క్వార్టర్ ఫైనల్లోకి భారత స్టార్
కిరణ్ జార్జి కూడా ముందుకు
కష్టపడి నెగ్గిన సాత్విక్–చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిలకడడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సింధు వరుసగా రెండో విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 21–15, 21–13తో ప్రపంచ 46వ ర్యాంకర్ మనామి సుజి (జపాన్)పై గెలిచింది.
46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. తొలి గేమ్‌లో 11–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధుకు ఆ తర్వాత కాస్త ప్రతిఘటన ఎదురైంది. జపాన్ ప్లేయర్ వరుస పాయింట్లు సాధించడంతో సింధు ఆధిక్యం 14–13తో ఒక పాయింట్‌కు చేరింది. ఈ దశలో సింధు చెలరేగి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 17–13తో ముందంజ వేసింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ చేజార్చుకొని ఆ వెంటనే మళ్లీ మూడు పాయింట్లు సాధించింది.
అదే జోరులో తొలి గేమ్‌ను 21–15తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు కొనసాగింది. వరు సగా ఐదు పాయింట్లు నెగ్గిన భారత స్టార్ 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు ఆధిక్యం 13–3కు, 17–5కు పెరిగింది. సింధు స్మాష్‌లకు మనామి వద్ద సమాధానం లేకపోయింది. చివరకు రెండో గేమ్‌తోపాటు మ్యాచ్ కూడా సింధు వశమైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ సింధు సత్తాకు పరీక్షగా నిలువనుంది.
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్ (ఇండోనేసియా)తో సింధు ఆడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 9–3తో మరిస్కాపై ఆధిక్యంలో ఉంది. అయితే చివరిసారి వీరిద్దరు గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో తలపడగా మరిస్కా విజేతగా నిలిచింది. మరో భారత ప్లేయర్ అనుపమ ఉపాధాŠయ్‌య్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అనుపమ 6–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓడిపోయింది.
ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకొని...
పురుషుల సింగిల్స్‌లో బరిలో మిగిలిన ఏకైక భారత ప్లేయర్ కిరణ్ జార్జి సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ అలెక్స్ లానీర్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ కిరణ్ జార్జి 22–20, 21–13తో గెలుపొందాడు.
46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కేరళకు చెందిన కిరణ్ తొలి గేమ్‌లో 14–20తో వెనుకబడ్డాడు. ఈ దశలో కిరణ్ అనూహ్యంగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకోవడం విశేషం. తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్‌సర్న్ (ఇండోనేసియా)ను ఓడించిన అలెక్స్ ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను చేజార్చుకున్నాక గాడి తప్పాడు.
రెండో గేమ్‌లో కిరణ్ ఆరంభం నుంచే జోరు ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ హాంగ్ యాంగ్ వెంగ్‌తో కిరణ్ ఆడతాడు.
పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 20–22, 21–14, 21–16తో కెన్యా మిత్సుహాషి–హిరోకి ఒకమురా (జపాన్) జంటపై గెలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌లో 20–19తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు సమర్పించుకొని గేమ్‌ను కోల్పోయారు.
అయితే రెండో గేమ్ నుంచి భారత జోడీ అతి విశ్వాసం కనబర్చకుండా జాగ్రత్తగా ఆడింది. స్కోరు 15–13 వద్ద సాత్విక్–చిరాగ్ చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 19–13తో ముందంజ వేశారు. అదే జోరులో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో భారత జోడీ 1–4తో వెనుకబడ్డా వెంటనే తేరుకుంది. నిలకడగా రాణించి 13–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది.
మహిళల డబుల్స్‌లో ముగిసిన పోరు
మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) 9–21, 21–23తో యుకీ ఫకుషిమా–మయు మత్సుమితో (జపాన్)లపై, రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) 6–21, 7–21తో హా నా బేక్–సో హీ లీ (దక్షిణ కొరియా) చేతిలో... అశ్విని భట్–శిఖా గౌతమ్ (భారత్) 7–21, 10–21తో యి జింగ్ లీ–జు మిన్ లువో (చైనా) చేతిలో ఓడిపోయారు.
మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) 18–21, 17–21తో హిరోకి మిదోరికవా–నత్సు సైతో (జపాన్) చేతిలో... అశిత్ సూర్య–అమృత (భారత్) 8–21, 11–21తో పో సువాన్ యాంగ్–లింగ్ ఫాంగ్ యు (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment