సెమీస్‌లో సింధు | P.V sindhu enters in semifinal | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సింధు

Published Sat, Nov 30 2013 12:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సెమీస్‌లో సింధు - Sakshi

సెమీస్‌లో సింధు

 సాక్షి, హైదరాబాద్: తన విజయపరంపరను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు సిటీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-17, 21-12తో ఐదో సీడ్ సాజ్ కా చాన్ (హాంకాంగ్)పై అలవోకగా గెలిచింది. తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో మూడు గేమ్‌ల చొప్పున ఆడి విజయం సాధించిన ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో మాత్రం వరుస గేముల్లో విజయాన్ని దక్కించుకుంది.
 

 29 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు స్మాష్‌లతో ఎనిమిది పాయింట్లు, నెట్‌వద్ద ఆరు పాయింట్లు సాధించింది. గతంలో ఈ హాంకాంగ్ ప్లేయర్‌తో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సింధు మూడోసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో సింధు ఒకదశలో 15-17తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 7-1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను ముగించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వాలిఫయర్, ప్రపంచ 780వ ర్యాంకర్ కిన్ జిన్‌జింగ్ (చైనా)తో సింధు ఆడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement