రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు హిమాచల్‌లో పర్యటించనున్నారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం గైటీ థియేటర్‌లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె వీక్షించనున్నారు. గైటీ థియేటర్‌ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డుకెక్కనున్నారు.
గైటీ థియేటర్ చారిత్రాత్మక భవనం. దీనిని బ్రిటిష్ వారు నిర్మించారు. బ్రిటిష్ పాలనలో 1884లో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు వినోదం కోసం ఇంగ్లండ్ నుండి కళాకారులను సిమ్లాకు పిలిపించేవారు. అయితే ఆ సమయంలో సిమ్లాలో థియేటర్ లేదు. ఫలితంగా కళాకారుల ప్రదర్శనలు బ్రిటిష్ పాలకుల ఇళ్లలో లేదా అన్నాడేల్ గ్రౌండ్‌లో జరిగేవి.
గైటీ థియేటర్‌ను 1887లో హెన్రీ ఇర్విన్ నిర్మించారు. ఈ థియేటర్ నియో-విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించారు. బ్రిటిష్ పాలకులు సిమ్లాను సాంస్కృతిక కేంద్రంగా మార్చాలనుకున్నారు. గైటీ థియేటర్‌కు 137 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ థియేటర్‌లో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచ స్థాయి కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించారు.
గైటీ థియేటర్ నిర్మాణం యూ ఆకారంలో ఉంటుంది.ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే స్టేజ్‌పై వినిపించే చిన్నపాటి శబ్దం కూడా చివరి వరుసలో కూర్చున్న ప్రేక్షకులకు వినిపిస్తుంది. ఇక్కడ ప్రదర్శన సమయంలో ఎలాంటి మైక్ ఉపయోగించరు. ప్రపంచంలో కేవలం ఆరు గైటీ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటే సిమ్లాలోని ఈ థియేటర్. దీనిని ప్రారంభించిన సమయంలో లాంతర్లను ఉపయోగించేవారు. దీనిలో ఉపయోగించే బ్యాటరీని ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా తదితర ప్రముఖ బాలీవుడ్ నటులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. వీరితోపాటు కేఎల్ సెహగల్, టామ్ ఆల్టర్, పృథ్వీరాజ్ కపూర్ తదితరులు కూడా ఇక్కడ తమ ప్రతిభను చాటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ తన భార్య జెన్నిఫర్‌కు ఇక్కడే పెళ్లికి ప్రపోజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment