రాజమహేంద్రవరం : మహిళా జీవిత ఖైదీలు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల అవుతున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలయ్యారు. కొన్ని పూచీ కత్తులపై రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకు మార్గం సుగుమం చేసిన విషయం తెలిసిందే. శిక్షా కాలం పరిమితి ముగిసే వరకూ ప్రతీ మూడు నెలలకు ఒక సారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలి. (చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎస్పీ చరణ్ హర్షం)
బయటకు వెళ్ళిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసి ముందుస్తూ విడుదల రద్దు అవుతుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది విడుదల కాగా వారిలో నలుగురు డీగ్రీ చదివినవారు ఉండగా, ఇద్దరు ఎం.ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. సెంట్రల్ జైల్ నుంచి ప్రత్యేకంగా మహిళా ఖైదీలు మాత్రమే విడుదల కావడం రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారి కావడంతో ఖైదీల కుటుంబాలలో ఆనందాలు వెల్లువెత్తాయి. తమ కుటుంబాలతో గడిపే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఖైదీల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైన మహిళలకు ఎంపీ మార్గాని భరత్ రామ్ నిత్యావసరాలు ,దారి ఖర్చులు అందించగా, చిన జీయర్ ట్రస్ట్ కుట్టుమిషన్లు, చందనా బ్రదర్స్ నిర్వాహకులు చందనా నాగేశ్వర్ మహిళలకు చీరలు అందచేశారు.(చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..)
గర్భవతిగా జైలుకు వచ్చి పసిబిడ్డతో విడుదల
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో ఒక మహిళా ఖైదీ గర్భవతిగా జైలుకు వచ్చింది. శిక్ష అనుభవిస్తూ అక్కడే పురుడు పోసుకుంది. ఆమెకు జన్మించిన పాపకు ప్రస్తుతం నాలుగేళ్లు. పసి పాపతోనే ఆ మహిళ జైలులో డిగ్రీ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా క్షమాభిక్ష ప్రసాదించడంతో తల్లి బిడ్డ శుక్రవారం విడుదల అయ్యారు. మహిళా జైలులో ఖైదీలకు టైలరింగ్, కవర్లు తయారీ, బేకరీ, తదితర వృత్తులలో శిక్షణ ఇచ్చారు.
ఇక ఖైదీలు విడుదలైన అనంతరం వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు, పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు సంస్ధల సహకారం తో మహిళా ఖైదీలకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జైల్ అధికారులు తెలిపారు. కాగా విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు మహిళ ఖైదీలు విడుదల అయ్యారు. విడుదలైన మహిళా ఖైదీలు గల్లేలా కాంతమ్మ (శ్రీకాకుళం జిల్లా) నీలపు రోజా (విశాఖపట్నం). సీఎం జగన్ మహిళ ఖైదీల విషయంలో మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment