ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్
తొలి రౌండ్‌లోనే ఓడిన లక్ష్య సేన్, ప్రణయ్, ప్రియాన్షు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మాజీ చాంపియన్ సింధు 21–12, 22–20తో షువో యున్ సుంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో మనామి షిజు (జపాన్)తో సింధు ఆడుతుంది. భారత్‌కే చెందిన అనుపమ ఉపాధ్యాయ్ ముందంజ వేయగా... మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.
అనుపమ 21–17, 21–18తో రక్షిత శ్రీ (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక 22–20, 16–21, 11–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 17–21, 13–21తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్,
ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్ 15–21, 10–21తో చున్ యి లిన్ (చైనీస్ తైపీ) చేతిలో, ప్రణయ్ 21–16, 18–21, 12–21తో లీ యాంగ్ సు (చైనీస్ తైపీ) చేతిలో, ప్రియాన్షు 16–21, 22–20, 13–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి 21–19, 14–21, 27–25తో యుషీ తనాకా (జపాన్)పై గెలిచాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ 23–21, 19–21, 21–16తో వె చోంగ్ మాన్–కాయ్ వున్ తీ (మలేసియా)లపై నెగ్గారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 21–23, 19–21తో అరీసా ఇగారషి–అయాకో సకురామోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment