గురుసాయిదత్ శుభారంభం
రెండో రౌండ్‌లో సాయిప్రణీత్
మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
జొహర్ బారు (మలేసియా): మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగిన పది మంది భారత క్రీడాకారుల్లో ఏడుగురు మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరో సీడ్ గురుసాయిదత్, 12వ సీడ్ సాయిప్రణీత్, అన్‌సీడెడ్ చేతన్ ఆనంద్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. వీరితోపాటు సౌరభ్ వర్మ, ప్రణయ్, ఆదిత్య ప్రకాశ్, అనూప్ శ్రీధర్ కూడా ముందంజ వేశారు.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో గురుసాయిదత్ 21-7, 21-8తో క్వాలిఫయర్ గౌరవ్ వెంకట్ (భారత్)ను ఓడించాడు. సాయిప్రణీత్ 21-16, 21-11తో మహబూబ్ అజిజాన్ (ఇండోనేసియా)పై, చేతన్ ఆనంద్ 21-11, 21-14తో కీజర్ అక్బర్ (ఇండోనేసియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21-10, 21-16తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై, సౌరభ్ వర్మ 21-12, 21-17తో యాన్ కిట్ చాన్ (హాంకాంగ్)పై, అనూప్ శ్రీధర్ 21-11, 21-16తో ధర్మగుణ (ఇండోనేసియా)పై, ఆదిత్య ప్రకాశ్ 21-17, 15-21, 21-14తో ఆండ్రీ మార్టిన్ (ఇండోనేసియా)పై నెగ్గారు.
శుభాంకర్ (భారత్) 18-21, 9-21తో టెక్ జీ సూ (మలేసియా) చేతిలో; మయాంక్ బెహల్ (భారత్) 12-21, 17-21తో యోంగ్ చెన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) ద్వయం 18-21, 19-21తో చాయనిత్-మున్‌కితామోర్న్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంట 11-21, 16-21తో కుర్నియావాన్-బోనా సెప్తానో (ఇండోనేసియా) జోడి చేతిలో ఓడిపోయాయి.