టోక్యోలోని నరిటా విమానాశ్రయంలో ముఖానికి మాస్కులు ధరించిన ప్రయాణికులు
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మొత్తం 41 మంది మరణించగా ఒక్క చైనాలోనే 1287 మందికిపైగా వ్యాధి బారినపడినట్లు.. వీరిలో 237 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో 1,965 మంది వ్యాధిబారిన పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పటికే హాంకాంగ్, మకావు, తైవాన్, నేపాల్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, అమెరికాలకు విస్తరించగా భారత్‌లోనూ ఈ వ్యాధిపై ఆందోళన మొదలైంది. మధ్య చైనా ప్రాంతంలోని వూహాన్, హుబే యూనివర్సిటీల్లో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు ఉండటం దీనికి కారణమవుతోంది. భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే ఈ విద్యార్థులను సంప్రదించేందుకు హాట్‌లైన్‌లను ఏర్పాటు చేయడం గమనార్హం.
వూహాన్‌లో కొత్త ఆసుపత్రి...
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైరస్‌కు మూలకేంద్రంగా భావిస్తున్న వూహాన్ నగరంలో కొత్తగా ఇంకో ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు వారాల్లోపు ఇక్కడ 1000పడకలతో మరో ఆసుపత్రిని కడతామని ప్రభుత్వం చెబుతోంది. వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు మిలటరీ వైద్యులను రంగంలోకి దింపింది. వూహాన్‌తోపాటు పరిసరాల్లోని సుమారు 12 నగరాల్లో రవాణాపై నిషేధం కొనసాగుతూండగా, శనివారం నాటి కొత్త సంవత్సర వేడుకలపై దీని ప్రభావం కనిపించింది. బీజింగ్‌లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక కార్యక్రమాలు రద్దయ్యాయి. ఫర్‌బిడన్ సిటీ, షాంఘైలోని డిస్నీల్యాండ్ వంటి పర్యాటక ప్రాంతాలనూ మూసివేశారు.
టీకా తయారీకీ యత్నాలు
కరోనా వైరస్ బారి నుంచి కాపాడేందుకు చైనా, అమెరికన్ శాస్త్రవేత్తలు టీకా తయారీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ వైరస్ బారిన పడితే వ్యాధి లక్షణాలను నియంత్రించడం మినహా ప్రస్తుతం ఏరకమైన చికిత్స లేదు.
చైనా మొత్తం తనిఖీలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశం మొత్తమ్మీద తనఖీలు చేపట్టాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. విమానాలు, రైళ్లు, బస్సుల్లోనూ వైరస్ సోకిన వారి కోసం పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టాలని, ప్రత్యేక తనిఖీ కేంద్రాల ద్వారా నుమోనియా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు వారిని వైద్య కేంద్రాలకు తరలించాలని నేషనల్ హెల్త్ కమిషన్ శనివారం ఒక ప్రకటనలో ఆదేశించింది.
అమెరికాలో మరో కేసు
అమెరికాలోని షికాగోలో తాజాగా ఒక మహిళ ఈ వ్యాధి బారిన పడింది. మరో యాభైమందిని పరిశీలనలో ఉంచారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే నేపాల్‌లోనూ 32 ఏళ్ల పురుషుడు ఒకరు ఈ వ్యాధి బారిన పడ్డారు. వూహాన్ నుంచి ఇటీవలే నేపాల్ వచ్చిన ఇతడికి ప్రస్తుతం ఖట్మండూలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. యూరప్‌లోని ఫ్రాన్స్‌లో ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తూండటం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment