సైనా x సింధు!
పారిస్: అంతా అనుకున్నట్టు జరిగితే... అంతర్జాతీయస్థాయిలో తొలిసారి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు ముఖాముఖి పోరును చూసే అవకాశముంది. ఈనెల 22 నుంచి 27 వరకు పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులిద్దరూ ఒకే పార్శ్వంలో ఉన్నారు. మంగళవారం విడుదల చేసిన ‘డ్రా’ ప్రకారం ఆరంభ విఘ్నాలను అధిగమిస్తే మహిళల సింగిల్స్‌లో సైనా, సింధులు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతారు.
తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో ఆడనున్న సింధు ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్‌లో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) లేదా క్రిస్టినా గావన్‌హోల్ట్ (చెక్ రిపబ్లిక్)లలో ఒకరితో పోటీపడుతుంది. మరోవైపు నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనా తొలి రౌండ్‌లో నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయికి యోన్ జూ బే (దక్షిణ కొరియా) ఎదురుకావొచ్చు. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే క్వార్టర్ ఫైనల్లో సింధు, సైనా పోటీపడతారు. గత ఆగస్టులో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో సైనా, సింధు రెండుసార్లు పోటీపడగా... రెండు మ్యాచ్‌ల్లో సైనానే గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. అతను తొలి రౌండ్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో ఆడాల్సి ఉంది. గతంలో లీ చోంగ్ వీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కశ్యప్ వరుస గేముల్లో ఓడిపోయాడు. కశ్యప్‌తోపాటు అజయ్ జయరామ్, గురుసాయిదత్ కూడా మెయిన్ ‘డ్రా’లో ఉన్నారు. తొలి రౌండ్‌లో సకాయ్ కజుమాసా (జపాన్)తో జయరామ్; చెన్ యుకెన్ (చైనా)తో గురుసాయిదత్ ఆడతారు.