ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి భారీ బృందం
వివాహం తర్వాత తొలి టోర్నీలో ఆడునున్న పీవీ సింధు
అక్సెల్‌సన్, ఆన్ సె యంగ్‌లాంటి స్టార్ ఆటగాళ్ల రాక
జనవరి 14 నుంచి మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇండియా ఓపెన్ ఈసారి స్టార్ ఆటగాళ్లతో కళకళలాడనుంది. ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 21 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత నెలలో వివాహం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీతో కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది.
సింధు, లక్ష్యసేన్‌తోపాటు పారిస్ ఒలింపిక్ చాంపియన్స్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్), అన్ సె యంగ్ (దక్షిణ కొరియా), ప్రపంచ నంబర్‌వన్ షి యుకి (చైనా) వంటి అంతర్జాతీయ స్టార్లు ఇందులో భాగం కానున్నారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో ముగ్గురు, మహిళల సింగిల్స్‌లో నలుగురు, పురుషుల డబుల్స్‌లో రెండు జోడీలు, మహిళల డబుల్స్‌లో 8 జంటలు, మిక్స్‌డ్ డబుల్స్‌లో 4 జోడీలు టోర్నీలో ఆడనున్నాయి.
‘ఈ టోర్నీలో చాలా మంది భారత షట్లర్లు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత బ్యాడ్మింటన్ పురోభివృద్ధికి ఇది సంకేతం. ఈ ఏడాది పురుషుల సింగిల్స్‌లో టాప్–20 నుంచి 18 మంది, మహిళల సింగిల్స్‌లో టాప్–20 నుంచి 14 మంది ఈ టోర్నీలో ఆడనున్నారు. ఇప్పటికే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు కూడా మరిన్ని విజయాలు సాధిస్తారనే నమ్మకముంది’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు.
భారత ఆటగాళ్ల జాబితా
పురుషుల సింగిల్స్: లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్.
మహిళల సింగిల్స్: పీవీ సింధు, మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ్, ఆకర్షి కశ్యప్.
పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, సాయి ప్రతీక్–పృథ్వీరాయ్.
మహిళల డబుల్స్: పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో, రుతుపర్ణ–శ్వేతపర్ణ, మానస రావత్–గాయత్రి రావత్, అశ్విని భట్–శిఖా గౌతమ్, సాక్షి–అపూర్వ, సానియా సికందర్–రష్మీ గణేశ్, మృణ్మయీ దేశ్‌పాండే–ప్రేరణ అల్వేకర్.
మిక్స్‌డ్ డబుల్స్: ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, సతీశ్ కుమార్–ఆద్య వరియత్, రోహన్ కపూర్–రుత్వివక శివాని, అశిత్ సూర్య–అమృత.
Comments
Please login to add a commentAdd a comment