సంస్కరణా కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లో మహిళల పరిస్థితి దారుణంగా మారిన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దిద్దుబాటు కేంద్రాల్లో మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, 196 మంది పిల్లలు జన్మించడంతో మహిళా ఖైదీల దుస్థితికి బాధ్యులెవరు అనే చర్చకు దారి తీసింది.
జైళ్లలో ఉన్న కొంతమంది మహిళా ఖైదీలు గర్బం దాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కోలకత్తా హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రాష్ట్రంలోని వివిధ జైళ్లను పరిశీలించి అమికస్ క్యూరీ గురువారం అందించిన నివేదికపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్లలో మహిళా ఖైదీలు గర్భం దాల్చి, బిడ్డల్ని కంటున్న ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జైలు సంస్కరణలపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. మహిళా జైళ్లలోకి పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని నిషేధించాలని కోలకత్తా హైకోర్టు కోరింది. అలాగే ఈ విషయాన్ని క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌కు బదిలీ చేయడం సరైందని భావించిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమస్యను తీవ్రమైందిగా పరిగణిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశాన్ని హైకోర్టులోని మరో డివిజన్ బెంచ్‌కు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది.
ఈ వ్యవహారంలో 2018లో అమికస్ క్యూరీగా ఎంపికైన న్యాయవాది తపస్ కుమార్ భంజా తన నివేదికను కోర్టుకు సమర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 196 మంది పిల్లలు పుట్టారని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. కస్టడీలో ఉండగానే మహిళా ఖైదీలు గర్భం దాల్చి, జైళ్లలోనే ప్రసవించినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా ఖైదీలుండే ఎన్‌క్లోజర్లలో, కరెక్షన్ హోమ్స్‌లో పురుష ఉద్యోగులు, ఇతర పురుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని తపస్ ధర్మాసనాన్ని కోరారు. ఇటీవల తాను దిద్దుబాటు గృహాల ఇన్‌స్పెక్టర్ జనరల్ (స్పెషల్), జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శితో కలిసి మహిళా దిద్దుబాటు గృహాన్ని సందర్శించాననీ ఈ సమయంలో ఒక గర్భవతిని, దాదాపు15 మంది ఇతర మహిళా ఖైదీలు వారి పిల్లలతో ఉన్నట్టు కోర్టుకు నివేదించారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ ఘటనపై స్పందించారు. శిక్ష పడిన మహిళకు ఆరేళ్ల లోపు వయసున్న పిల్లలు ఉంటే వారిని తల్లితో ఉండేందుకు అనుమతి ఉంమటుందని తెలిపారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని జైలులో మహిళలు గర్భవతులు కావడం తన దృష్టికి రాలేదని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment