సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో మహిళా ఖైదీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శాఖ పలు మార్పులు చేయనుంది. జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి కొత్త జైలు సంస్కరణలను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకా గాంధీ శుక్రవారం ఒక ప్రకటన చేశారు.
జైళ్లలో మహిళల స్థితిగతులపై చాలా ఆందోళనకరమైన, అవాంఛనీయ నివేదికలు వచ్చాయని మేనకా గాంధీ చెప్పారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక కమిటీ ఉండాల్సి అవసరం ఉందన్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సహకారంతో మంత్రిత్వ శాఖ తయారు చేసిన ప్రొ ఫార్మాను దేశవ్యాప్తంగా 144 సెంట్రల్ జైళ్లకు పంపిణీ చేసినట్టు చెప్పారు. చాలా జైళ్లలో అధిక సంఖ్యలో మహిళా ఖైదీలు ఉండడంతో కనీస సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు, శానిటరీ నాప్‌కిన్లు, విద్యా సౌకర్యాలతోపాటు చట్టబద్దమైన అవగాహన వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందడం లేదని మంత్రి పేర్కొన్నారు. మహిళా ఖైదీలకోసం కొత్త జైలు నిబంధనావళిని సిద్ధం చేయటానికి తమ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీని కూడా సంప్రదించినట్టు మేనకా గాంధీ చెప్పారు. మరోవైపు వీరికి జైళ్లలో నైపుణ్యం అభివృద్ధి మరియు ఔత్సాహిక విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొన్ని నైపుణ్యం ఆధారిత శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆమె వెల్లడించారు.
ఇంతకుముందు అనేక సిఫార్సులు అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ వీటి అమలు విషయంలో అధికారులు సీరియస్‌గా తీసుకోలేదన్నారు. తాజాగా వీటిని కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నామని ఎన్‌సీడబ్ల్యు యాక్టింగ్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment