20వసారి బుసానన్‌పై నెగ్గిన భారత స్టార్ షట్లర్
పోరాడి గెలిచిన లక్ష్య సేన్
సాత్విక్–చిరాగ్ జోడీ కూడా ముందంజ
షెన్‌జెన్: చైనా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్‌సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత షట్లర్లు మెరిశారు. బరిలోకి దిగిన వారందరూ విజయాన్ని అందుకున్నారు.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం కూడా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి.
మళ్లీ సింధుదే పైచేయి...
ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో 21వసారి ఆడిన సింధు ఈసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న సింధు 21–17, 21–19తో బుసానన్‌ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 20వ విజయం కావడం విశేషం. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీ లభించినా కీలకదశలో ఆమె పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది.
గతవారం జపాన్ మాస్టర్స్ టోర్నీలోనూ తొలి రౌండ్‌లో బుసానన్‌పైనే సింధు గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్‌తో సింధు ఆడుతుంది. మరోవైపు ప్రపంచ 36వ ర్యాంకర్, భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సంచలన విజయంతో శుభారంభం చేసింది. ప్రపంచ 21వ ర్యాంకర్ లైన్ హొమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక 20–22, 23–21, 21–16తో విజయాన్ని అందుకుంది.
74 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మాళవిక తొలి గేమ్‌ను కోల్పోయినా ఆందోళన చెందకుడా ఆడి ఆ తర్వాతి రెండు గేముల్లో నెగ్గి ముందంజ వేసింది. ఈ గెలుపుతో ఈ ఏడాది కొరియా ఓపెన్‌లో జార్స్‌ఫెల్డ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుపనిద (థాయ్‌లాండ్)తో మాళవిక తలపడుతుంది.
ఏడో ర్యాంకర్‌కు షాక్
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ సంచలన విజయంతో బోణీ చేశాడు. ప్రపంచ 7వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 13–21, 21–13తో గెలిచాడు. లీ జి జియాపై లక్ష్య సేన్‌కిది ఐదో విజయం కావడం విశేషం. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ ఆటలో నిలకడ లోపించింది.
అయితే కీలకదశలో అతడు గాడిలో పడటంతో విజయం దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 15–11 వద్ద లక్ష్య సేన్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–11తో విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత అతను రెండు పాయింట్లు కోల్పోయాక మరో పాయింట్ నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు.
గాయత్రి జోడీ ముందుకు....
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–15, 21–14తో హు లింగ్ ఫాంగ్–జెంగ్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. ఈ గెలుపుతో భారత జంట సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని మెరుగుపర్చుకుంది.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 12–21, 21–19, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సాతి్వక్–చిరాగ్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment