
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో భారత్‌కు స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి మరణించారు. ఆయన వయసు 106 సంవత్సరాలు. కాగా ఆయన మూడు రోజుల క్రితమే(నవంబర్ 2) హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34 సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తొలుత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలని శ్యాం శరణ్ భావించినా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కిన్నౌర్ జిల్లాకు చెందిన శ్యాం శరణ్ నేగి కోసం ఎన్నికల కమిషన్ బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అప్పటికే శ్యామ్ అనారోగ్యంతో బాధపడుతుండగా.. శనివారం ఉదయం తన స్వస్థలమైన కల్పాలో కన్నుమూశారు. వృద్ధుడి అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోందని, గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు.
శ్యామ్ శరణ్ నేగి జూలై 1, 1917న జన్మించారు. కల్పాలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తరువాత స్వాతంత్ర్య భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి శరణ్ నేగి. 1951 అక్టోబర్ 25న ఆయన ఓటేశారు. అయితే మొదటిసారి ఎన్నికల పోలింగ్ 1952లో ఎక్కువ జరిగినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ అయిదు నెలల ముందగానే ఎన్నికలకు వెళ్లింది. హిమాచల్‌లో ఫిబ్రవరి, మార్చిలో వాతావరణం ప్రతికూలంగా ఉండటం, అతిగా మంచు కురిసే ప్రమాదం ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక శ్యామ్ శరణ్ నేగి హిందీ చిత్రం సనమ్ రేలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు.