సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నమెంట్ ఇండియా ఓపెన్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధులకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. గతంలో ఈ టోర్నీలో ఆడిన మూడు పర్యాయాల్లో రెండో రౌండ్‌ను దాటలేకపోయిన సైనా ఈసారి ఆ అడ్డంకిని అధిగమించే అవకాశముంది.
తొలి రౌండ్‌లో సిమోన్ ప్రుశ్ (ఆస్ట్రియా)తో ఆడనున్న సైనాకు రెండో రౌండ్‌లో రాన్‌కిన్ (న్యూజిలాండ్) లేదా నచా సెంగ్‌చోటి (థాయ్‌లాండ్) ఎదురవుతారు. అయితే క్వార్టర్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయికి మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) రూపంలో అగ్ని పరీక్ష సిద్ధంగా ఉండే అవకాశముంది.
యిహాన్ వాంగ్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సైనా ఏడుసార్లు ఓడిపోవడం గమనార్హం. మరోవైపు సింధు తొలి రౌండ్‌లో రెండో సీడ్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిజియాన్ వాంగ్ (చైనా)తో ఆడనుంది. షిజియాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సింధు నెగ్గినప్పటికీ చైనా క్రీడాకారిణులను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ సింధు తొలి రౌండ్‌ను దాటితే క్వార్టర్ ఫైనల్లో ఆమెకు ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)... సెమీఫైనల్లో సైనా లేదా యిహాన్ వాంగ్ ఎదురవుతారు. మరో పార్శ్వం నుంచి ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా), ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు.
పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత క్రీడాకారులకు కష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్‌లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో పారుపల్లి కశ్యప్; చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో గురుసాయిదత్; ఏడో సీడ్ డూ పెంగ్యూ (చైనా)తో సాయిప్రణీత్; టకుమా ఉయెదా (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ తలపడతారు.