సాక్షి, అమరావతి: మహిళలపై రాష్ట్ర ప్రభుత్వానికున్న మమకారం మరోసారి రుజువైంది. జైళ్లలో మగ్గిపోతున్న మహిళా జీవిత ఖైదీలను విడుదల చేసేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయానికి విశేష స్పందన లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా మహిళా ఖైదీలు విడుదల కానుండటం గమనార్హం. కుటుంబానికి మహిళే ఆధారం అనే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తనే గీటురాయిగా దాదాపు 55 మంది మహిళా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించాలని నిర్ణయించింది.
– రాష్ట్రంలోని జైళ్లలో 147 మంది మహిళా జీవిత ఖైదీలున్నారు. వీరిలో తీవ్రమైన నేరాలు చేసిన వారిని సుప్రీం కోర్టు తీర్పులు, మార్గదర్శకాలకు లోబడి విడుదల చేయడం లేదు. ప్రధానంగా లైంగిక దాడులకు సహకరించడం, బాలలను కిడ్నాప్ చేయడం, చిన్న పిల్లల్ని హత్య చేయడం లాంటి తీవ్ర నేరాల్లో జీవిత ఖైదు పడిన మహిళలను విడుదల చేయరు.
– క్షణికావేశంలో నేరాలకు పాల్పడటం, యాధృచ్చికంగా నేరాల్లో పాల్గొనడం, కొన్ని సమయాల్లో పరిస్థితులను బట్టి నేరాల్లో పాలు పంచుకోవడం లాంటి అంశాలను ఖైదీల విడుదలకు పరిగణలోకి తీసుకోనున్నారు. అటువంటి వారు వేగంగా సత్ప్రవర్తనకు అలవాటు పడి పశ్చాతాపంతో మళ్లీ నేరాలు చేసే అవకాశం లేదు. ఈ కోణాల్లో పరిశీలిస్తే మహిళా జీవిత ఖైదీల్లో 55 మంది విడుదలకు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ జాబితాలను ప్రభుత్వం నియమించిన కమిటీ సమీక్షించిన అనంతరం ఖైదీలను విడుదల చేయనున్నారు.
–రాజమహేంద్రవరం మహిళా ప్రత్యేక కారాగారం నుంచి 21 మంది, వైఎస్సార్ కడప ప్రత్యేక మహిళా కారాగారం నుంచి 27 మంది, విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి ఇద్దరు, నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు మహిళా ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు.
ఉపాధికి ఢోకా లేదు..
విడుదల కానున్న మహిళా జీవిత ఖైదీల ఉపాధికి ఇబ్బంది లేదని జైలు జీవితంలో వారు సాధించిన నైపుణ్యాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో దూర విద్య ద్వారా బీఏ (డిగ్రీ) పూర్తి చేసిన వారు ఒకరు కాగా బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న వారు ఒకరు, చివరి సంవత్సరంలో ఉన్నవారు ఆరుగురు ఉన్నారు. మిగిలిన మహిళా ఖైదీలు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, చీరల పెయింటింగ్, బేకరీ, కాయిర్ మ్యాట్స్, కవర్లు, రుచికరమైన పిండివంటల తయారీలో నైపుణ్యం సాధించారు.
వారంలో విడుదల
– హోంమంత్రి మేకతోటి సుచరిత
సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలను విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మహ్మద్ హసన్ రేజాతో కలిసి హోంమంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన మహిళా జీవిత ఖైదీలను మానవత్వంతో విడుదల చేసేలా ప్రభుత్వం జీవో ఎంఎస్ 131 విడుదల చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళల్లో 55 మంది వారం రోజుల్లోగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాను కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తుంది. అనంతరం వారిని విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment