
సిమ్లా: స్వతంత్ర భారతావనిలో తొలి ఓటర్ 104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కిన్నౌర్ జిల్లా కల్పా పోలింగ్ స్టేషన్‌లో ఓటేసేందుకు చక్రాల కుర్చీలో వచ్చిన నేగికి రెడ్‌కార్పెట్ పరిచి, కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవ్‌గన్ మేళతాళాలతో స్వాగతం పలికారు. దేశాభివృద్ధికి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేగి కోరారు. మొట్టమొదటిసారిగా ఆయన 1951లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
1917లో జన్మించిన ఆయన స్కూల్ టీచర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలో 1952 ఫిబ్రవరిలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే, హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో శీతాకాలంలో ఎన్నికల ప్రక్రియ కష్టమని భావిస్తూ అధికారులు ఐదు నెలలు ముందుగానే అక్టోబర్ 1951లోనే ఎన్నికలు జరిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న నేగి కల్పా ప్రైమరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఉదయం 7 గంటలకు ఓటు వేసిన మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. అప్పటి నుంచి ఆయన అన్ని ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.