న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటిని నిలిపివేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్లు స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని విమర్శించారు. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో నేడు దీనికి పరిష్కారం లభించిందని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పార్లమెంట్, రాజ్యాంగం తీసుకొచ్చి రెండు చట్టాలను ఉల్లంఘించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు . సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నోట్ల కంటే ఓట్లకే ఎక్కువ శక్తి అనే వాస్తవాన్ని బలపరిచిందన్నారు. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
చదవండి: ‘రాజకీయ పార్టీల విరాళాల’ పిటిషన్.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
కాగా ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌కు చట్టబద్ధత ఉంటుందా లేదా అన్న పిటీషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడిచింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్దమని ఏకపక్షమని, పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని పేర్కొంది. రాజకీయ పార్టీలు, డోనర్ల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని తెలిపింది.
నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు, దాతల గోప్యతను కాపాడటం అనే నిర్దేశిత లక్ష్యం ఈ పథకాన్ని సమర్థించలేదని పేర్కొంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని కోర్టు అభిప్రాయపడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే ఈ ఎన్నికల బాండ్ల జారీని ఆపివేయాలని, అలాగే బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను భారత ఎన్నికల సంఘానికి అందజేయాలని సీజేఐ పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘం మార్చి 13లోగా తమ వెబ్‌సైట్‌లో ప్రచురించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment