నవంబర్ 2న చివరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తూ...
షిమ్లా: స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటర్‌గా చరిత్రకెక్కిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ ఇక లేరు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామంలోని స్వగృహంలో శనివారం తెల్లవారుజామున మరణించారు.
అయితే తుదిశ్వాస వదిలేందుకు ముందు కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం! రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈ నెల 2న కల్పా గ్రామంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నేగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం ఇదే తొలిసారి! ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు
నేగీ 1917 జూలైలో జన్మించారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1975లో పదవీ విరమణ పొందారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఆయనకెంతో ఇష్టం. ఇప్పటిదాకా 34సార్లు ఓటు వేశారు. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ.. ఎన్నిక ఏదైనా సరే 1951 నుంచి ఏనాడూ ఓటు వేయడం మర్చిపోలేదు. 2010లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కల్పా గ్రామంలో నేగీని ఘనంగా సత్కరించారు.
2014లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం నేగీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గూగుల్ సంస్థ ‘ప్లెడ్జ్ టు ఓట్’ ప్రచారంలో భాగంగా నేగీపై వీడియో రూపొందించింది. ఈ వీడియో ద్వారా ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రతి ఎన్నిక ఓ పండుగ లాంటిదేనని, ప్రతి ఓటూ విలువైనదేనని, ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేసి, మంచి నాయకులను ఎన్నుకోవాలని నేగీ తరచూ చెబుతుండేవారు.
యువతకు స్ఫూర్తిదాయకం: మోదీ
తొలి ఓటర్ నేగీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. ఆయన 34 సార్లు ఓటు వేయడం గొప్ప విషయమని కొనియాడారు. ‘‘అనారోగ్యంతో బాధపడుతూ కూడా రెండు రోజుల క్రితమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలా మరణానికి ముందు కూడా తన విధిని చక్కగా నిర్వర్తించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకం’’ అంటూ ప్రశంసించారు.
భారమైన హృదయంతో తలవంచి నేగీకి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తదితరులు నేగీ మరణం పట్ల సంతాపం తెలిపారు. నేగీ ఇక లేరన్న నిజం బాధాకరమని పేర్కొన్నారు. బీజేపీ కూడా ట్విట్టర్‌లో సంతాపం ప్రకటించింది. నేగీ మృతి పట్ల ఎన్నికల సంఘం కూడా సంతాపం ప్రకటించింది.
ఇలా తొలి ఓటు...
దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952 జనవరి–ఫిబ్రవరిలో జరిగాయి. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా చినీ గ్రామంలో (నేటి కల్పా) తీవ్రమైన చలితోపాటు ముందుగానే మంచు కురుస్తుండడంతో 1951 అక్టోబర్ 25న్నే పోలింగ్ జరిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్లి నేగీ మొదటి ఓటు వేశారు. అలా స్వతంత్ర భారత్‌లో ఓటేసిన తొలి పౌరుడిగా రికార్డు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment