
సమగ్ర దర్యాప్తు జరిపించాలి
కాంగ్రెస్ పార్టీ డిమాండ్
బెంగళూరు: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేదాకా అధికార బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ వేల కోట్ల రూపాయలు నొక్కేసిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు.
నేను తినను, ఇతరులను తిననివ్వనంటూ ప్రగల్భాలు పలికిన మోదీ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు బీజేపీకి ఇంత సొమ్ము ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, అవినీతికి పాల్పడిన బడా వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమరి్పంచుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శుక్రవారం ఆరోపించారు.
దర్యాప్తు సంస్థల భయంతో బీజేపీకి లొంగిపోయారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంపై ప్రజాక్షేత్రంలో వెళ్లి పోరాటం సాగిస్తామని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్‌పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈ బాండ్ల వ్యవహారంలో క్విడ్ ప్రో కో చోటుచేసుకుందని, అవకతవకలు జరిగాయని అన్నారు.
ఇదొక వసూళ్ల రాకెట్: రాహుల్
ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పథకం కింద వసూలు చేసిన సొమ్మును వివిధ రాష్ట్రాల్లో పారీ్టలను చీల్చడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ దుర్వినియోగం చేసిందని రాహుల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ మినహా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన కాంట్రాక్టులకు, ఎలక్టోరల్ బాండ్లకు మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment