ఎట్టకేలకు టైటిల్
‘నాకు ఇవి ఉద్వేగభరిత క్షణాలు. లక్నోతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 2009లో ఇక్కడ తొలిసారి టైటిల్ నెగ్గాను. ఎన్నో రోజుల తర్వాత దక్కిన టైటిల్ కాబట్టి ఇది ఇంకా ప్రత్యేకం. చాలా విరామం తర్వాత ఫైనల్ ఆడుతుండటంతో కొంత ఒత్తిడికి లోనయ్యాను. అయితే నాకు అంతా అనుకూలించింది. సింధు కూడా బాగా ఆడింది. టాప్-10లో ఉన్న ఆమెను ఓడించడం ఆనందంగా ఉంది.’
- సైనా నెహ్వాల్
లక్నో: భారత నంబర్‌వన్ షట్లర్ సైనా నెహ్వాల్ చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. దాదాపు 15 నెలల ఎదురుచూపులకు తెరదించుతూ అంతర్జాతీయ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ ముగిసిన సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీని సైనా కైవసం చేసుకుంది. 40 నిమిషాల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సహచర హైదరాబాదీ పీవీ సింధుపై 21-14, 21-17 స్కోరుతో సైనా నెగ్గింది. 2012 అక్టోబర్‌లో డెన్మార్క్ ఓపెన్ గెలిచిన అనంతరం సైనాకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.
కొనసాగిన ఆధిక్యం
సైనా, పీవీ సింధు ఒక అంతర్జాతీయ టోర్నీలో ముఖాముఖిగా తలపడటం ఇదే తొలిసారి. గతేడాది ఐబీఎల్‌లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గిన సైనా, ఈసారీ తన జోరు కొనసాగించింది. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్ అయిన సింధు పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్‌లో శుభారంభం చేస్తూ సైనా 5-0 తో దూసుకుపోయింది. ఈ దశలో లైన్‌కాల్స్ కూడా సైనాకు కలిసొచ్చాయి.
అయితే కోలుకున్న సింధు స్కోరును 12-14కు చేర్చింది. ఆ తర్వాత వేగవంతమైన స్మాష్‌లతో వరుస పాయింట్లు సాధించి సైనా గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్‌లో సింధు మెరుగ్గా ఆడింది. ముందుగా 4-0తో ముందంజ వేసిన ఆమె, మ్యాచ్‌లో తొలిసారి 10-9తో ఆధిక్యంలో నిలిచింది. అయితే చక్కటి ర్యాలీలతో పాయింట్లు సొంతం చేసుకుంటూ సైనా మళ్లీ 18-12తో దూసుకుపోయింది. చివర్లో సింధు పోరాడినా అప్పటికే ఆలస్యమైంది.
భారీ సంఖ్యలో ప్రేక్షకులు
గత ఏడాది ఐబీఎల్‌లో భాగంగా తొలిసారి ఆగస్టు 15న తలపడిన సైనా, సింధు ఈసారి జనవరి 26న మ్యాచ్ ఆడటం విశేషం. ఈ ఇద్దరి తుదిపోరును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఎవరికీ ప్రత్యేకంగా మద్దతుగా నిలవకుండా వారంతా ఇద్దరు షట్లర్ల ఆటను కూడా ప్రోత్సహించారు. సైనా కెరీర్‌లో ఇది 22వ ఫైనల్ మ్యాచ్. ఈ గెలుపుతో ఆమె ఖాతాలో 7000 పాయింట్లు చేరాయి. టోర్నీ విజేతగా నిలిచిన సైనాకు 9 వేల డాలర్లు (రూ. 5 లక్షల 65 వేలు), రన్నరప్ సింధుకు 4,560 డాలర్లు (రూ. 2 లక్షల 87 వేలు) బహుమతిగా లభించాయి.
చేజేతులా ఓడిన శ్రీకాంత్
పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్లో 9వ సీడ్ జు సంగ్ (చైనా) 16-21, 21-19, 21-13 స్కోరుతో ఆరో సీడ్ శ్రీకాంత్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించిన వరల్డ్ 30వ ర్యాంకర్ శ్రీకాంత్ చేజేతులా పరాజయం కొనితెచ్చుకున్నాడు.
తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన అతను రెండో గేమ్‌లో ఒక దశలో 19-12తో ఆధిక్యంలో నిలిచి విజయానికి చేరువయ్యాడు. అయితే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చిన సంగ్ ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా వరుసగా 9 పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌లో 6-0తో దూసుకుపోయిన చైనా షట్లర్ చివరి వరకు పట్టు కోల్పోలేదు.