న్యూఢిల్లీలో సోమవారం భారత బ్యాడ్మింటన్ సంఘం నుంచి జీవిత సాఫల్య పురస్కారం పొందిన దిగ్గజ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనేతో సింధు సెల్ఫీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత టాప్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో మాజీ చాంపియన్లయిన వీరిద్దరితో పాటు భారత అగ్రశ్రేణి క్రీడాకారులంతా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్‌సన్ చివరి నిమిషంలో వైదొలిగాడు. తొలి రోజు మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సీజన్‌ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించిన 2015 చాంపియన్ సైనా ఇండోనేసియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. చీలమండ గాయంతో సతమతమైన ఆమె గతేడాది పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాక బరిలోకి దిగి ఇండోనేసియా టోర్నీలో ఫైనల్‌దాకా పోరాడింది. సైనా... ఒక్క ఫైనల్ మినహా ప్రతీ మ్యాచ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఇదే ఉత్సాహాన్ని స్వదేశంలోనూ కనబరచాలని ఆశిస్తోంది. నాలుగో సీడ్ సైనా తొలి మ్యాచ్‌లో సోఫీ డాల్ (డెన్మార్క్)తో తలపడుతుంది.
రియో ఒలింపిక్స్ నుంచి సంచలన ఆటతీరుతో అదరగొడుతున్న సింధు గత సీజన్‌లో మూడు టైటిల్స్ గెలిచింది. మరో మూడింటిలో రన్నరప్‌గా నిలిచింది. ఇండోనేసియా టోర్నీ క్వార్టర్స్‌లో సైనా చేతిలో ఓడిన సింధు ఇండియా ఓపెన్ ద్వారా తన ఫామ్ చాటుకోవాలని భావిస్తోంది. తొలిరౌండ్లో నటాలియా రోడ్ (డెన్మార్క్)తో సింధు పోటీపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్‌శ్రీకాంత్ తొలి రౌండ్లో లీ చుక్ యి (హాంకాంగ్)తో తలపడతాడు. గాయంతో ఇండోనేసియా మాస్టర్స్ ఈవెంట్ నుంచి తప్పుకున్న ఈ మాజీ చాంపియన్ (2014) ఇండియా ఓపెన్ ద్వారా పుంజుకోవాలని తహతహలాడుతున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్... రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో, కశ్యప్... క్రిస్టియన్ (డెన్మార్క్)తో, జయరామ్... సుగియార్తో (ఇండోనేసియా)తో పోటీపడతారు.
Comments
Please login to add a commentAdd a comment