సైనా అలవోకగా...
♦ శ్రమించి నెగ్గిన శ్రీకాంత్
♦ పోరాడి ఓడిన సింధు, కశ్యప్, గురుసాయిదత్
♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో తన టైటిల్ వేటను ప్రారంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ సైనా 21-12, 21-10తో లిడియా యి యు (మలేసియా)పై అలవోకగా గెలిచింది. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి గేమ్‌లో ఒకదశలో 3-5తో వెనుకబడ్డ ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 8-5తో ముందంజ వేసింది.
అదే జోరులో ఈసారి వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి 17-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో గేమ్ ఆరంభంలో వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 11-2తో దూసుకెళ్లిన సైనా అటునుంచి వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో ఆధిక్యంలో ఉంది.
మరోవైపు మూడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు తుదికంటా పోరాడినా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఎనిమిదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో 72 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు 21-18, 15-21, 23-25తో పోరాడి ఓడింది. చివరి గేమ్‌లో సింధు ఒక మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకోవడం గమనార్హం.
ఓటమి అంచుల నుంచి...
పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కిడాంబి శ్రీకాంత్ నాలుగు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయం సాధించగా... పారుపల్లి కశ్యప్ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓడిపోయాడు. క్వాలిఫయర్ గురుసాయిదత్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)కు చెమటలు పట్టించి పరాజయం పాలయ్యాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)తో 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 14-21, 21-8, 22-20తో గెలిచాడు. చివరి గేమ్‌లో శ్రీకాంత్ 16-20తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పట్టుదలతో పోరాడిన శ్రీకాంత్ అనూహ్యంగా వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 22-20తో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు.
ప్రపంచ ఏడో ర్యాంకర్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో 81 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 26-24, 18-21, 20-22తో ఓడిపోయాడు. చివరి గేమ్‌లో కశ్యప్ 20-18తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తన ప్రత్యర్థికి వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఓటమి మూటగట్టుకున్నాడు. చెన్ లాంగ్‌తో 72 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-15, 9-21, 17-21తో ఓటమి చవిచూశాడు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-13, 21-13తో సమంతా బార్నింగ్-ఇరిస్ తబెలింగ్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.