Shabnam Case: Story Of Shabnam Case In Telugu | షబ్నమ్‌.. ఒక వెంటాడే కథ - Sakshi
Sakshi News home page

షబ్నమ్‌.. ఒక వెంటాడే కథ

Published Tue, Feb 23 2021 5:10 AM | Last Updated on Tue, Feb 23 2021 10:33 AM

First Woman to be Hanged in Independent India - Sakshi

భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మొదటిసారి ఒక మహిళా ఖైదీకి ఉరి వేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ మహిళా ఖైదీ పేరు షబ్నమ్‌. 2008లో తన ప్రియుడితో కలిసి ఆమె తన కుటుంబ సభ్యులనే హతమార్చిందని ఈ తీర్పు. అంతవరకే అయితే ఈ కథ వెంటాడదు. షబ్నమ్‌ ఇంగ్లిష్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. టీచర్‌గా పని చేసి విద్యార్థుల ఇష్టమైన టీచర్‌గా మారింది. ఆమె కాలేజీ ఫీజులు కట్టగా చదువుకున్న జూనియర్‌ ఆమె జైలుకు వెళ్లడంతో ఆమె కొడుకును దత్తత తీసుకున్నాడు.

ఆమె సైఫి ముస్లిం, ప్రియుడు పఠాన్‌ ముస్లిం కావడం వీరి ప్రేమకు ప్రధాన అడ్డంకి అయ్యింది. ‘ఆస్తి కోసం తన వాళ్లను హతమార్చారు’ అని ఒకసారి, ‘ప్రియుడే చంపాడు’ అని ఒకసారి ఆమె చెప్పింది. అవన్నీ పక్కన పెడితే– భారతదేశంలో ఉరిశిక్షలు నిర్థారణ అయ్యి ఉరికి ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు వెనుకబడిన,  మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం వెనుక ‘నేరానికి–శిక్షకి–వెనుకబాటుతనానికి’ ఉన్న లంకె కూడా చర్చకు వస్తోంది.

‘ఉరిశిక్ష’ అని ఈ దేశంలో చర్చ జరిగినప్పుడల్లా ఆ ఉరిశిక్ష ‘ఎవరికి’ పడింది అనేది పెద్ద గమనార్హం అవుతుంది. చట్టం, న్యాయం అందరికీ సమానమే అని అనుకుంటాం, చెబుతుంటారు గాని చట్టం, న్యాయం అందరికీ సమానమేనా అని సందేహం వచ్చే గణాంకాలు ఎదురుగా ఉంటాయి. ఈ దేశంలో చకచకా శిక్షలు అమలయ్యేది బలహీనుల మీదేననీ, ఉరిశిక్ష అమలయ్యేది కూడా బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల మీదేనని ఆలోచనాపరులు గణాంకాలు చూపిస్తే వాటిని కాదనే జవాబు ఎవరి దగ్గరా లేదు.

అలాగని ఈ ఆలోచనాపరులు నేరాలకు శిక్షలు వద్దని చెప్పడం లేదు. శిక్షల అమలులో వివక్ష ఉంది అని మాత్రమే చెబుతుంటారు. ఇప్పుడు ఉరిశిక్ష వార్తలలో ఉన్న షబ్నమ్‌ ఒక స్త్రీ కావడం, ఆమెకు క్షమాపణ దక్కకపోవడం, ఆమెలా ఈ దేశంలో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు కేవలం బలహీన, మైనారిటీ వర్గాల వారే కావడంతో వీరంతా ‘అడ్డంకులు లేని పూర్తి శిక్ష’కు యోగ్యులుగా భావించే భావజాలం ఉందని గ్రహించాల్సి వస్తుంది.

ఎవరీ షబ్నమ్‌?
శిక్ష కచ్చితంగా అమలవ్వాలి అని భారత పాలనావ్యవస్థ గట్టిగా అనుకుంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఉరిశిక్ష అమలయ్యే ఖైదీగా చరిత్రలో నిలవబోతున్న పేరు షబ్నమ్‌. ఈమెది ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలోని బవాన్‌ఖేడి గ్రామం. తన ఇంటి ఎదురుగా కలప మిల్లులో పని చేసే సలీమ్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి 2008 ఏప్రిల్‌లో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న షబ్నమ్‌ కుటుంబ సభ్యులు ఏడుగురిని దారుణంగా హతమార్చారని అభియోగం.

కోర్టులో నేరం నిరూపణ కావడంతో 2012లో స్థానిక కోర్టు ఇరువురికీ ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఆ శిక్షలను బలపరిచాయి. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా నిరాకరింపబడింది. కనుక షబ్నమ్‌కు ఉరితీత తప్పదని ప్రస్తుతం వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఒక జైలులో, సలీమ్‌ ఒక జైలులో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో స్త్రీలను ఉరితీసే ఉరికంబం కేవలం మధుర జైలులోనే ఉంది. దానిని ఉపయోగించి 150 ఏళ్లు అవుతోంది. షబ్నమ్‌ను ఉరి తీయాలంటే అక్కడే తీయాలి. అందుకు జైలు అధికారులు తలారీని సిద్ధం చేశారు. డెత్‌ వారెంట్‌ రావడమే తరువాయి.

సరే.. షబ్నమ్‌ ఎవరు?
షబ్నమ్‌ ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఊళ్లో టీచర్‌గా పని చేసింది. ఆమెది ముస్లింలలో ఒక తెగ. ఆమె ప్రేమించిన సలీమ్‌ ది మరో తెగ. ఈ తెగల అంతరం వీరి ప్రేమకు అడ్డంకిగా మారింది. అంతే కాదు సలీం కేవలం ఆరో క్లాసు చదువుకున్నాడు. పేదవాడు. అది కూడా షబ్నమ్‌ తల్లిదండ్రులకు నచ్చలేదు. కాని అప్పటికే ఆమె గర్భం దాల్చింది. ఈ ప్రేమ, గర్భం ఆమెను విచక్షణను కోల్పోయేలా చేశాయి. ఒకరోజు ప్రియుణ్ణి అర్ధరాత్రి ఇంట్లోకి రానిచ్చింది.

ఇద్దరూ కలిసి షబ్నమ్‌ కుటుంబం లో 7గురిని హతమార్చారు. ఆ తర్వాత షబ్నమ్‌ ‘ఆస్తి కోసం నా వాళ్లను చంపారు’ అని ఒకసారి ‘సలీమ్‌ నిర్ణయం ఇది’ అని ఒకసారి చెప్పింది. అదే సంవత్సరం డిసెంబర్‌లో జైలులోనే షబ్నమ్‌ కొడుకుకు జన్మనిచ్చింది. అతనికి తాజ్‌ అని పేరు పెట్టింది. ఆరేళ్లవరకూ తల్లి దగ్గరే ఉన్న తాజ్‌ను షబ్నమ్‌తో పాటుగా కాలేజీలో చదువుకున్న ఆమె జూనియర్, ప్రస్తుతం జర్నలిస్ట్‌ అయిన ఉస్మాన్‌ సైఫీ దత్తత తీసుకున్నాడు. ‘నాకు తెలిసిన షబ్నమ్‌ ఈమె కాదు. షబ్నమ్‌ నా కాలేజీ ఫీజు కట్టింది.

టీచర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె రుణం తీర్చుకోవడానికి ఆమె కొడుకును దత్తత తీసుకోవాలని నేను నా భార్యతో చెప్పాను’ అన్నాడు ఉస్మాన్‌ సైఫీ. అతని దగ్గర పెరుగుతున్న షబ్నమ్‌ కొడుకు ప్రతి మూడు నెలలకు తల్లిని చూసి వస్తుంటాడు. ఇటీవల అతను ‘మా అమ్మను క్షమించండి’ అని రాష్ట్రపతికి అప్పీలు చేశాడు. ‘నన్ను చూడాలని బలవంతం చేయకు. బాగా చదువుకో. నన్ను ఎప్పటికీ మర్చిపోకు’ అని షబ్నమ్‌ తన కొడుక్కి చెప్పింది.

ఏం దారి ఉంది?
షబ్నమ్‌ తన క్షమాభిక్ష కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. తన క్షమాభిక్ష నిరాకరింపబడటాన్ని సుప్రీం కోర్టులో తిరిగి సవాలు చేయనుంది.  ‘ఇది షబ్నమ్‌కు, సలీమ్‌కు పడ్డ ఉరిశిక్ష. ఇరువురికీ సకల న్యాయపరమైన అప్పీల్స్‌ ముగిశాకనే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది’ అని షబ్నమ్‌ తరఫున న్యాయవాది తెలిపింది. షబ్నమ్‌ను ఆమె బంధువులు ఎవరూ కనికరించడం లేదు. ‘ఆమె చనిపోతే ఆమె మృతదేహాన్ని కూడా తీసుకోం’ అని వారు అన్నారు. షబ్నమ్‌ ఒక జీవచ్ఛవం. ఆమె మరణించిందని ఉరిశిక్ష ద్వారా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement