open grandpre gold tournment
-
గురుసాయిదత్ శుభారంభం
రెండో రౌండ్లో సాయిప్రణీత్ మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ జొహర్ బారు (మలేసియా): మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగిన పది మంది భారత క్రీడాకారుల్లో ఏడుగురు మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరో సీడ్ గురుసాయిదత్, 12వ సీడ్ సాయిప్రణీత్, అన్‌సీడెడ్ చేతన్ ఆనంద్ రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. వీరితోపాటు సౌరభ్ వర్మ, ప్రణయ్, ఆదిత్య ప్రకాశ్, అనూప్ శ్రీధర్ కూడా ముందంజ వేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-7, 21-8తో క్వాలిఫయర్ గౌరవ్ వెంకట్ (భారత్)ను ఓడించాడు. సాయిప్రణీత్ 21-16, 21-11తో మహబూబ్ అజిజాన్ (ఇండోనేసియా)పై, చేతన్ ఆనంద్ 21-11, 21-14తో కీజర్ అక్బర్ (ఇండోనేసియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21-10, 21-16తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై, సౌరభ్ వర్మ 21-12, 21-17తో యాన్ కిట్ చాన్ (హాంకాంగ్)పై, అనూప్ శ్రీధర్ 21-11, 21-16తో ధర్మగుణ (ఇండోనేసియా)పై, ఆదిత్య ప్రకాశ్ 21-17, 15-21, 21-14తో ఆండ్రీ మార్టిన్ (ఇండోనేసియా)పై నెగ్గారు. శుభాంకర్ (భారత్) 18-21, 9-21తో టెక్ జీ సూ (మలేసియా) చేతిలో; మయాంక్ బెహల్ (భారత్) 12-21, 17-21తో యోంగ్ చెన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) ద్వయం 18-21, 19-21తో చాయనిత్-మున్కితామోర్న్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంట 11-21, 16-21తో కుర్నియావాన్-బోనా సెప్తానో (ఇండోనేసియా) జోడి చేతిలో ఓడిపోయాయి. -
ఫైనల్లో సింధు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మిం టన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు సిటీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-13, 18-21, 21-19తో క్వాలిఫయర్, ప్రపంచ 780వ ర్యాంకర్ కిన్ జిన్‌జింగ్ (చైనా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా క్రీడాకారిణి లీ మిచెల్లితో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. కెరీర్లో వీరిద్దరూ ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి. రెండో సెమీఫైనల్లో ఏడో సీడ్ లీ మిచెల్లి 21-15, 21-16తో ఐదో సీడ్ పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)ను ఓడించింది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం... మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన సింధుకు ఇటీవల జరిగిన నాలుగు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో (జపాన్, డెన్మార్క్, ఫ్రెంచ్, హాంకాంగ్ ఓపెన్) నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. అయితే గత వైఫల్యాలను మరిపిస్తూ మకావు ఓపెన్‌లో మాత్రం సింధు నిలకడగా రాణిస్తూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కిన్ జిన్జింగ్తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయికి గట్టిపోటీనే లభించింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు స్మాష్‌ల ద్వారా 21 పాయింట్లు, నెట్‌వద్ద 8 పాయింట్లు సంపాదించింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇరువురితో ఆధిక్యం దోబూచులాడింది. ఒక దశలో సింధు 14-16తో వెనుకబడినా వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 17-16తో ముందంజ వేసింది. ఆ తర్వాత కీలకదశలో సింధు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. -
సెమీస్‌లో సింధు
సాక్షి, హైదరాబాద్: తన విజయపరంపరను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు సిటీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-17, 21-12తో ఐదో సీడ్ సాజ్ కా చాన్ (హాంకాంగ్)పై అలవోకగా గెలిచింది. తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో మూడు గేమ్‌ల చొప్పున ఆడి విజయం సాధించిన ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో మాత్రం వరుస గేముల్లో విజయాన్ని దక్కించుకుంది. 29 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు స్మాష్‌లతో ఎనిమిది పాయింట్లు, నెట్‌వద్ద ఆరు పాయింట్లు సాధించింది. గతంలో ఈ హాంకాంగ్ ప్లేయర్‌తో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సింధు మూడోసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో సింధు ఒకదశలో 15-17తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 7-1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను ముగించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వాలిఫయర్, ప్రపంచ 780వ ర్యాంకర్ కిన్ జిన్‌జింగ్ (చైనా)తో సింధు ఆడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
సాక్షి, హైదరాబాద్: తొలి రౌండ్ మాదిరిగానే రెండో రౌండ్లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మకావు సిటీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సింధు 18-21, 21-18, 21-14తో సలక్‌జిత్ పొన్సానా (థాయ్‌లాండ్)పై గెలిచింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ ప్రపంచ 11వ ర్యాంకర్ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలి గేమ్ తర్వాత పొన్సానా ఆటతీరును అంచనా వేసిన సింధు నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది. రెండో గేమ్‌లో ఈ తెలుగు అమ్మాయి రెండుసార్లు వరుసగా ఆరు పాయింట్లు సాధించింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. అయితే స్కోరు 4-4తో సమంగా ఉన్నపుడు సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి 13-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పొన్సానా పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సాజ్ కా చాన్ (హాంకాంగ్)తో సింధు ఆడుతుంది. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో ఆడిన భారత్‌కే చెందిన సయాలీ గోఖలే, పి.సి.తులసిలకు ఓటమి ఎదురైంది. పోర్న్‌పవీ (థాయ్‌లాండ్) 21-19, 10-21, 21-15తో సయాలీపై, దీ సువో (చైనా) 21-15, 21-7తో తులసిపై గెలిచారు. -
సింధు శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మకావు సిటీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 15-21, 21-12, 21-9తో కిమ్ సూ జిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు స్మాష్‌లతో చెలరేగి 26 పాయింట్లు సంపాదించింది. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన సయాలీ గోఖలే, పి.సి.తులసీ కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో మహారాష్ట్ర క్రీడాకారిణి సయాలీ 24-22, 21-15తో చీ యా చెంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... కేరళ అమ్మాయి తులసీ 22-20, 21-19లో రెండో సీడ్ నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ 19-21, 17-21తో సోల్ కూ చోయ్ (దక్షిణ కొరియా)చేతిలో ఓటమి పాలయ్యాడు. పీ రోంగ్ వాంగ్-కువో యూ వెన్ (చైనీస్ తైపీ) జంటతో జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం తొలి గేమ్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో కోనా తరుణ్-అశ్విని పొన్నప్ప జోడి 10-21, 21-17, 13-21తో నిపిత్పోన్-పుతియా సుపాజిర్కుల్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 62వ ర్యాంకర్ సలక్‌జిత్ పొన్సానా (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది.