saipraneeth
-
సాయిప్రణీత్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: థామస్ కప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ విఫలమయ్యాడు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ట్రయల్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 2ఎ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచాడు. నలుగురు చొప్పున ఉన్న నాలుగు గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన నలుగురే తదుపరి ట్రయల్స్ దశకు అర్హత పొందుతారు. 2ఎ గ్రూప్‌లో కిరణ్ జార్జి (కేరళ) అగ్రస్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందగా... సాయిప్రణీత్ రెండో స్థానంలో నిలిచాడు. కిరణ్ జార్జితో జరిగిన కీలక మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 21–23, 21–11, 16–21తో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా సింగిల్స్ కోసం లక్ష్య సేన్, శ్రీకాంత్... ఇటీవల కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ప్రణయ్‌ను ‘బాయ్’ నేరుగా భారత జట్టులోకి ఎంపిక చేసింది. మిగిలిన ఒక బెర్త్ కోసం కిరణ్ జార్జి, రవి, సమీర్ వర్మ, ప్రియాన్షు తలపడతారు. -
సింధు శుభారంభం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు (భారత్) 21–12, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–11తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై నెగ్గగా... సమీర్ వర్మ 21–17, 21–14తో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ధ్రువ్ ద్వయం 14–21, 21–17, 21–18తో ప్రపంచ 25వ ర్యాంక్ జోడీ హూ పాంగ్ రోన్–చె యి సీ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 23–21, 21–15తో హెమింగ్ –స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్)లపై, అర్జున్–ధ్రువ్ 21–19, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 18–21, 11–21తో గోసెఫె –నూరు జుద్దీన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
వెల్డన్ ‘వెదర్‌మ్యాన్’!
యూనివర్సిటీ క్యాంపస్ (చిత్తూరు జిల్లా): తిరుపతికి చెందిన యువకుడు సాయిప్రణీత్ ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్’ పేరిట కచ్చితమైన వాతావరణ సూచనలు అందిస్తూ రైతులకు దోహదపడుతున్నాడు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా వివిధ వెబ్సైట్లు, వివిధ ప్రోగ్రామ్‌ల ద్వారా వాతావరణాన్ని విశ్లేషించి అన్నదాతలకు సేవలందిస్తున్నాడు. సాయి ప్రణీత్ నేపథ్యం ఇదీ.. సాధారణ కుటుంబం తిరుపతిలోని గాయత్రి నగర్లో నివాసం ఉంటున్న సాయిప్రణీత్ తండ్రి వెంకట సుబ్రమణ్యం ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి భువనేశ్వరి ఎస్వీయూ క్యాంపస్‌లోని యూనియన్ బ్యాంకులో ఉద్యోగి. సాయిప్రణీత్ చెన్నైలో జన్మించాడు. తిరుపతిలో ఇంటర్ పూర్తి చేసి, చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ఇంజనీరింగ్లో బీఈ పూర్తి చేశాడు. అనంతరం గేట్ ప్రవేశ పరీక్ష రాసి ఎస్వీయూ ఈఈఈ విభాగంలో ఎంటెక్ లో చేరాడు. ఈ సమయంలో ఒక ప్రముఖ సంస్థలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని ఆ సంస్థలో పనిచేస్తున్నాడు. వాతావరణం అంటే ఇష్టం.. సాయి ప్రణీత్‌కు చిన్నప్పటి నుంచి వాతావరణం అంటే ఎంతో ఇష్టం. తాను బీటెక్ చదివే సమయంలో ఖాళీ సమయంలో వాతావరణానికి సంబంధించిన జర్నల్స్, వ్యాసాలు, పుస్తకాలు చదవడం నేర్చుకున్నాడు. వివిధ రకాల డేటా సోర్స్ ఉపయోగించుకొని విశ్లేషణలు చేసి వాతావరణ మార్పులను కచ్చితత్వంతో అంచనా వేస్తూవచ్చాడు. ఏడాది క్రితం ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్’ పేరిట బ్లాగ్ పేజీ రూపొందించి సామాజిక మాధ్యమాల్లో వాతవరణ మార్పులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పోస్టులు పెట్టేవాడు. ఈయన చెప్పిన సూచనలు, అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటుండడంతో సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఫేస్బుక్ పేజీని 26 వేల మంది, ట్విట్టర్లో 11 వేల మంది అనుసరిస్తున్నారు. వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు అందిస్తూ రైతులను చైతన్యపరుస్తున్నాడు. ఇంతకుముందే ఐఎండీ, ఐరాస నుంచి ప్రశంసలు పొందాడు. తాజాగా ప్రధాని నుంచి ప్రశంసలు రావడంతో తండ్రి వెంకటసుబ్రమణ్యం, తల్లి భువనేశ్వరి, సోదరి లక్ష్మీప్రత్యూష హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషం ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ పేరిట నేను అందిస్తున్న వాతావరణ సేవలను ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించడం, ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నాకు తక్కువ సమయం దొరుకుతుంది. అయితే, ఉన్న సమయంలోనే రైతులకు సహకారం అందించాలన్న లక్ష్యంతో కచ్చితమైన వాతావరణ సేవలను అందిస్తున్నాను. భవిష్యత్‌లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాను. – సాయిప్రణీత్, ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ -
సెమీస్‌తో సరి
టోక్యో: ఊహించిన ఫలితమే వచ్చింది. సెమీఫైనల్ చేరే క్రమంలో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్... సెమీఫైనల్లో మాత్రం తన శక్తిమేర పోరాడినా సంచలన ఫలితం నమోదు చేయలేకపోయాడు. ఫలితంగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ సాయిప్రణీత్ 18–21, 12–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో 11వ ర్యాంకర్ నిషిమోటో (జపాన్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 17వ ర్యాంకర్ సునెయామ (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 18వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందిన సాయిప్రణీత్‌కు సెమీస్‌లో ఓటమితో 10,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 23 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెంటో మొమోటాతో ఐదోసారి తలపడిన సాయిప్రణీత్ ఈసారి వరుస గేముల్లో ఓడిపోయాడు. ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లో కెంటో మొమోటాకు మూడు గేమ్‌లపాటు ముచ్చెమటలు పట్టించిన ఈ తెలుగు తేజం ప్రస్తుత పోరులో 45 నిమిషాల్లో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్ హోరాహోరీగా సాగినా కీలకదశలో మొమోటా పైచేయి సాధించాడు. ఒకదశలో 6–11తో వెనుకబడిన సాయిప్రణీత్ అద్భుత ఆటతో వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును 11–11తో సమం చేశాడు. కానీ వెంటనే తేరుకున్న మొమోటా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలో సాయిప్రణీత్ దూకుడుగా ఆడుతూ 9–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. మొమోటా సాధికారిక ఆటతీరుకుతోడు అనవసర తప్పిదాలు చేసిన సాయిప్రణీత్ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయాడు. 9–12తో వెనుకంజలో నిలిచాడు. ఆ తర్వాత సాయిప్రణీత్ కోలుకొని 12–14తో ఆధిక్యాన్ని రెండు పాయింట్లకు తగ్గించాడు. ఈ దశలో మొమోటా ఒక్కసారిగా గేర్ మార్చాడు. వరుసగా ఏడు పాయింట్లు సంపాదించి 21–12తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ‘మ్యాచ్‌లో అడపాదడపా బాగా ఆడాను. కెంటో మొమోటాను ఓడించడం అంత సులువు కాదు. ఏ రకంగా ఆడినా అతని నుంచి సమాధానం వస్తోంది. దూకుడుగా ఆడినా... సుదీర్ఘ ర్యాలీలు ఆడినా... రక్షణాత్మకంగా ఆడినా... స్మాష్ షాట్లు సంధించినా... మొమోటా దీటుగా బదులు ఇస్తున్నాడు. తనదైన శైలి ఆటతో ప్రత్యర్థి ఎలా ఆడాలో, ప్రత్యర్థిని ఎలా ఆడించాలో అతనే శాసిస్తున్నాడు’ –సాయిప్రణీత్ -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు సాయిప్రణీత్, ఆనంద్ పవార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 21-10, 21-14తో దితెర్ డోమ్కె (జర్మనీ)పై గెలిచాడు. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ శ్రీకాంత్‌కు పోటీ ఎదురుకాలేదు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21-11, 21-13తో బెరినో జియాన్ వోంగ్ (మలేసియా)పై, ఆనంద్ పవార్ 13-21, 22-20, 21-16తో డారెన్ లూ (మలేసియా)పై గెలిచారు. అంతకుముందు మంగళవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21-18, 21-10తో లుకాస్ కొర్వీ (ఫ్రాన్స్)పై, సాయిప్రణీత్ 21-9, 21-9తో లుకా జెడెన్జాక్ (క్రొయేషియా)పై, ఆనంద్ పవార్ (భారత్) 21-11, 21-13తో జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై, అజయ్ జయరామ్ (భారత్) 21-7, 21-7తో ఐదో సీడ్ హు యున్ (హాంకాంగ్)పై విజయం సాధించారు. -
గురుసాయిదత్ శుభారంభం
రెండో రౌండ్లో సాయిప్రణీత్ మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ జొహర్ బారు (మలేసియా): మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగిన పది మంది భారత క్రీడాకారుల్లో ఏడుగురు మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరో సీడ్ గురుసాయిదత్, 12వ సీడ్ సాయిప్రణీత్, అన్‌సీడెడ్ చేతన్ ఆనంద్ రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. వీరితోపాటు సౌరభ్ వర్మ, ప్రణయ్, ఆదిత్య ప్రకాశ్, అనూప్ శ్రీధర్ కూడా ముందంజ వేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-7, 21-8తో క్వాలిఫయర్ గౌరవ్ వెంకట్ (భారత్)ను ఓడించాడు. సాయిప్రణీత్ 21-16, 21-11తో మహబూబ్ అజిజాన్ (ఇండోనేసియా)పై, చేతన్ ఆనంద్ 21-11, 21-14తో కీజర్ అక్బర్ (ఇండోనేసియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21-10, 21-16తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై, సౌరభ్ వర్మ 21-12, 21-17తో యాన్ కిట్ చాన్ (హాంకాంగ్)పై, అనూప్ శ్రీధర్ 21-11, 21-16తో ధర్మగుణ (ఇండోనేసియా)పై, ఆదిత్య ప్రకాశ్ 21-17, 15-21, 21-14తో ఆండ్రీ మార్టిన్ (ఇండోనేసియా)పై నెగ్గారు. శుభాంకర్ (భారత్) 18-21, 9-21తో టెక్ జీ సూ (మలేసియా) చేతిలో; మయాంక్ బెహల్ (భారత్) 12-21, 17-21తో యోంగ్ చెన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) ద్వయం 18-21, 19-21తో చాయనిత్-మున్కితామోర్న్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంట 11-21, 16-21తో కుర్నియావాన్-బోనా సెప్తానో (ఇండోనేసియా) జోడి చేతిలో ఓడిపోయాయి. -
హోరాహోరీ ఆరంభం
న్యూఢిల్లీ: ఆరంభ విఘ్నాలను అధిగమించి కార్యరూపం దాల్చిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఆరంభం హోరాహోరీగా జరిగింది. చివరిదైన నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఫలితం తేలింది. ఆఖరి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-జోచిమ్ ఫిషర్ నీల్సన్ (పుణే పిస్టన్స్) జోడి 21-19, 16-21, 11-3తో గుత్తా జ్వాల-కియెన్ కీట్ కూ (ఢిల్లీ) జంటపై గెలిచి పుణే పిస్టన్స్‌కు 3-2తో విజయాన్ని అందించింది. అంతకుముందు పురుషుల తొలి సింగిల్స్ మ్యాచ్‌లో... ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ సంచలనం సృష్టించాడు. పుణే పిస్టన్స్‌కు ఆడుతోన్న ప్రపంచ ఏడో ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)ను వరుస గేముల్లో బోల్తా కొట్టించి ఢిల్లీకి శుభారంభం ఇచ్చాడు. 37 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21-16, 21-20తో తియెన్ మిన్ ఎన్గుయెన్‌ను ఓడించాడు. గత ఆదివారం ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తియెన్ కాంస్యం నెగ్గడం గమనార్హం. మొత్తానికి సాయిప్రణీత్ తన కెరీర్లో మరో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. గత జూన్‌లో ఇండోనేసియా ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ తౌఫిక్ హిదాయత్‌ను... సింగపూర్ సూపర్ సిరీస్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ యున్ హూ (హాంకాంగ్)ను... ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ మహ్మద్ హఫీజ్ హషీమ్ (మలేసియా)ను సాయిప్రణీత్ ఓడించాడు. సాయిప్రణీత్ విజయంతో స్మాషర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లినా... రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జూలియన్ షెంక్ (పుణే-జర్మనీ) 21-15, 21-6తో జిందాపొన్ నిచావోన్ (ఢిల్లీ-థాయ్‌లాండ్)పై నెగ్గి స్కోరును సమం చేసింది. తర్వాత పురుషుల డబుల్స్‌లో బూన్ హోయెంగ్ తాన్-కియెన్ కీట్ కూ (ఢిల్లీ-మలేసియా) జోడి 21-13, 21-16తో రూపేశ్ కుమార్-సనావే థామస్ (పుణే-భారత్) జటను ఓడించి ఢిల్లీకి 2-1 ఆధిక్యాన్ని ఇచ్చింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ (పుణే-భారత్) 21-16, 19-21, 11-5తో హెచ్.ఎస్.ప్రణయ్ (ఢిల్లీ-భారత్)పై నెగ్గి స్కోరును 2-2వద్ద సమం చేశాడు.