క్వార్టర్ ఫైనల్లో సింధు
సాక్షి, హైదరాబాద్: తొలి రౌండ్ మాదిరిగానే రెండో రౌండ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మకావు సిటీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సింధు 18-21, 21-18, 21-14తో సలక్‌జిత్ పొన్సానా (థాయ్‌లాండ్)పై గెలిచింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ ప్రపంచ 11వ ర్యాంకర్ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలి గేమ్ తర్వాత పొన్సానా ఆటతీరును అంచనా వేసిన సింధు నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది.
రెండో గేమ్‌లో ఈ తెలుగు అమ్మాయి రెండుసార్లు వరుసగా ఆరు పాయింట్లు సాధించింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. అయితే స్కోరు 4-4తో సమంగా ఉన్నపుడు సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి 13-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పొన్సానా పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సాజ్ కా చాన్ (హాంకాంగ్)తో సింధు ఆడుతుంది. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగం రెండో రౌండ్‌లో ఆడిన భారత్‌కే చెందిన సయాలీ గోఖలే, పి.సి.తులసిలకు ఓటమి ఎదురైంది. పోర్న్‌పవీ (థాయ్‌లాండ్) 21-19, 10-21, 21-15తో సయాలీపై, దీ సువో (చైనా) 21-15, 21-7తో తులసిపై గెలిచారు.