ఫైనల్లో సింధు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మిం టన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు సిటీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-13, 18-21, 21-19తో క్వాలిఫయర్, ప్రపంచ 780వ ర్యాంకర్ కిన్ జిన్‌జింగ్ (చైనా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా క్రీడాకారిణి లీ మిచెల్లితో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. కెరీర్‌లో వీరిద్దరూ ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి. రెండో సెమీఫైనల్లో ఏడో సీడ్ లీ మిచెల్లి 21-15, 21-16తో ఐదో సీడ్ పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)ను ఓడించింది.
ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం... మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన సింధుకు ఇటీవల జరిగిన నాలుగు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో (జపాన్, డెన్మార్క్, ఫ్రెంచ్, హాంకాంగ్ ఓపెన్) నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. అయితే గత వైఫల్యాలను మరిపిస్తూ మకావు ఓపెన్‌లో మాత్రం సింధు నిలకడగా రాణిస్తూ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
కిన్ జిన్‌జింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయికి గట్టిపోటీనే లభించింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు స్మాష్‌ల ద్వారా 21 పాయింట్లు, నెట్‌వద్ద 8 పాయింట్లు సంపాదించింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇరువురితో ఆధిక్యం దోబూచులాడింది. ఒక దశలో సింధు 14-16తో వెనుకబడినా వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 17-16తో ముందంజ వేసింది. ఆ తర్వాత కీలకదశలో సింధు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.