 24-22తో ప్రపంచ 14వ ర్యాంకర్ వింగ్ కి వాంగ్ (హాంకాంగ్)పై నెగ్గి సంచలనం సృష్టించాడు. ఇతర గేమ్‌ల్లో ఆనంద్ పవార్ 21-17, 7-21, 21-18తో సోని ద్వికుంకురో (ఇండోనేసియా)పై; అజయ్ జయరామ్ 21-11, 21-18తో టియాన్ చెన్ చో (చైనీస్‌తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్, సౌరభ్ వర్మ ఓడిపోయారు.