న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్‌లు, భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 24 నుంచి జరుగనున్న ఈ టోర్నీ తొలి రౌండ్‌లో 2017 చాంపియన్ పీవీ సింధు హాంకాంగ్‌కు చెందిన చెంగ్ నాన్ యితో ఆడనుంది. చెంగ్‌పై పైచేయి సాధిస్తే క్వార్టర్స్‌లో ఆమెకు ఏడో సీడ్ మిచెల్లీ లీ (కెనడా) ఎదురుపడే అవకాశముంది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ఈ టోర్నీ బరిలోకి దిగనున్న 2015 ఇండియా ఓపెన్ విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో పెయ్ యి పు (హాంకాంగ్)తో తలపడనుంది. అంతా సవ్యంగా జరిగితే ఆమెకు రెండో రౌండ్‌లో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హ్యూన్ (కొరియా) రూపంలో పెద్ద పరీక్ష ఎదురుగా నిలిచింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోన్న భారత స్టార్ ప్లేయర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ ఎదురుపడ్డాడు.
తర్వాత రౌండ్‌లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో శ్రీకాంత్ ఆడాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం టోక్యోకు అర్హత పొందాలంటే ఏప్రిల్ 28లోగా ర్యాంకింగ్స్‌లో టాప్–16లో చోటు దక్కించుకోవాలి. దీంతో మాజీ ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ శ్రీకాంత్‌కు ఈ టోర్నీ ప్రదర్శన కీలకంగా మారింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హెచ్‌ఎస్ ప్రణయ్‌తో మూడో సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్, సిత్తికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ, ఏడో సీడ్ వాంగ్ జు వెయ్ (చైనీస్ తైపీ)తో సౌరభ్ వర్మ, ఖోసిత్ పెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)తో పారుపల్లి కశ్యప్ ఆడనున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట తొలి రౌండ్‌లో జపాన్ జోడీ టకురో హోకి–యుగో కొబయాషితో ఆడుతుంది. మరోవైపు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతగా పరిగణించే ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే క్వాలిఫయింగ్ టోర్నీలను నిలిపివేసే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) పేర్కొంది. ఇప్పటికే వైరస్ కారణంగా నాలుగు ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లు వాయిదా పడ్డాయి. చైనా మాస్టర్స్, వియత్నాం ఇంటర్నేషనల్ చాలెంజ్, జర్మన్ ఓపెన్, పోలిష్ ఓపెన్ టోర్నీ తేదీలను సవరించారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 3000 మంది మృతి చేందారు.
Comments
Please login to add a commentAdd a comment