సాక్షి, సెంట్రల్ డెస్క్ : స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు శ్యామ్ నారాయణ్ నేగి. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శ్యామ్ 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇంత వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేశారు. లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ.. ఇలా ఏ ఒక్క ఎన్నికనూ ఆయన మిస్ కాలేదు. ఇప్పుడు 102 ఏళ్ల వయసులో వచ్చే నెల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ అసలాయనే మొట్టమొదటి ఓటరని ఎలా గుర్తించారు?
‘అబ్బో.. అదో పెద్ద కథ. శ్యామ్‌ను గుర్తించడం కోసం ఎంతో కష్టపడ్డాం. నాలుగు నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులన్నీ క్షుణ్ణంగా తిరగేశాం. ఆయన జాడ కనిపెట్టడానికి పీహెచ్‌డీ పట్టా కోసం పడాల్సినంత శ్రమ పడ్డాం. మొత్తానికి 45 ఏళ్ల తర్వాత ఒక చారిత్రక సత్యాన్ని వెలుగులోకి తెచ్చాం’ అంటూ తాము పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నారు ఐఏఎస్ అధికారి మనీషా నందా. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో అదనపు ప్రధాన కార్యదర్శి (పీడబ్ల్యూడీ)గా పనిచేస్తున్న మనీషాయే మొదటగా శ్యామ్‌ను గుర్తించారు.
హిమాచల్‌లోని కినార్ జిల్లా కల్ప గ్రామస్తుడైన శ్యామ్ మన దేశపు తొలి ఓటరన్న సంగతి 2007 జూలైలో బయటపడింది. ‘మన దేశంలో ఇతర ప్రాంతాల కంటే ముందు కినార్‌లో పోలింగ్ మొదలవుతుందని నాకు తెలుసు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడ ముందే పోలింగ్ మొదలు పెడతారు. ఒకరోజు ఓటర్ల ఫొటోలున్న జాబితా చూస్తున్నాను.
దాంట్లో వారంతా 90 ఏళ్లు పైబడిన వారే. వారిలో శ్యామ్ ఫొటో నన్ను ఆకట్టుకుంది. వెంటనే ఆయన వివరాలు తెలుసుకోవాలని ఎన్నికల అధికారులను కోరాను’ అన్నారు నందా. అప్పట్లో కినార్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సుధాదేవి అనే ఐఏఎస్ అధికారి కల్ప గ్రామానికి వెళ్లి శ్యామ్‌ను కలుసుకున్నారు. అప్పటికి శ్యామ్ వయసు 92 సంవత్సరాలు.
1917, జూలై 1న పుట్టిన శ్యామ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 1951 ఎన్నికల్లో శ్యామ్‌కు ఎన్నికల డ్యూటీ వేశారు. ‘ముందు ఓటు వేసి తర్వాత ఎలక్షన్ డ్యూటీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మా నాన్న ఎన్నికల అధికారులను కోరారు. వారు ఒప్పుకోవడంతో అందరికంటే ముందే ఓటు వేశారు. అలా ఆయన దేశంలో మొట్టమొదట ఓటు వేసిన వ్యక్తి అయ్యారు’ అంటూ సుధాదేవికి విషయం వివరించారు శ్యామ్ కుమారుడు చంద్ర ప్రకాశ్.
ఆయనకిప్పుడు 53 ఏళ్లు. శ్యామ్ శరణ్ కథను సుధాదేవి నందాకు చెప్పారు. దాంతో నందా నాలుగు నెలల పాటు ఎన్నికల రికార్డులన్నింటినీ పరిశీలించారు. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో రికార్డులను కూడా తనిఖీ చేసి శ్యామే మొదటి ఓటరన్న సంగతిని నిర్ధారించారు. విషయం తెలిసిన అప్పటి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి నవీన్ చావ్లా 2012లో స్వయంగా కల్ప గ్రామానికి వెళ్లి శ్యామ్‌ను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment