shyam sharan negi
-
తొలి ఓటర్ ఇక లేరు
షిమ్లా: స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటర్‌గా చరిత్రకెక్కిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ ఇక లేరు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామంలోని స్వగృహంలో శనివారం తెల్లవారుజామున మరణించారు. అయితే తుదిశ్వాస వదిలేందుకు ముందు కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం! రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈ నెల 2న కల్పా గ్రామంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నేగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం ఇదే తొలిసారి! ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు నేగీ 1917 జూలైలో జన్మించారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1975లో పదవీ విరమణ పొందారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఆయనకెంతో ఇష్టం. ఇప్పటిదాకా 34సార్లు ఓటు వేశారు. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ.. ఎన్నిక ఏదైనా సరే 1951 నుంచి ఏనాడూ ఓటు వేయడం మర్చిపోలేదు. 2010లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కల్పా గ్రామంలో నేగీని ఘనంగా సత్కరించారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం నేగీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గూగుల్ సంస్థ ‘ప్లెడ్జ్ టు ఓట్’ ప్రచారంలో భాగంగా నేగీపై వీడియో రూపొందించింది. ఈ వీడియో ద్వారా ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రతి ఎన్నిక ఓ పండుగ లాంటిదేనని, ప్రతి ఓటూ విలువైనదేనని, ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేసి, మంచి నాయకులను ఎన్నుకోవాలని నేగీ తరచూ చెబుతుండేవారు. యువతకు స్ఫూర్తిదాయకం: మోదీ తొలి ఓటర్ నేగీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. ఆయన 34 సార్లు ఓటు వేయడం గొప్ప విషయమని కొనియాడారు. ‘‘అనారోగ్యంతో బాధపడుతూ కూడా రెండు రోజుల క్రితమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలా మరణానికి ముందు కూడా తన విధిని చక్కగా నిర్వర్తించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకం’’ అంటూ ప్రశంసించారు. భారమైన హృదయంతో తలవంచి నేగీకి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తదితరులు నేగీ మరణం పట్ల సంతాపం తెలిపారు. నేగీ ఇక లేరన్న నిజం బాధాకరమని పేర్కొన్నారు. బీజేపీ కూడా ట్విట్టర్లో సంతాపం ప్రకటించింది. నేగీ మృతి పట్ల ఎన్నికల సంఘం కూడా సంతాపం ప్రకటించింది. ఇలా తొలి ఓటు... దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952 జనవరి–ఫిబ్రవరిలో జరిగాయి. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా చినీ గ్రామంలో (నేటి కల్పా) తీవ్రమైన చలితోపాటు ముందుగానే మంచు కురుస్తుండడంతో 1951 అక్టోబర్ 25న్నే పోలింగ్ జరిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్లి నేగీ మొదటి ఓటు వేశారు. అలా స్వతంత్ర భారత్‌లో ఓటేసిన తొలి పౌరుడిగా రికార్డు సృష్టించారు. -
కిన్నౌర్‌లో ఓటేసిన కురువృద్ధుడు
సిమ్లా: స్వతంత్ర భారతావనిలో తొలి ఓటర్ 104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కిన్నౌర్ జిల్లా కల్పా పోలింగ్ స్టేషన్లో ఓటేసేందుకు చక్రాల కుర్చీలో వచ్చిన నేగికి రెడ్‌కార్పెట్ పరిచి, కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవ్గన్ మేళతాళాలతో స్వాగతం పలికారు. దేశాభివృద్ధికి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేగి కోరారు. మొట్టమొదటిసారిగా ఆయన 1951లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1917లో జన్మించిన ఆయన స్కూల్ టీచర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలో 1952 ఫిబ్రవరిలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే, హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో శీతాకాలంలో ఎన్నికల ప్రక్రియ కష్టమని భావిస్తూ అధికారులు ఐదు నెలలు ముందుగానే అక్టోబర్ 1951లోనే ఎన్నికలు జరిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న నేగి కల్పా ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఉదయం 7 గంటలకు ఓటు వేసిన మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. అప్పటి నుంచి ఆయన అన్ని ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
ప్రశాంతంగా ఎనిమిదో విడత పోలింగ్
ఎనిమిదో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగింది. బుధవారం 7రాష్ట్రాల్లోని 64 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1737 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ, కేంద్ర మంత్రి బేణి ప్రసాద్ వర్మ, క్రికెటర్ మహ్మద్ కైఫ్, లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్, ఆర్ జే డీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవీల అదృష్టం ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. మొత్తం 18.47 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీమాంధ్రలో 25, యూపీలో 15, బీహార్‌లో 7, బెంగాల్లో 6 , హిమాచల్‌ప్రదేశ్‌లో 4, ఉత్తరాఖండ్‌లో 5, జమ్మూకాశ్మీర్‌లో 2 స్థానాలకు ఎనిమిదో దశలో ఎన్నికలు జరిగాయి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణ, రమేశ్ పోఖ్రియాల్ నిశంక్, హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్, హరిద్వార్ లో యోగాగురువు రాందేవ్బాబు, మండిలో హిమాచల్ సీఎం వీరభద్ర సింగ్, ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వాతంత్ర్య భారతదేశంలో తొలి ఓటరుగా ఖ్యాతి గాంచి శ్యామ్ శరణ్ నేగి... హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయనకు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.