independent india
-
ఎలక్టోరల్ బాండ్లు.. అతిపెద్ద కుంభకోణం
బెంగళూరు: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేదాకా అధికార బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ వేల కోట్ల రూపాయలు నొక్కేసిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. నేను తినను, ఇతరులను తిననివ్వనంటూ ప్రగల్భాలు పలికిన మోదీ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు బీజేపీకి ఇంత సొమ్ము ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, అవినీతికి పాల్పడిన బడా వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమరి్పంచుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శుక్రవారం ఆరోపించారు. దర్యాప్తు సంస్థల భయంతో బీజేపీకి లొంగిపోయారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంపై ప్రజాక్షేత్రంలో వెళ్లి పోరాటం సాగిస్తామని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్‌పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈ బాండ్ల వ్యవహారంలో క్విడ్ ప్రో కో చోటుచేసుకుందని, అవకతవకలు జరిగాయని అన్నారు. ఇదొక వసూళ్ల రాకెట్: రాహుల్ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పథకం కింద వసూలు చేసిన సొమ్మును వివిధ రాష్ట్రాల్లో పారీ్టలను చీల్చడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ దుర్వినియోగం చేసిందని రాహుల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ మినహా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన కాంట్రాక్టులకు, ఎలక్టోరల్ బాండ్లకు మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. -
తొలి ఓటర్ ఇక లేరు
షిమ్లా: స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటర్‌గా చరిత్రకెక్కిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ ఇక లేరు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామంలోని స్వగృహంలో శనివారం తెల్లవారుజామున మరణించారు. అయితే తుదిశ్వాస వదిలేందుకు ముందు కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం! రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈ నెల 2న కల్పా గ్రామంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నేగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం ఇదే తొలిసారి! ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు నేగీ 1917 జూలైలో జన్మించారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1975లో పదవీ విరమణ పొందారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఆయనకెంతో ఇష్టం. ఇప్పటిదాకా 34సార్లు ఓటు వేశారు. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ.. ఎన్నిక ఏదైనా సరే 1951 నుంచి ఏనాడూ ఓటు వేయడం మర్చిపోలేదు. 2010లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కల్పా గ్రామంలో నేగీని ఘనంగా సత్కరించారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం నేగీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గూగుల్ సంస్థ ‘ప్లెడ్జ్ టు ఓట్’ ప్రచారంలో భాగంగా నేగీపై వీడియో రూపొందించింది. ఈ వీడియో ద్వారా ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రతి ఎన్నిక ఓ పండుగ లాంటిదేనని, ప్రతి ఓటూ విలువైనదేనని, ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేసి, మంచి నాయకులను ఎన్నుకోవాలని నేగీ తరచూ చెబుతుండేవారు. యువతకు స్ఫూర్తిదాయకం: మోదీ తొలి ఓటర్ నేగీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. ఆయన 34 సార్లు ఓటు వేయడం గొప్ప విషయమని కొనియాడారు. ‘‘అనారోగ్యంతో బాధపడుతూ కూడా రెండు రోజుల క్రితమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలా మరణానికి ముందు కూడా తన విధిని చక్కగా నిర్వర్తించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకం’’ అంటూ ప్రశంసించారు. భారమైన హృదయంతో తలవంచి నేగీకి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తదితరులు నేగీ మరణం పట్ల సంతాపం తెలిపారు. నేగీ ఇక లేరన్న నిజం బాధాకరమని పేర్కొన్నారు. బీజేపీ కూడా ట్విట్టర్లో సంతాపం ప్రకటించింది. నేగీ మృతి పట్ల ఎన్నికల సంఘం కూడా సంతాపం ప్రకటించింది. ఇలా తొలి ఓటు... దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952 జనవరి–ఫిబ్రవరిలో జరిగాయి. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా చినీ గ్రామంలో (నేటి కల్పా) తీవ్రమైన చలితోపాటు ముందుగానే మంచు కురుస్తుండడంతో 1951 అక్టోబర్ 25న్నే పోలింగ్ జరిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్లి నేగీ మొదటి ఓటు వేశారు. అలా స్వతంత్ర భారత్‌లో ఓటేసిన తొలి పౌరుడిగా రికార్డు సృష్టించారు. -
స్వతంత్ర భారత గణతంత్ర సారథులు
భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతి. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి. కొన్ని సందర్భాలలో, కొందరు రాష్ట్రపతులు ప్రధానితో విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ విషయంలోనే ఇది రుజువైంది. ఒక బలమైన ప్రధానితోనే ఆయన తన మనోగతాన్ని వ్యక్తీకరించడానికి వెనుకాడలేదు. తరువాత కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. చదవండి: జెండా ఊంఛా రహే హమారా! రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ కొన్ని బిల్లులను వెనక్కి తిప్పి పంపారు.అందులో తపాలా బిల్లు ఒకటి. వాస్తవానికి కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసిన ఏ అంశాన్నయినా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. ప్రణబ్‌కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తరువాత నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు! స్వాతంత్య్ర సమరయోధులు, ప్రపంచ ప్రఖ్యాత విద్యావంతులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తలు, న్యాయ నిపుణులు రాష్ట్రపతి పదవిని అలంకరించారు. జూలైలో పదవీ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతి. 1950లో భారత్ గణతంత్ర దేశమైన తరువాత ఆ పదవిలోకి వచ్చిన 15 మందిలో ఎనిమిది మంది రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారే. వారిలో ఆరుగురు కాంగ్రెస్ మద్దతుతో గెలిచినవారు. పన్నెండు మంది ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దేశంలో అధికార పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సంప్రదాయమే ప్రధానంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు రాష్ట్రపతులయ్యారు. వారే రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్. ఆయన అధ్యాపకుడు, న్యాయవాది. గాంధేయవాది. నెహ్రూతో సమంగా గాంధీజీతో కలసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. రెండవసారి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఏకైన రాజనీతిజ్ఞుడు రాజెన్ బాబు. ప్రథమ ప్రధాని వలెనే, తొలి రాష్ట్రపతి రాజేన్ బాబు కూడా పన్నెండేళ్ల నూట ఏడు రోజులు ఉన్నారు. ఇప్పటి వరకు అదే రికార్డు. హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూతో విభేదించారు. సోవ్‌ునాథ్ ఆలయం ప్రతిష్టకు తాను హాజరు కావడంపై నెహ్రూ అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.ఆయన తత్త్వశాస్త్ర వ్యాఖ్యాత. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు. యునెస్కోకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. మూడవ రాష్ట్రపతి డాక్టర్ జకీర్ హుస్సేన్. ఆయన రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ముస్లిం. అలీగఢ్ విశ్వవిద్యాలయం చాన్సలర్‌గా పనిచేశారు. ఆయన పదవిలో ఉండగానే కన్నుమూశారు. నాల్గవ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి. కార్మికోద్యమం నుంచి వచ్చారు. ఈయన ఎన్నిక వివాదాస్పదమైన మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని నాటి ప్రధాని ఇందిర కూడా పార్టీ సమావేశంలో ఆమోదించారు. కానీ తరువాత వీవీ గిరిని అభ్యర్థిగా నిలిపారు. పార్టీ అభ్యర్థి నీలం ఓడిపోయారు. గిరి విజయం సాధించారు. ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. జకీర్ హుస్సేన్ మాదిరిగానే ఈయన కూడా పదవిలో ఉండగానే చనిపోయారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశం అత్యవసర పరిస్థితి విధింపు. ఆ ఆదేశాల మీద మారు మాట లేకుండా అర్ధరాత్రి సంతకం చేసి పంపిన రాష్ట్రపతిగా ఈయన గుర్తుండిపోయారు. ఆరో రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. దేశ చరిత్రలో ఏకగీవ్రంగా ఎన్నికైన రాష్ట్రపతి. తెలుగువారు. స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక తరువాత దాదాపు అజ్ఞాతం లోకి వెళ్లిన నీలం సంజీవరెడ్డి జనతా పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుపొందారు. 42 లోక్‌సభ స్థానాలకు గాను, 41 కాంగ్రెస్ గెలుచుకుంది. నంద్యాల స్థానం మాత్రం జనతా పార్టీ గెలిచింది. ఆ గెలుపు నీలం సంజీవరెడ్డిది. ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్. సిక్కు వర్గం నుంచి ఎన్నికైన తొలి రాష్ట్రపతి. స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూస్టార్ సైనిక చర్య, ఇందిరా గాంధీ హత్య, వెంటనే దేశవ్యాప్తంగా సిక్కుల మీద హత్యాకాండ ఆయన రాష్ట్రపతిగా ఉండగానే జరిగాయి. ఎనిమిదో రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్. ఈయన కూడా స్వాతంత్య్ర పోరాట యోధుల తరానికి చెందినవారే. తామ్రపత్ర గ్రహీత కూడా. కె. కామరాజ్ నాడార్ మీద ఆయన రాసిన పుస్తకానికి గాను సోవియెట్ రష్యా సోవియెట్ ల్యాండ్ పురస్కారం ఇచ్చింది. తొమ్మిదో రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ. గొప్ప న్యాయ నిపుణుడు. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలకు ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ ‘లివింగ్ లెజెండ్ ఆఫ్ లా అవార్డ్ ఆఫ్ రికగ్నిషన్’ బహూకరించింది. పదవ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. దళిత వర్గం నుంచి తొలిసారిగా ఆ పదవిని అధిరోహించిన వారు. రాష్ట్రపతి అయిన తొలి మలయాళి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ సంస్థలో విద్యాభ్యాసం చేశారు. 1980–1984 మధ్య అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం. రాజకీయాలలో సంబంధం లేని వ్యక్తి. రోహిణి ఉపగ్రహాలు, అగ్ని, పృథ్వి క్షిపణులు ఆయన పర్యవేక్షణలోనే విజయవంతంగా ప్రయోగించారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించారు. అలాగే పోటీ చేసిన గెలిచిన రాష్ట్రపతులందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించినవారు కలాం. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో 1998లో జరిపిన రెండో పోఖ్రాన్ అణు పరీక్షలో కలాం కీలకపాత్ర వహించారు. పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభాసింగ్ పాటిల్. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ. సుఖోయి విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి. పదమూడవ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్‌కుమార్ ముఖర్జీ. పద్నాల్గవ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్. పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ పదవిని అలంకరించిన తొలి ఆదివాసీ మహిళ. వీవీ గిరి (1969), హిదయ్‌తుల్లా (1969), బసప్ప దాసప్ప జెట్టి (1977) తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు. అప్పుడు వీరు ఉపరాష్ట్రపతులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. – డా. గోపరాజు నారాయణరావు ఎడిటర్, ‘జాగృతి’ -
కిన్నౌర్‌లో ఓటేసిన కురువృద్ధుడు
సిమ్లా: స్వతంత్ర భారతావనిలో తొలి ఓటర్ 104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కిన్నౌర్ జిల్లా కల్పా పోలింగ్ స్టేషన్లో ఓటేసేందుకు చక్రాల కుర్చీలో వచ్చిన నేగికి రెడ్‌కార్పెట్ పరిచి, కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవ్గన్ మేళతాళాలతో స్వాగతం పలికారు. దేశాభివృద్ధికి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేగి కోరారు. మొట్టమొదటిసారిగా ఆయన 1951లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1917లో జన్మించిన ఆయన స్కూల్ టీచర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలో 1952 ఫిబ్రవరిలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే, హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో శీతాకాలంలో ఎన్నికల ప్రక్రియ కష్టమని భావిస్తూ అధికారులు ఐదు నెలలు ముందుగానే అక్టోబర్ 1951లోనే ఎన్నికలు జరిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న నేగి కల్పా ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఉదయం 7 గంటలకు ఓటు వేసిన మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. అప్పటి నుంచి ఆయన అన్ని ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
షబ్నమ్.. ఒక వెంటాడే కథ
భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మొదటిసారి ఒక మహిళా ఖైదీకి ఉరి వేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ మహిళా ఖైదీ పేరు షబ్నమ్. 2008లో తన ప్రియుడితో కలిసి ఆమె తన కుటుంబ సభ్యులనే హతమార్చిందని ఈ తీర్పు. అంతవరకే అయితే ఈ కథ వెంటాడదు. షబ్నమ్ ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. టీచర్‌గా పని చేసి విద్యార్థుల ఇష్టమైన టీచర్‌గా మారింది. ఆమె కాలేజీ ఫీజులు కట్టగా చదువుకున్న జూనియర్ ఆమె జైలుకు వెళ్లడంతో ఆమె కొడుకును దత్తత తీసుకున్నాడు. ఆమె సైఫి ముస్లిం, ప్రియుడు పఠాన్ ముస్లిం కావడం వీరి ప్రేమకు ప్రధాన అడ్డంకి అయ్యింది. ‘ఆస్తి కోసం తన వాళ్లను హతమార్చారు’ అని ఒకసారి, ‘ప్రియుడే చంపాడు’ అని ఒకసారి ఆమె చెప్పింది. అవన్నీ పక్కన పెడితే– భారతదేశంలో ఉరిశిక్షలు నిర్థారణ అయ్యి ఉరికి ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం వెనుక ‘నేరానికి–శిక్షకి–వెనుకబాటుతనానికి’ ఉన్న లంకె కూడా చర్చకు వస్తోంది. ‘ఉరిశిక్ష’ అని ఈ దేశంలో చర్చ జరిగినప్పుడల్లా ఆ ఉరిశిక్ష ‘ఎవరికి’ పడింది అనేది పెద్ద గమనార్హం అవుతుంది. చట్టం, న్యాయం అందరికీ సమానమే అని అనుకుంటాం, చెబుతుంటారు గాని చట్టం, న్యాయం అందరికీ సమానమేనా అని సందేహం వచ్చే గణాంకాలు ఎదురుగా ఉంటాయి. ఈ దేశంలో చకచకా శిక్షలు అమలయ్యేది బలహీనుల మీదేననీ, ఉరిశిక్ష అమలయ్యేది కూడా బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల మీదేనని ఆలోచనాపరులు గణాంకాలు చూపిస్తే వాటిని కాదనే జవాబు ఎవరి దగ్గరా లేదు. అలాగని ఈ ఆలోచనాపరులు నేరాలకు శిక్షలు వద్దని చెప్పడం లేదు. శిక్షల అమలులో వివక్ష ఉంది అని మాత్రమే చెబుతుంటారు. ఇప్పుడు ఉరిశిక్ష వార్తలలో ఉన్న షబ్నమ్ ఒక స్త్రీ కావడం, ఆమెకు క్షమాపణ దక్కకపోవడం, ఆమెలా ఈ దేశంలో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు కేవలం బలహీన, మైనారిటీ వర్గాల వారే కావడంతో వీరంతా ‘అడ్డంకులు లేని పూర్తి శిక్ష’కు యోగ్యులుగా భావించే భావజాలం ఉందని గ్రహించాల్సి వస్తుంది. ఎవరీ షబ్నమ్? శిక్ష కచ్చితంగా అమలవ్వాలి అని భారత పాలనావ్యవస్థ గట్టిగా అనుకుంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఉరిశిక్ష అమలయ్యే ఖైదీగా చరిత్రలో నిలవబోతున్న పేరు షబ్నమ్. ఈమెది ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలోని బవాన్‌ఖేడి గ్రామం. తన ఇంటి ఎదురుగా కలప మిల్లులో పని చేసే సలీమ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి 2008 ఏప్రిల్‌లో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న షబ్నమ్ కుటుంబ సభ్యులు ఏడుగురిని దారుణంగా హతమార్చారని అభియోగం. కోర్టులో నేరం నిరూపణ కావడంతో 2012లో స్థానిక కోర్టు ఇరువురికీ ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఆ శిక్షలను బలపరిచాయి. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా నిరాకరింపబడింది. కనుక షబ్నమ్‌కు ఉరితీత తప్పదని ప్రస్తుతం వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఒక జైలులో, సలీమ్ ఒక జైలులో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో స్త్రీలను ఉరితీసే ఉరికంబం కేవలం మధుర జైలులోనే ఉంది. దానిని ఉపయోగించి 150 ఏళ్లు అవుతోంది. షబ్నమ్‌ను ఉరి తీయాలంటే అక్కడే తీయాలి. అందుకు జైలు అధికారులు తలారీని సిద్ధం చేశారు. డెత్ వారెంట్ రావడమే తరువాయి. సరే.. షబ్నమ్ ఎవరు? షబ్నమ్ ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. ఊళ్లో టీచర్‌గా పని చేసింది. ఆమెది ముస్లింలలో ఒక తెగ. ఆమె ప్రేమించిన సలీమ్ ది మరో తెగ. ఈ తెగల అంతరం వీరి ప్రేమకు అడ్డంకిగా మారింది. అంతే కాదు సలీం కేవలం ఆరో క్లాసు చదువుకున్నాడు. పేదవాడు. అది కూడా షబ్నమ్ తల్లిదండ్రులకు నచ్చలేదు. కాని అప్పటికే ఆమె గర్భం దాల్చింది. ఈ ప్రేమ, గర్భం ఆమెను విచక్షణను కోల్పోయేలా చేశాయి. ఒకరోజు ప్రియుణ్ణి అర్ధరాత్రి ఇంట్లోకి రానిచ్చింది. ఇద్దరూ కలిసి షబ్నమ్ కుటుంబం లో 7గురిని హతమార్చారు. ఆ తర్వాత షబ్నమ్ ‘ఆస్తి కోసం నా వాళ్లను చంపారు’ అని ఒకసారి ‘సలీమ్ నిర్ణయం ఇది’ అని ఒకసారి చెప్పింది. అదే సంవత్సరం డిసెంబర్లో జైలులోనే షబ్నమ్ కొడుకుకు జన్మనిచ్చింది. అతనికి తాజ్ అని పేరు పెట్టింది. ఆరేళ్లవరకూ తల్లి దగ్గరే ఉన్న తాజ్‌ను షబ్నమ్తో పాటుగా కాలేజీలో చదువుకున్న ఆమె జూనియర్, ప్రస్తుతం జర్నలిస్ట్ అయిన ఉస్మాన్ సైఫీ దత్తత తీసుకున్నాడు. ‘నాకు తెలిసిన షబ్నమ్ ఈమె కాదు. షబ్నమ్ నా కాలేజీ ఫీజు కట్టింది. టీచర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె రుణం తీర్చుకోవడానికి ఆమె కొడుకును దత్తత తీసుకోవాలని నేను నా భార్యతో చెప్పాను’ అన్నాడు ఉస్మాన్ సైఫీ. అతని దగ్గర పెరుగుతున్న షబ్నమ్ కొడుకు ప్రతి మూడు నెలలకు తల్లిని చూసి వస్తుంటాడు. ఇటీవల అతను ‘మా అమ్మను క్షమించండి’ అని రాష్ట్రపతికి అప్పీలు చేశాడు. ‘నన్ను చూడాలని బలవంతం చేయకు. బాగా చదువుకో. నన్ను ఎప్పటికీ మర్చిపోకు’ అని షబ్నమ్ తన కొడుక్కి చెప్పింది. ఏం దారి ఉంది? షబ్నమ్ తన క్షమాభిక్ష కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. తన క్షమాభిక్ష నిరాకరింపబడటాన్ని సుప్రీం కోర్టులో తిరిగి సవాలు చేయనుంది. ‘ఇది షబ్నమ్‌కు, సలీమ్‌కు పడ్డ ఉరిశిక్ష. ఇరువురికీ సకల న్యాయపరమైన అప్పీల్స్ ముగిశాకనే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది’ అని షబ్నమ్ తరఫున న్యాయవాది తెలిపింది. షబ్నమ్‌ను ఆమె బంధువులు ఎవరూ కనికరించడం లేదు. ‘ఆమె చనిపోతే ఆమె మృతదేహాన్ని కూడా తీసుకోం’ అని వారు అన్నారు. షబ్నమ్ ఒక జీవచ్ఛవం. ఆమె మరణించిందని ఉరిశిక్ష ద్వారా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
నిప్పులాంటి ఐదుగురు అధికారులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాధారణంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించకుంటాం. నేడు స్వతంత్ర భారతంలో పెరిగిపోతున్న అవినీతిని అంటరానితనంగా భావించి దాన్ని తమ దరిదాపుల్లోని రానియ్యని అధికారుల గురించి, రాజకీయ పెద్దల ఒత్తిళ్లు, వేధింపులను, బెదిరింపులను, బదిలీలను తట్టుకొని అవినీతిపై పోరు సాగించిన, సాగిస్తున్న సివిల్స్ అధికారుల గురించి గుర్తు చేసుకోవడం బహు అరుదు. అలాంటి కోవకు చెందిన వారి గురించి క్లుప్తంగా.. పూనం మాలకొండయ్య, ఆంధ్రప్రదేశ్: 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. సమాజంలో వేళ్లూనుకున్న ఆశ్రిత పక్షపాతాన్ని, జాతి దురహంకారం, నిర్లిప్తతా ధోరణులకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆరేళ్లలో ఏడుసార్లు బదిలీ అయ్యారు. వ్యవసాయ రంగం నుంచి రవాణా, అటు నుంచి విద్య, అక్కడినుంచి పౌర సరఫరాలు.. ఇలా ఎన్ని విభాగాలు మారినా ఏ రంగంలోనూ రాజీ పడని మనస్తత్వం ఆమెది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా మోన్శాంటో లాంటి బహుళజాతి కంపెనీల మెడలు వంచి బీటీ కాటన్ విత్తనాల ధరలు తగ్గించిన ఘనత ఆమెది. మనోజ్ నాథ్, బిహార్: తన 20వ ఏటనే ఐపీఎస్ పరీక్ష రాసి దేశంలో మూడోర్యాంక్ సాధించారు. 1973లో బిహార్ నుంచి తొలి ర్యాంక్‌ను సాధించారు. 39 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా సేవలందించిన ఆయన 2012లో పదవీ విరమణ చేశారు. నిజాయితీకి నిలువుటద్దంలా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల 40 సార్లు బదిలీ అయ్యారు. ఎన్నో అర్హతలు ఉన్నా డీజీపీ లాంటి పదవులకు ఆయన పేరును ఎప్పుడూ పరిశీలించలేదు. ఆయన కన్నా ఎంతో మంది జూనియర్లు ఆయనను దాటేసి ఉన్నత పదవులను అధిష్ఠించారు. బొకారో ఎస్పీగా పనిచేసినప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అవినీతి కేసులో బొకారో స్టీల్ ప్లాంట్ ఎండీని అరెస్టుచేశారు. పర్యవసానంగా 24 గంటల్లోనే బదిలీ అయ్యారు. జీఆర్ ఖైర్నార్, మహారాష్ట్ర: గోవింద్ రఘో ఖైర్నార్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయనది ఎవరికీ భయపడే తత్వం కాదు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా నగరంలో దురాక్రమణలను తొలగించారు. అక్రమ కట్టడాలను కూల్చారు. ఎన్నో ప్రభుత్వ స్థలాలను రక్షించారు. ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. వారి చేతుల్లో గాయపడ్డారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నందుకు ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఉన్నతాధికారుల మాటలు వినడం లేదన్న ఆరోపణలపై ఆయనపై కేసు దాఖలుచేశారు. చివరకు ముంబై కోర్టులో ఆయన కేసు గెలిచారు. ఆయనకు కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. 'వన్ మేన్ డెమోలిషన్ ఆర్మీ'గా ముంబై ప్రజలు ఆయన్ని కీర్తించారు. ఆయన తన సస్పెన్షన్ కాలంలో మరాఠీలో 'ఏకాకి జూంజ్ (ఒంటరి పోరాటం)' శీర్షికన తన ఆత్మకథను రాశారు. సమిత్ శర్మ, రాజస్థాన్: రాష్ట్రంలోని చిత్తూర్‌గఢ్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2009లో ప్రభుత్వం ఆయన్ని అన్యాయంగా బదిలీ చేసినందుకు నిరసనగా 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టి సమ్మెచేశారు. అయినా రాజకీయ పెద్దలు ఆయన బదిలీని వెనక్కి తీసుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒకరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చినప్పుడు కిందిస్థాయి డివిజనల్ గుమాస్తా లేచి నమస్కారం పెట్టనందుకు అతన్ని ఉద్యోగం నుంచి తీసేయాలని సదరు ఎమ్మెల్యే శర్మపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన నిరాకరించడంతో బదిలీ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు డాక్టర్‌గా ఐదేళ్లు ప్రాక్టీస్ చేసిన శర్మ తన అనుభవాన్ని ఉపయోగించి రాజస్థాన్ పేద ప్రజలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జనరిక్ మెడిసన్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. రజనీ సెక్రి సిబల్, హర్యానా: ఈ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి. ధైర్యానికి మారుపేరు. 1999-2000 సంవత్సరంలో 3,200 మంది జూనియర్ బేసిక్ ట్రేనింగ్ (జేబీటీ) టీచర్ల నియామకాల మార్కుల జాబితాను మార్చాలని రాజకీయ నాయకుల నుంచి ఆమెపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. అందుకు కోట్లాది రూపాయలను లంచంగా కూడా ఇస్తామని రాజకీయ పెద్దలే ఆశ చూపారు. అయినా ఆమె వినలేదు. అందుకని ఆమెను వెంటనే బదిలీ చేశారు. అసలు జాబితాను మార్చకుండా ఉండేందుకు ఆమె ఆ జాబితా ఉన్న బీరువాకు తాళం వేసి, నాలుగు అడుగుల గుడ్డతో బ్యాండేజీ చుట్టారు. పలుచోట్ల సీళ్లు అతికించారు. తన కింద పనిచేసే ఐదుగురు అధికారులతో వాటిపై సంతకాలు తీసుకున్నారు. తాళం చెవిని ఓ కవర్లో పెట్టి సీలు చేశారు. అయినా ఆమె బదిలీ అనంతరం ఈ టీచర్ల నియామకాల్లో అవినీతి చోటుచేసుకుంది. రజనీ కారణంగానే ఆ కుంభకోణం వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయడంతో ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు వ్యక్తులు జైళ్ల పాలయ్యారు. భారత సమాజంలో ఇలా నీతి, నిజాయితీలకు కట్టుబడి పనిచేస్తున్న వారు అక్కడక్కడైనా ఉండడం వల్ల ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇలాంటి వ్యక్తులను స్వాతంత్య్ర దినోత్సవరం రోజున సన్మానించకపోయినా ఫర్వాలేదు. గుర్తు చేసుకుంటే చాలు.