Women prisoners
-
మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!
సంస్కరణా కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లో మహిళల పరిస్థితి దారుణంగా మారిన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దిద్దుబాటు కేంద్రాల్లో మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, 196 మంది పిల్లలు జన్మించడంతో మహిళా ఖైదీల దుస్థితికి బాధ్యులెవరు అనే చర్చకు దారి తీసింది. జైళ్లలో ఉన్న కొంతమంది మహిళా ఖైదీలు గర్బం దాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కోలకత్తా హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రాష్ట్రంలోని వివిధ జైళ్లను పరిశీలించి అమికస్ క్యూరీ గురువారం అందించిన నివేదికపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్లలో మహిళా ఖైదీలు గర్భం దాల్చి, బిడ్డల్ని కంటున్న ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జైలు సంస్కరణలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. మహిళా జైళ్లలోకి పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని నిషేధించాలని కోలకత్తా హైకోర్టు కోరింది. అలాగే ఈ విషయాన్ని క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌కు బదిలీ చేయడం సరైందని భావించిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమస్యను తీవ్రమైందిగా పరిగణిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశాన్ని హైకోర్టులోని మరో డివిజన్ బెంచ్‌కు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది. ఈ వ్యవహారంలో 2018లో అమికస్ క్యూరీగా ఎంపికైన న్యాయవాది తపస్ కుమార్ భంజా తన నివేదికను కోర్టుకు సమర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 196 మంది పిల్లలు పుట్టారని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. కస్టడీలో ఉండగానే మహిళా ఖైదీలు గర్భం దాల్చి, జైళ్లలోనే ప్రసవించినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా ఖైదీలుండే ఎన్క్లోజర్లలో, కరెక్షన్ హోమ్స్‌లో పురుష ఉద్యోగులు, ఇతర పురుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని తపస్ ధర్మాసనాన్ని కోరారు. ఇటీవల తాను దిద్దుబాటు గృహాల ఇన్స్పెక్టర్ జనరల్ (స్పెషల్), జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శితో కలిసి మహిళా దిద్దుబాటు గృహాన్ని సందర్శించాననీ ఈ సమయంలో ఒక గర్భవతిని, దాదాపు15 మంది ఇతర మహిళా ఖైదీలు వారి పిల్లలతో ఉన్నట్టు కోర్టుకు నివేదించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ ఘటనపై స్పందించారు. శిక్ష పడిన మహిళకు ఆరేళ్ల లోపు వయసున్న పిల్లలు ఉంటే వారిని తల్లితో ఉండేందుకు అనుమతి ఉంమటుందని తెలిపారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని జైలులో మహిళలు గర్భవతులు కావడం తన దృష్టికి రాలేదని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
Sudha Bharadwaj: పోరాటమే ఆమె జెండా
అమెరికాలో పుట్టి పెరిగింది సుధా భరద్వాజ్ అమ్మతో పాటు స్వదేశానికి వచ్చి కాన్పూర్ ఐఐటీలో చదువు పూర్తి చేసింది. కార్మికులు, గిరిజన మహిళల వెతలు తెలుసుకొని అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకుని న్యాయవాద వృత్తిని చేపట్టింది. మహిళా ఖైదీల సమస్యలపై పోరాడింది. సాధారణ జీవనం నుంచి సామాజిక కార్యకర్తగా బలహీనులకు న్యాయం చేయడానికి సమస్యలపై పోరాడుతూనే ఉంది. సుధా భరద్వాజ్ జీవితం తెలుసుకుంటే స్త్రీ శక్తి మరో కోణంలో పరిచయం అవకుండా ఉండదు. ఈ విషయాలను ఆమె ప్రస్తావిస్తూ... అరవై ఏళ్ల క్రితం నవంబర్ 1న అమెరికాలో పుట్టాను. అమ్మనాన్నలు ఇద్దరూ పేరొందిన ఆర్థిక వేత్తలు. సామాజికంగానూ చాలా చురుకుగా ఉండేవారు. నేను పుట్టిన ఏడాదికి వారిద్దరూ భారతదేశం వచ్చారు. నాకు నాలుగేళ్ల వయసులో అమ్మానాన్నలు విడిపోయారు. అమ్మ ఒంటరిగా ఉంటూ నన్ను పెంచి, పెద్దచేసింది. అమ్మకు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ఫెలోషిప్ రావడంతో విదేశాలకు వెళ్లిపోయాం. ఆ తర్వాత కొన్నేళ్లకు రాజస్థాన్‌లోని జెఎన్యూలో టీచింగ్ చేయడానికి అమ్మ స్వదేశానికి వచ్చింది. అలా అమ్మతోపాటు నేనూ వచ్చేశాను.‘సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్’ని స్థాపించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. గొప్ప గొప్ప ఆర్థిక వేత్తలతో కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై లోతయిన అధ్యయనాలు చేసింది. జేఎన్యులో చదువుతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై కూడా విద్యార్థులు చురుకుగా ఉండేవారు. నేను అలాంటి వాతావరణంలో పెరిగాను. సాహిత్య, సామాజిక కార్యక్రమాలంటే ఇష్టంగా ఉండేది. గణితంలో కూడా మంచి ఆసక్తి ఉండటంతో ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ తీసుకున్నాను. ► చదువుతూ కూలీలతో.. ఐఐటీలో కొంతమంది విద్యార్థులతో ఒక చిన్న రీసెర్చ్ టీమ్ ఏర్పడింది. కోర్సుతో పాటు పబ్లిక్ సెక్టార్, సైన్ ్స అండ్ టెక్నాలజీ వరకు చదివేవాళ్లం. సామాజిక సమస్యలనూ చర్చించేవాళ్లం. అప్పుడే ప్రజా సంక్షేమానికి కృషి చేస్తేనే నా చదువుకు సార్థకత అనుకునేదానిని. కొంతమంది తోటివిద్యార్థులతో కలిసి కూలీల మధ్య పనిచేయడం ప్రారంభించాం. ఓసారి ఉన్నావ్‌లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన చోటుచేసుకుంది. మా టీమ్‌తో కలిసి నిజనిర్ధారణ కోసం వెళ్లాం. కష్టపడి పనిచేసే వారితో అనుబంధం అలా మొదలైంది. అక్కడ కార్మికులతో కలిసి వారి పాటలు, సంగీతం ఆస్వాదించేదాన్ని. కాన్పురియా యాసలో మాట్లాడటం, పాడడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ విధంగా కార్మికుల ఉద్యమంతో చాలా ప్రభావితమయ్యాను. 1982లో ఆసియా క్రీడలు జరగడానికి ముందు ఢిల్లీలో ఫ్లై ఓవర్లు, స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ పనులకోసం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ లోని మారుమూల ప్రాంతాల నుంచి పేద కూలీలను రప్పించి, వారిని శిబిరాల్లో ఉంచారు. అయితే, వారు తమ ఇంటికి వెళ్ళడానికి టికెట్లు కూడా కొనలేని విధంగా చాలా తక్కువ కూలీ ఇచ్చేవారు. నాకెందుకో వారిని క్యాంపులో బంధించినట్లు అనిపించింది. ఆ తర్వాత 1984లో సిక్కుల ఊచకోత, భోపాల్ గ్యాస్ విషాదం దిగ్భ్రాంతికి గురిచేశాయి. సమాజంలో మార్పు తీసుకు రావాలనే సంకల్పం అప్పుడే నా మనసులో బలంగా మారింది. ► నా దేశం కోసం అమెరికా పౌరసత్వం వదులుకున్నా నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు, నేను పుట్టుకతో పొందిన అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవాలని అమ్మతో కలిసి అమెరికన్ ఎంబసీకి వెళ్లాను. నేను పౌరసత్వాన్ని వదులుకుంటున్నానని చెబితే ఆశ్చర్యపోయారు. అందుకు తగిన ఫారమ్ కోసం వెతికితే, దొరకలేదు. ‘వారం తర్వాత రండి. ఈ నిర్ణయం తీసుకునేముందు మీ ఇంట్లో ఎవరినైనా అడిగారా...?’ వంటి ప్రశ్నలు వేశారు. అంటే ఇంట్లో మగవారికి తెలియకుండా అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవడానికి వచ్చామని వారు అనుకున్నారు. యుఎస్ పౌరసత్వాన్ని వదులుకున్న తర్వాత, హోం మంత్రిత్వ శాఖలో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాను. ► కార్మిక ఉద్యమాల్లో భాగంగా.. మరోవైపు దేశంలో అలజడి కొనసాగుతోంది. మిల్లు కార్మికుల ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ ఉద్యమాల్లోనే అద్భుతమైన కార్మిక నాయకుడు శంకర్ గుహ నియోగి పేరు మొదటిసారిగా తెలిసింది. ’ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా’ ద్వారా కార్మికుల ఆర్థిక అవసరాలను పెంచడంతోపాటు, వారికోసం పాఠశాలలు, ఆసుపత్రులను నడుపుతూ వారి మధ్య ఉంటూ వ్యసనాల నుండి బయటపడటానికి సహాయం చేస్తున్నాడు. జాతీయ భద్రతాచట్టం కింద అతణ్ణి అరెస్టు చేసినప్పుడు, అతని విడుదల కోసం విద్యార్థులుగా మేం పోరాడాం. విడుదలైన తర్వాత ఆయనను కలిశాం. 1986 నాటికి, నేను ’ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా’తో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. భిలాయ్ సమీపంలోని రాజహారా గనులలో పనిచేసే పిల్లలకు చదువు నేర్పించడం ప్రారంభించాను. కొంతకాలం తర్వాత, భిలాయ్‌లో కార్మిక చట్టాలను అమలు చేయడానికి భీకర పోరాటం ప్రారంభమైంది. 16 పెద్ద కంపెనీలు 4,200 మంది కార్మికులను తొలగించాయి. కార్మికులను తిరిగి పనిలో చేర్చడానికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. కొంతమంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలతో కలిసి ఎండవానలు లెక్కచేయకుండా గడిపాం. ► న్యాయం కోసం పోరాటం ... కార్మికుల అభ్యర్థన మేరకు, నేను 2000 సంవత్సరంలో నా న్యాయవిద్యను పూర్తి చేసి వారి కోసం న్యాయపోరాటం ప్రారంభించాను. కూలీలు, గిరిజనులు, మహిళలు అనే తేడా లేకుండా వారి కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం చూశాను. నిరసన తెలిపితే వారిపై కేసులు పెడతారు. ఆ తర్వాత కొంతమంది తోటి లాయర్లతో కలిసి జన్–హిత్ పేరుతో గ్రూప్‌ని ప్రారంభించాను. ఆ తర్వాత భూసేకరణ, అటవీ హక్కులు, పర్యావరణ సంబంధిత సమస్యలకు సంబంధించిన అనేక కేసులను వాదించడం ప్రారంభించాం. కేసులన్నీ కార్పొరేట్లపైనే ఉన్నాయి. అప్పటికి చాలామంది శత్రువులను కూడగట్టుకున్నానని గ్రహించాను. కానీ, ఏ మాత్రం భయపడకుండా బలహీనుల కోసం నా గొంతు పెంచుతూనే ఉన్నాను. ► ఆశ సన్నగిల్లిన సందర్భాలు.. 2006లో దంతెవాడలో ఐదుగురు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళల కేసుపై పోరాడేందుకు న్యాయవాది ఎవరూ సిద్ధంగా లేరు, నేను నా సహోద్యోగులతో కలిసి వారికి న్యాయం చేసే బాధ్యతను తీసుకున్నాను. బాధితుల వాంగ్మూలం నమోదు చేసేందుకు దంతెవాడకు 150 కి.మీ దూరంలోని కొంటకు వెళ్లాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ భాషలో, కొంట అంటే మూల అని అర్థం, ఆ ప్రదేశం నిజానికి ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మూల. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రారంభమవుతుంది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్యూన్ సైకిల్‌పై ఎక్కి వస్తారంటే అక్కడి పరిస్థితిని అంచనా వేయవచ్చు. బాధితులు గోండీ భాషలో తమ బాధలను వివరిస్తుంటే అక్కడ ఉన్న ప్యూన్ అనువాదకుడిగా మారాడు. అప్పుడే అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు దంతెవాడకు బదిలీ అయింది. ఆ తర్వాత మహిళలపై ఒత్తిడి తెచ్చి కేసులు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడు న్యాయంపై ఆశ చచ్చిపోయిందనిపించింది. ► గర్భస్రావం తర్వాత దత్తత కుమార్తె రాజహారలో ఉన్నప్పుడు 8 నెలల గర్భిణిని. ఆ రోజు చాలా వర్షం, మెరుపులు, కడుపునొప్పితో బాధపడుతున్నాను. మా యూనియన్ చెందిన షాహీద్ హాస్పిటల్ కి నడుచుకుంటూ వెళుతుండగా రక్తం కారుతున్నట్లు అనిపించింది. ఎలాగోలా ఆసుపత్రికి చేరుకుని అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆపరేషన్ అయింది. స్పృహ వచ్చాక గర్భస్రావం అయిందని తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత, మళ్లీ గర్భం ప్రమాదకరమనుకున్నాను. అందుకే ఒకమ్మాయిని దత్తత తీసుకున్నాను. కూతురు డిగ్రీ చదువు కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వచ్చి 58 ఏళ్ల వయసులో నేషనల్ లా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా తొలిసారి రెగ్యులర్ ఉద్యోగంలో చేరాను. ఏడాది సాఫీగానే గడిచింది. కానీ, ఉద్యమకారిణిగా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. చాలా పోరాటం తర్వాత తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జైలులో ఉన్నప్పుడు కూతురిని కలవాలని చాలా తపించేదాన్ని. నెలకు ఒకసారి ఉత్తరానికి సమాధానం వచ్చేది. కలవడానికి వీలయ్యేది కాదు. జైలులో ఉన్న మూడేళ్లు మహిళా ఖైదీల సమస్యలను వింటూ, వారి కోసం వర్క్ చేశాను. సామాజిక కార్యకర్తలకు వ్యక్తిగత జీవితం లేదన్నది నిజం. వారు ఇంటికీ, సామాజిక జీవితానికీ మధ్య సమన్వయం చేసుకోలేరు. దీపం కింద చీకటి అనే సామెత నిజం అవుతుంది. ముఖ్యంగా మహిళా సామాజిక కార్యకర్తలు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా జైలు డైరీ ’ఫ్రం ఫాన్సీ యార్డ్’లో నేను అలాంటి చాలామంది మహిళల కథలను పంచుకున్నాను. సమాజంలోని ఈ దురాచారాలకు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాను’’ అని వివరిస్తారు ఈ సామాజిక కార్యకర్త. -
ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో!
అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. ‘మీ ముందు మైక్ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్‌పై మాట్లాడు...’ భవ్య మైక్ ముందుకు వచ్చింది. ‘హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే నవ్వడం! ఒకరోజు సంగ్రామ్ ఏదో ఫంక్షన్‌కు వచ్చాడు. ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’ ....ఆ ఆరుగురు మహిళా ఆర్జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు. అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు. అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు. హరియాణాలోని అంబాల సెంట్రల్ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది. రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్జే’గా విధులు నిర్వహించనున్నారు. దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. ‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా. ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది! -
షబ్నమ్.. ఒక వెంటాడే కథ
భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మొదటిసారి ఒక మహిళా ఖైదీకి ఉరి వేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ మహిళా ఖైదీ పేరు షబ్నమ్. 2008లో తన ప్రియుడితో కలిసి ఆమె తన కుటుంబ సభ్యులనే హతమార్చిందని ఈ తీర్పు. అంతవరకే అయితే ఈ కథ వెంటాడదు. షబ్నమ్ ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. టీచర్‌గా పని చేసి విద్యార్థుల ఇష్టమైన టీచర్‌గా మారింది. ఆమె కాలేజీ ఫీజులు కట్టగా చదువుకున్న జూనియర్ ఆమె జైలుకు వెళ్లడంతో ఆమె కొడుకును దత్తత తీసుకున్నాడు. ఆమె సైఫి ముస్లిం, ప్రియుడు పఠాన్ ముస్లిం కావడం వీరి ప్రేమకు ప్రధాన అడ్డంకి అయ్యింది. ‘ఆస్తి కోసం తన వాళ్లను హతమార్చారు’ అని ఒకసారి, ‘ప్రియుడే చంపాడు’ అని ఒకసారి ఆమె చెప్పింది. అవన్నీ పక్కన పెడితే– భారతదేశంలో ఉరిశిక్షలు నిర్థారణ అయ్యి ఉరికి ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం వెనుక ‘నేరానికి–శిక్షకి–వెనుకబాటుతనానికి’ ఉన్న లంకె కూడా చర్చకు వస్తోంది. ‘ఉరిశిక్ష’ అని ఈ దేశంలో చర్చ జరిగినప్పుడల్లా ఆ ఉరిశిక్ష ‘ఎవరికి’ పడింది అనేది పెద్ద గమనార్హం అవుతుంది. చట్టం, న్యాయం అందరికీ సమానమే అని అనుకుంటాం, చెబుతుంటారు గాని చట్టం, న్యాయం అందరికీ సమానమేనా అని సందేహం వచ్చే గణాంకాలు ఎదురుగా ఉంటాయి. ఈ దేశంలో చకచకా శిక్షలు అమలయ్యేది బలహీనుల మీదేననీ, ఉరిశిక్ష అమలయ్యేది కూడా బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల మీదేనని ఆలోచనాపరులు గణాంకాలు చూపిస్తే వాటిని కాదనే జవాబు ఎవరి దగ్గరా లేదు. అలాగని ఈ ఆలోచనాపరులు నేరాలకు శిక్షలు వద్దని చెప్పడం లేదు. శిక్షల అమలులో వివక్ష ఉంది అని మాత్రమే చెబుతుంటారు. ఇప్పుడు ఉరిశిక్ష వార్తలలో ఉన్న షబ్నమ్ ఒక స్త్రీ కావడం, ఆమెకు క్షమాపణ దక్కకపోవడం, ఆమెలా ఈ దేశంలో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు కేవలం బలహీన, మైనారిటీ వర్గాల వారే కావడంతో వీరంతా ‘అడ్డంకులు లేని పూర్తి శిక్ష’కు యోగ్యులుగా భావించే భావజాలం ఉందని గ్రహించాల్సి వస్తుంది. ఎవరీ షబ్నమ్? శిక్ష కచ్చితంగా అమలవ్వాలి అని భారత పాలనావ్యవస్థ గట్టిగా అనుకుంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఉరిశిక్ష అమలయ్యే ఖైదీగా చరిత్రలో నిలవబోతున్న పేరు షబ్నమ్. ఈమెది ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలోని బవాన్‌ఖేడి గ్రామం. తన ఇంటి ఎదురుగా కలప మిల్లులో పని చేసే సలీమ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి 2008 ఏప్రిల్‌లో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న షబ్నమ్ కుటుంబ సభ్యులు ఏడుగురిని దారుణంగా హతమార్చారని అభియోగం. కోర్టులో నేరం నిరూపణ కావడంతో 2012లో స్థానిక కోర్టు ఇరువురికీ ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఆ శిక్షలను బలపరిచాయి. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా నిరాకరింపబడింది. కనుక షబ్నమ్‌కు ఉరితీత తప్పదని ప్రస్తుతం వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఒక జైలులో, సలీమ్ ఒక జైలులో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో స్త్రీలను ఉరితీసే ఉరికంబం కేవలం మధుర జైలులోనే ఉంది. దానిని ఉపయోగించి 150 ఏళ్లు అవుతోంది. షబ్నమ్‌ను ఉరి తీయాలంటే అక్కడే తీయాలి. అందుకు జైలు అధికారులు తలారీని సిద్ధం చేశారు. డెత్ వారెంట్ రావడమే తరువాయి. సరే.. షబ్నమ్ ఎవరు? షబ్నమ్ ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. ఊళ్లో టీచర్‌గా పని చేసింది. ఆమెది ముస్లింలలో ఒక తెగ. ఆమె ప్రేమించిన సలీమ్ ది మరో తెగ. ఈ తెగల అంతరం వీరి ప్రేమకు అడ్డంకిగా మారింది. అంతే కాదు సలీం కేవలం ఆరో క్లాసు చదువుకున్నాడు. పేదవాడు. అది కూడా షబ్నమ్ తల్లిదండ్రులకు నచ్చలేదు. కాని అప్పటికే ఆమె గర్భం దాల్చింది. ఈ ప్రేమ, గర్భం ఆమెను విచక్షణను కోల్పోయేలా చేశాయి. ఒకరోజు ప్రియుణ్ణి అర్ధరాత్రి ఇంట్లోకి రానిచ్చింది. ఇద్దరూ కలిసి షబ్నమ్ కుటుంబం లో 7గురిని హతమార్చారు. ఆ తర్వాత షబ్నమ్ ‘ఆస్తి కోసం నా వాళ్లను చంపారు’ అని ఒకసారి ‘సలీమ్ నిర్ణయం ఇది’ అని ఒకసారి చెప్పింది. అదే సంవత్సరం డిసెంబర్లో జైలులోనే షబ్నమ్ కొడుకుకు జన్మనిచ్చింది. అతనికి తాజ్ అని పేరు పెట్టింది. ఆరేళ్లవరకూ తల్లి దగ్గరే ఉన్న తాజ్‌ను షబ్నమ్తో పాటుగా కాలేజీలో చదువుకున్న ఆమె జూనియర్, ప్రస్తుతం జర్నలిస్ట్ అయిన ఉస్మాన్ సైఫీ దత్తత తీసుకున్నాడు. ‘నాకు తెలిసిన షబ్నమ్ ఈమె కాదు. షబ్నమ్ నా కాలేజీ ఫీజు కట్టింది. టీచర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె రుణం తీర్చుకోవడానికి ఆమె కొడుకును దత్తత తీసుకోవాలని నేను నా భార్యతో చెప్పాను’ అన్నాడు ఉస్మాన్ సైఫీ. అతని దగ్గర పెరుగుతున్న షబ్నమ్ కొడుకు ప్రతి మూడు నెలలకు తల్లిని చూసి వస్తుంటాడు. ఇటీవల అతను ‘మా అమ్మను క్షమించండి’ అని రాష్ట్రపతికి అప్పీలు చేశాడు. ‘నన్ను చూడాలని బలవంతం చేయకు. బాగా చదువుకో. నన్ను ఎప్పటికీ మర్చిపోకు’ అని షబ్నమ్ తన కొడుక్కి చెప్పింది. ఏం దారి ఉంది? షబ్నమ్ తన క్షమాభిక్ష కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. తన క్షమాభిక్ష నిరాకరింపబడటాన్ని సుప్రీం కోర్టులో తిరిగి సవాలు చేయనుంది. ‘ఇది షబ్నమ్‌కు, సలీమ్‌కు పడ్డ ఉరిశిక్ష. ఇరువురికీ సకల న్యాయపరమైన అప్పీల్స్ ముగిశాకనే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది’ అని షబ్నమ్ తరఫున న్యాయవాది తెలిపింది. షబ్నమ్‌ను ఆమె బంధువులు ఎవరూ కనికరించడం లేదు. ‘ఆమె చనిపోతే ఆమె మృతదేహాన్ని కూడా తీసుకోం’ అని వారు అన్నారు. షబ్నమ్ ఒక జీవచ్ఛవం. ఆమె మరణించిందని ఉరిశిక్ష ద్వారా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
మహిళా ఖైదీలకు స్వేచ్ఛావాయువు
సాక్షి, అమరావతి: శుక్రవారం వారి జీవితాల్లో కొత్తవెలుగు తెచ్చింది. బంధించిన నాలుగు గోడల మధ్య నుంచి స్వేచ్ఛాప్రపంచంలోకి తీసుకొచ్చింది. జీవితఖైదు అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్ష అమలుచేసింది. 53 మంది మహిళలకు కొత్త జీవితం ప్రసాదించింది. జైలునుంచి బయటకు వచ్చిన వారి ఆనందం వర్ణనాతీతం. స్వాగతం చెప్పేందుకు వచ్చిన ఆతీ్మయులను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తమకు స్వేచ్ఛా జీవితం ప్రసాదించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతతో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్షతో ఖైదీలు విడుదలైన విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప జైళ్ల వద్ద శుక్రవారం కనిపించిన దృశ్యం. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్రంలోని మహిళా జీవితఖైదీలను విడుదల చేసేలా ప్రభుత్వం జీవో నంబరు 131 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసు మేరకు 53 మందికి క్షమాభిక్ష పెట్టారు. వీరిలో కడప జైలు నుంచి ఒక మహిళాఖైదీ వారం రోజుల కిందట బెయిల్‌పై విడుదల కావడంతో శుక్రవారం 52 మందిని విడుదల చేసినట్టు జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. కడప జైలునుంచి 26 మంది, నెల్లూరు జైలునుంచి ఐదుగురు, రాజమండ్రి జైలునుంచి 19 మంది, విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు మహిళా ఖైదీలు విడుదలయ్యారు. వీరిని ఆగస్టు 15నే విడుదల చేయాల్సి ఉండగా కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆలస్యంగా విడుదల చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్న మహిళా ఖైదీలు... చిత్రంలో నాలుగేళ్ల చిన్నారి వరకట్న వేధింపులకు పాల్పడిన వారే అధికం జీవితఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ విడుదలైన మహిళా ఖైదీల్లో ప్రధానంగా వరకట్న వేధింపుల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నవారే అధికంగా ఉన్నారు. వీరిలో అరవై ఏళ్ల వయసు పైబడిన వారూ ఉన్నారు. వీరంతా స్రత్పవర్తన కారణంగా ప్రభుత్వ క్షమాభిక్షతో విడుదలయ్యారు. జైలులో వివిధ రకాల శిక్షణ తీసుకున్న మహిళా ఖైదీల్లో పలువురు పీజీ చేయగా, ఇద్దరు డిగ్రీ పట్టాను అందుకున్నారు. మూడు నెలలకోసారి పోలీస్ స్టేషన్‌కు విడుదలైన 53 మంది మహిళా ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జైలు అధికారులు సూచించారు. మంచి ప్రవర్తనతో మెలుగుతామంటూ వారినుంచి రూ.50 వేల అంగీకార పూచీకత్తు (బాండ్)లు తీసుకున్నారు. వారికి విధించిన శిక్షాకాలం గడువు ముగిసే వరకు మూడు నెలలకోసారి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి హాజరుకావాలి. మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడినా అరెస్ట్ చేసి, ముందుస్తు విడుదల రద్దుచేస్తామని ప్రభుత్వం షరతులు విధించింది. మహిళలు తమ కాళ్లపై నిలబడేలా శిక్షణ వాస్తవంగా జైలుకు వెళ్లొచ్చిన మహిళల పట్ల సమాజంలో కొంత చిన్నచూపు ఉంటుంది. కుటుంబాలకు ఆధారమైన ఆ మహిళలు తమ కాళ్లపై నిలబడేలా జైళ్లలోనే టైలరింగ్, అల్లికలు, తదితర చేతి వృత్తుల్లో శిక్షణ ఇచ్చారు. క్షణికావేశంలో నేరం చేశామని, ప్రభుత్వ క్షమాభిక్షతో తమ వాళ్ల దగ్గరికి చేరుతున్నామని పలువురు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టిన క్షమాభిక్ష తమ కుటుంబాల్లో ఎంతో ఆనందం నింపిందని సంతోషం వ్యక్తం చేశారు. కుట్టుమిషన్ల పంపిణీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీలకు త్రిదండి చినజీయర్ స్వామి ట్రస్ట్ ఔదార్యంతో కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాజారావు, మహిళా జైలు సూపరింటెండెంట్ కె.కృష్ణవేణి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా వీటిని అందజేశారు. స్వచ్ఛంద సేవాసంస్థకు చెందిన ప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్ ఆరి్థక సహాయంతో జైలు నుంచి విడుదలైన 19 మందికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులతోపాటు, వారు ఇళ్లకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.500 చొప్పున నగదును అందించారు. కడపలో కూడా చినజీయర్ స్వామి ట్రస్ట్ కుట్టుమిషన్లు అందజేసింది. బాలింతగా జైలుకు.. నాలుగేళ్ల కుమార్తెతో సహా విడుదల రాజమహేంద్రవరం మహిళా సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీల్లో ఒకరు నాలుగేళ్ల కుమార్తెతో సహా విడుదలైంది. ఆరోనెల గర్భిణిగా ఉండగా శిక్షపడటంతో ఆమె జైలుకు వచ్చింది. జైలులోనే పురుడు పోసుకొని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం నాలుగేళ్ల వయస్సున్న పసిపాప రాజమహేంద్రవరం అంగన్వాడీ స్కూల్లో చదువుతోంది. తల్లితోపాటు నాలుగేళ్లు జైలులోనే ఉండి శుక్రవారం స్వేచ్ఛాలోకంలోకి అడుగుపెట్టింది. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి వుంటాం మహిళల ప్రాధాన్యతను గుర్తించి శిక్షపడిన ఖైదీలను విడుదల చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా జీవిస్తాం. జీవితకాలం వైఎస్ జగన్ పేరు చెప్పుకొంటాం. – గ్రేసమ్మ, కడప జైలు నుంచి విడుదలైన కర్నూలు జిల్లా వాసి మహిళలను గుర్తించిన సీఎం కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే. మాకు విముక్తి కల్పించిన ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. మా కుటుంబాల సంక్షేమానికి పాటుపడిన ఆయన రుణం తీర్చుకోలేనిది. – నారాయణమ్మ, అనిమెల, విఎన్‌పల్లె, వైఎస్సార్ జిల్లా -
19 మంది మహిళా ఖైదీల విడుదల
రాజమహేంద్రవరం : మహిళా జీవిత ఖైదీలు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల అవుతున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలయ్యారు. కొన్ని పూచీ కత్తులపై రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకు మార్గం సుగుమం చేసిన విషయం తెలిసిందే. శిక్షా కాలం పరిమితి ముగిసే వరకూ ప్రతీ మూడు నెలలకు ఒక సారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. (చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎస్పీ చరణ్ హర్షం) బయటకు వెళ్ళిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసి ముందుస్తూ విడుదల రద్దు అవుతుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది విడుదల కాగా వారిలో నలుగురు డీగ్రీ చదివినవారు ఉండగా, ఇద్దరు ఎం.ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. సెంట్రల్ జైల్ నుంచి ప్రత్యేకంగా మహిళా ఖైదీలు మాత్రమే విడుదల కావడం రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారి కావడంతో ఖైదీల కుటుంబాలలో ఆనందాలు వెల్లువెత్తాయి. తమ కుటుంబాలతో గడిపే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఖైదీల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైన మహిళలకు ఎంపీ మార్గాని భరత్ రామ్ నిత్యావసరాలు ,దారి ఖర్చులు అందించగా, చిన జీయర్ ట్రస్ట్ కుట్టుమిషన్లు, చందనా బ్రదర్స్ నిర్వాహకులు చందనా నాగేశ్వర్ మహిళలకు చీరలు అందచేశారు.(చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..) గర్భవతిగా జైలుకు వచ్చి పసిబిడ్డతో విడుదల రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఒక మహిళా ఖైదీ గర్భవతిగా జైలుకు వచ్చింది. శిక్ష అనుభవిస్తూ అక్కడే పురుడు పోసుకుంది. ఆమెకు జన్మించిన పాపకు ప్రస్తుతం నాలుగేళ్లు. పసి పాపతోనే ఆ మహిళ జైలులో డిగ్రీ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా క్షమాభిక్ష ప్రసాదించడంతో తల్లి బిడ్డ శుక్రవారం విడుదల అయ్యారు. మహిళా జైలులో ఖైదీలకు టైలరింగ్, కవర్లు తయారీ, బేకరీ, తదితర వృత్తులలో శిక్షణ ఇచ్చారు. ఇక ఖైదీలు విడుదలైన అనంతరం వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు, పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు సంస్ధల సహకారం తో మహిళా ఖైదీలకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జైల్ అధికారులు తెలిపారు. కాగా విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు మహిళ ఖైదీలు విడుదల అయ్యారు. విడుదలైన మహిళా ఖైదీలు గల్లేలా కాంతమ్మ (శ్రీకాకుళం జిల్లా) నీలపు రోజా (విశాఖపట్నం). సీఎం జగన్ మహిళ ఖైదీల విషయంలో మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి మహిళా జైలు నుండి 19 మంది, కడప 27, నెల్లూరు 5, విశాఖపట్నం నుంచి ఇద్దరు విడుదలకు రంగం సిద్ధమైంది. విడుదలకు ఏపీ సర్కార్ కొన్ని షరతులు విధించింది. రూ. 50 వేల రూపాయల పూచీకత్తు బాండ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.శిక్ష కాల పరిమితి ముగిసేవరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్‌కి హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి ముందస్తు విడుదల రద్దు చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్) (చదవండి: 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు) -
ఇదే మొదటిసారి.. జాబితా సిద్ధం..
రాజమహేంద్రవరం క్రైం: రాష్ట్రంలోని మహిళా జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 131 నంబర్ జీఓ విడుదల చేసింది. మహిళా జీవిత ఖైదీలకు ప్రత్యేకంగా క్షమాభిక్ష జీఓ విడుదల చేయడం ఇదే మొట్ట మొదటిసారి. ఇప్పటి వరకూ పురుషులతో కలిపి ఇస్తూ వచ్చేవారు. మహిళా ఖైదీల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక జీఓ విడుదల చేయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళా ఖైదీలు విడుదల కావాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో ఆలస్యమైంది. ఆ జీఓ ప్రకారం.. 2020 ఆగస్టు 15వ తేదీ నాటికి రిమాండ్, రెమిషన్ కలిపి ఐదేళ్లు పూర్తిచేసుకున్న వారు క్షమాభిక్షకు అర్హులు. రాజమహేంద్రవరం మహిళా సెంట్రల్ జైల్ నుంచి సుమారు 21 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. కడప జైలు నుంచి 29 మంది, విశాఖపట్నం జైలు నుంచి ఇద్దరిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎంతమంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హులో జైలు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వ జైళ్ల శాఖకు పంపిస్తారు. అక్కడ పరిశీలన చేసిన అనంతరం మహిళా జీవిత ఖైదీలను విడుదల చేస్తారు. (చదవండి: దేశ చరిత్రలోనే గొప్ప నిర్ణయం..) వీరు అనర్హులు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొందరు మహిళా ఖైదీలు క్షమాభిక్షకు అనర్హులు. కిడ్నాప్ కేసులలో శిక్ష పడిన వారు, రేప్ కేసులో శిక్ష పడిన మహిళలు, మరణ శిక్ష పడిన ఖైదీలు, మూడేళ్లలో జైలు నుంచి పరారైన జీవిత ఖైదీలు, పెరోల్, పర్లోపై వెళ్లి ఆలస్యంగా జైలుకు వచ్చిన వారు అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముద్దాయిలు, ముఠా తగాదాలలో శిక్ష పడిన వారు, నార్కో అనాలసిస్ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారు, దేశ ద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వారు, కిరాయి హంతకులు కూడా అనర్హులే. -
మహిళలపై మమకారం
సాక్షి, అమరావతి: మహిళలపై రాష్ట్ర ప్రభుత్వానికున్న మమకారం మరోసారి రుజువైంది. జైళ్లలో మగ్గిపోతున్న మహిళా జీవిత ఖైదీలను విడుదల చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయానికి విశేష స్పందన లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా మహిళా ఖైదీలు విడుదల కానుండటం గమనార్హం. కుటుంబానికి మహిళే ఆధారం అనే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తనే గీటురాయిగా దాదాపు 55 మంది మహిళా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించాలని నిర్ణయించింది. – రాష్ట్రంలోని జైళ్లలో 147 మంది మహిళా జీవిత ఖైదీలున్నారు. వీరిలో తీవ్రమైన నేరాలు చేసిన వారిని సుప్రీం కోర్టు తీర్పులు, మార్గదర్శకాలకు లోబడి విడుదల చేయడం లేదు. ప్రధానంగా లైంగిక దాడులకు సహకరించడం, బాలలను కిడ్నాప్ చేయడం, చిన్న పిల్లల్ని హత్య చేయడం లాంటి తీవ్ర నేరాల్లో జీవిత ఖైదు పడిన మహిళలను విడుదల చేయరు. – క్షణికావేశంలో నేరాలకు పాల్పడటం, యాధృచ్చికంగా నేరాల్లో పాల్గొనడం, కొన్ని సమయాల్లో పరిస్థితులను బట్టి నేరాల్లో పాలు పంచుకోవడం లాంటి అంశాలను ఖైదీల విడుదలకు పరిగణలోకి తీసుకోనున్నారు. అటువంటి వారు వేగంగా సత్ప్రవర్తనకు అలవాటు పడి పశ్చాతాపంతో మళ్లీ నేరాలు చేసే అవకాశం లేదు. ఈ కోణాల్లో పరిశీలిస్తే మహిళా జీవిత ఖైదీల్లో 55 మంది విడుదలకు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ జాబితాలను ప్రభుత్వం నియమించిన కమిటీ సమీక్షించిన అనంతరం ఖైదీలను విడుదల చేయనున్నారు. –రాజమహేంద్రవరం మహిళా ప్రత్యేక కారాగారం నుంచి 21 మంది, వైఎస్సార్ కడప ప్రత్యేక మహిళా కారాగారం నుంచి 27 మంది, విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి ఇద్దరు, నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు మహిళా ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఉపాధికి ఢోకా లేదు.. విడుదల కానున్న మహిళా జీవిత ఖైదీల ఉపాధికి ఇబ్బంది లేదని జైలు జీవితంలో వారు సాధించిన నైపుణ్యాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో దూర విద్య ద్వారా బీఏ (డిగ్రీ) పూర్తి చేసిన వారు ఒకరు కాగా బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న వారు ఒకరు, చివరి సంవత్సరంలో ఉన్నవారు ఆరుగురు ఉన్నారు. మిగిలిన మహిళా ఖైదీలు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, చీరల పెయింటింగ్, బేకరీ, కాయిర్ మ్యాట్స్, కవర్లు, రుచికరమైన పిండివంటల తయారీలో నైపుణ్యం సాధించారు. వారంలో విడుదల – హోంమంత్రి మేకతోటి సుచరిత సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలను విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మహ్మద్ హసన్ రేజాతో కలిసి హోంమంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన మహిళా జీవిత ఖైదీలను మానవత్వంతో విడుదల చేసేలా ప్రభుత్వం జీవో ఎంఎస్ 131 విడుదల చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళల్లో 55 మంది వారం రోజుల్లోగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాను కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తుంది. అనంతరం వారిని విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: ఐదేళ్లపాటు జైలుశిక్ష పూర్తయిన మహిళా ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళా జీవిత ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విడుదల చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. (చదవండి: బాలల బంగారు భవితకు సర్కార్ భరోసా) దీనికి సంబంధించిన కసరత్తుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(హోంశాఖ), సభ్యులుగా ప్రభుత్వ కార్యదర్శి(లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్, లా డిపార్ట్మెంట్), డీజీపీ లేదా డీజీపీ నామినేట్ చేసిన పోలీస్ అధికారి, ఏపీ సీఐడీ చీఫ్ లీగల్ అడ్వైజర్, జిల్లా జడ్జి, ఇంటెలిజెన్స్ ఏడీజీ, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఉంటారు. సంబంధిత సమాచారాన్ని సమీక్షించి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండే వారి జాబితాను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. మహిళా జీవిత ఖైదీల్లో ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకుని, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటారు. (చదవండి: మానవత్వం చాటుకున్న మంత్రులు) -
కారాగారాల్లోనూ కోవిడ్
బీజింగ్: కోవిడ్–19(కరోనా వైరస్) ఇప్పుడు చైనాలో జైళ్లనూ వణికిస్తోంది. ఖైదీలకు కోవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో 500కి పైగా కరోనా కేసులు నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. వూహాన్లో మహిళా జైలులో అత్యధికంగా కేసులు నమోదైనట్టుగా జైళ్ల శాఖ తెలిపింది. షాండాంగ్ ప్రావిన్స్‌లో రెంచెంగ్ జైలులో 200 మంది ఖైదీలు, ఏడుగురు గార్డులకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దీంతో సమగ్ర దర్యాప్తుకి ఆదేశించిన ప్రభుత్వం రెంచెంగ్ జైలుకి చెందిన ఏడుగురు అధికారుల్ని సస్పెండ్ చేసింది. ఒక్కరోజే 118 మంది మృతి కరోనా మృతులు రోజు రోజుకి పెరుగుతున్నారు. హుబాయ్ ప్రావిన్స్‌లో ఒక్కరోజే 118 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,236కి చేరుకుంది. ఇప్పటివరకు 75,400 కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకీ మృతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు వ్యాధి భయంతో మాస్క్‌ల వినియోగం బాగా పెరిగింది. దీంతో డిమాండ్‌కి తగ్గ సప్లయి లేక భారీగా కొరత ఏర్పడింది. దీంతో హాంగ్‌కాంగ్‌లో చాలామంది సొంతంగా మాస్క్‌లు తయారు చేసుకుంటున్నారు. కొందరు జేబు రుమాళ్లకే ఎలాస్టిక్ తగిలించి మాస్క్‌గా వాడుతున్నారు. మెరుగుపడుతున్న భారతీయుల ఆరోగ్యం జపాన్ తీర ప్రాంతంలో డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా వైరస్ సోకిన భారతీయుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. కరోనా సోకిన ఎనిమిది మందికి చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని జపాన్‌లో భారత్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలకూ వ్యాప్తి కోవిడ్ వ్యాప్తి చెందిన దేశాల జాబితాలో తాజాగా మరో రెండు దేశాలు చేరాయి. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. తాజాగా డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి ఇజ్రాయెల్‌కి చేరుకున్నాక ఒక ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఆ నౌకలో మొత్తం 15 మంది ఇజ్రాయెల్ దేశస్తులు ఉంటే వారిలో నలుగురికి కరోనా ఉన్నట్టు తేలడంతో అక్కడే ఉంచి చికిత్స చేస్తున్నారు. మిగిలిన 11 మందిని వారి దేశానికి పంపారు. అయితే ఇజ్రాయెల్‌కు చేరుకున్నాక ఒక ప్రయాణికుడికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఇక లెబనాన్‌లో 45 ఏళ్ల వయసున్న ఒక మహిళకు వైరస్ సోకినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. -
మహిళా ఖైదీల స్థితిగతులపై అధ్యయనం
ఆరిలోవ (విశాఖపట్నం): విశాఖ కేంద్రకాగారాన్ని ఎక్స్పర్ట్ కమిటీ సోమవారం సందర్శించింది. ఈ కమిటీలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య, సభ్యులు డబ్ల్యూసీడీఏ అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీ కె.సునీత, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ వై.వి.అనురాధ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ కె.సంధ్యారాణి, కాలేజి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సుజాత శర్మ, డబ్ల్యూడీ అండ్ సీబ్ల్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ కమిషనర్ హెచ్.అరుణ జైల్‌ను సందర్శించిన కమిటీలో ఉన్నారు. ఇక్కడ జైల్లో ఎంతమంది మహిళా ఖైదీలుంటున్నారు, వారు ఏఏ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు, వారికి ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాల గురించి ముందుగా జైల్ పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్‌ని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మహిళా ఖైదీలు ఉండే బ్యారక్‌కు వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళా ఖైదీలతో కమిటీ సభ్యులు వేర్వేరుగా మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఆహారంలో నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. వారు ఏఏ కేసుల్లో జైలుకు వచ్చారో అడిగి తెలసుకొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మహిళా ఖైదీల పిల్లలతో మాట్లాడారు. వారికి ఇక్కడ ఉన్న ఇబ్బందులు, వారి చదువు ఎలా సాగుతోంది తదితర వాటిని అడిగారు. జైల్ ఆస్పత్రి, ఇతర బ్లాకులు పరిశీలించారు. వారితో జైల్ డిప్యూటీ సూపరిం టెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు, జైలర్లు పాల్గొన్నారు. -
మహిళా ఖైదీలకు శుభవార్త..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో మహిళా ఖైదీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శాఖ పలు మార్పులు చేయనుంది. జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి కొత్త జైలు సంస్కరణలను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకా గాంధీ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. జైళ్లలో మహిళల స్థితిగతులపై చాలా ఆందోళనకరమైన, అవాంఛనీయ నివేదికలు వచ్చాయని మేనకా గాంధీ చెప్పారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక కమిటీ ఉండాల్సి అవసరం ఉందన్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సహకారంతో మంత్రిత్వ శాఖ తయారు చేసిన ప్రొ ఫార్మాను దేశవ్యాప్తంగా 144 సెంట్రల్ జైళ్లకు పంపిణీ చేసినట్టు చెప్పారు. చాలా జైళ్లలో అధిక సంఖ్యలో మహిళా ఖైదీలు ఉండడంతో కనీస సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు, శానిటరీ నాప్కిన్లు, విద్యా సౌకర్యాలతోపాటు చట్టబద్దమైన అవగాహన వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందడం లేదని మంత్రి పేర్కొన్నారు. మహిళా ఖైదీలకోసం కొత్త జైలు నిబంధనావళిని సిద్ధం చేయటానికి తమ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీని కూడా సంప్రదించినట్టు మేనకా గాంధీ చెప్పారు. మరోవైపు వీరికి జైళ్లలో నైపుణ్యం అభివృద్ధి మరియు ఔత్సాహిక విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొన్ని నైపుణ్యం ఆధారిత శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఇంతకుముందు అనేక సిఫార్సులు అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ వీటి అమలు విషయంలో అధికారులు సీరియస్‌గా తీసుకోలేదన్నారు. తాజాగా వీటిని కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నామని ఎన్సీడబ్ల్యు యాక్టింగ్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ప్రకటించారు. -
క్లిక్.. క్లిక్...
రిపబ్లిక్ డే వర్ణాలు... జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం. న్యూఢిల్లీ రాజ్‌పథ్‌లో సైనిక విన్యాసాలు, రాష్ట్రాల శకటాలు, కళాకారుల ప్రదర్శనలు, విద్యార్థుల నృత్యాలు... చూడటానికి రెండు కళ్లూ చాలవు. సోమవారం అక్కడ డ్రస్ రిహార్సల్స్ జరిగాయి. పిల్లలు ఉత్సాహంగా నృత్యం చేస్తున్న ఫొటో ఇది. ఖైదీ నృత్యం ఈ ఫొటోలో ఉత్సాహంగా నృత్యం చేస్తున్నది డాన్సర్లు కాదు. జబల్పూర్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంట్రల్ జైల్లో ఉన్న మహిళా ఖైదీలు. నిన్న నేతాజీ జయంతి సందర్భంగా జైలులో వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలను ఉల్లాసభరితం చేయడానికి మహిళా ఖైదీలు ఇలా నృత్యాలు చేశారు. చాన్ ఇన్ ముంబై... జాకీచాన్ అంటే తెలియనిది ఎవరికి? భారతీయ నటులతో చైనా– భారత్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మితమైన ‘కుంగ్‌ఫూ యోగా’లో జాకీచాన్ హీరో. అతడితో పాటుగా మన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా నటించాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం నిన్న జాకీచాన్ ముంబై చేరుకున్నాడు. అభిమానులంతా తమ హీరోని చూసి పులకించిపోయారు. -
కమెడియన్ ఆలీ.. ఖైదీల 'శ్రీమంతుడు'
హైదరాబాద్: 'శ్రీమంతుడు' సినిమా స్ఫూర్తితో సినీ నటులు, రాజకీయ నాయకులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. కాగా, అందరికంటే భిన్నంగా.. దత్తత విషయంలో మరో ముందడుగు వేశారు కమెడియన్ ఆలీ. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం చంచల్ గూడా జైలులో సందడిచేసిన ఆలీ.. నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా సెలబ్రీటీలను తీసుకొచ్చి ఖైదీలతో మాట్లాడించే అధికారులు ఈ సారి ఆలీని ఆహ్వానించారు. జైలు ప్రాంగణంలో ఆడా, మగ ఖైదీలు, అధికారులు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్న ఆలీ.. హాస్యోక్తులతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీఐజీ నర్సింహ మాట్లాడుతూ.. ఓ ఖైదీని దత్తత తీసుకోవాలని అలీకి సూచించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆలీ.. నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ బొజ్జ రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
మహిళా ఖైదీలకు ప్రత్యేక ప్లేస్మెంట్ డ్రైవ్
న్యూఢిల్లీ: తీహర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు వచ్చే నెలలో ప్రత్యేక క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. పురుష ఖైదీలకు ఉద్యోగ నియామకాల కోసం చేపట్టిన డ్రైవ్‌లో ఎక్కువ మంది సంవత్సరానికి రూ.4.5 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగాన్ని దక్కించుకోవడంతో మహిళా ఖైదీలకు కూడా అవకాశమివ్వాలని నిర్ణయించారు. వివిధ కేసుల్లో అరెస్టయి శిక్ష కాలం పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉన్న ఖైదీల కోసం 2010 నుంచి ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ను జైలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 400 మందికి పైగా ఖైదీలు ఉద్యోగాల్లో చేరారు. అయితే మహిళా ఖైదీలు మాత్రం పెద్దగా లబ్ధి పొందలేదు. కేవలం 15 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. జైలు నంబర్ ఆరులోని మహిళా ఖైదీలకు కొత్త జీవితాన్ని అందించడం కోసం ప్రత్యేక ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నామని తీహర్ జైలు పీఆర్వో సునీల్ గుప్తా ఆదివారం తెలిపారు. వివిధ నేరాల్లో ప్రస్తుతం జైల్లో 600 మంది మహిళా ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వీరిలో అర్హులైన వారందరికి ఉద్యోగం వచ్చేలా చూస్తున్నామని తెలిపారు.