WCD Minister Maneka Gandhi
-
సర్వత్రా స్వాగతం : పాన్ కార్డు దరఖాస్తులో మార్పులు
న్యూఢిల్లీ : తల్లి మాత్రమే ఉన్న పిల్లలకు పాస్‌పోర్టు తరహాలోనే పాన్ కార్డుకు కూడా నిబంధనలు తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. తండ్రి పేరు నమోదు చేయకుండానే.. ఒంటరి తల్లుల పిల్లలు పాన్ కార్డును దరఖాస్తు చేసుకునేలా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ(డబ్ల్యూసీడీ) ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళా కార్యకర్తలు, జాతీయ మహిళా కమిషన్ స్వాగతించాయి. జీ న్యూస్ రిపోర్టు ప్రకారం డబ్ల్యూసీడీ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంపై తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. విడాకులు తీసుకున్న తల్లులు లేదా బిడ్డలను దత్తత తీసుకున్న ఒంటరి తల్లుల విషయంలో పాన్ కార్డులో తండ్రి పేరు తొలిగించే అవకాశాన్ని కల్పించాలని ఆమె కోరారు. జూలై 6న గోయల్‌కు ఈ లేఖ రాశారు. ఒంటరి తల్లుల విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, పలు ప్రభుత్వ అథారిటీల ముందు సమర్పించే దరఖాస్తుల్లో వారి మాజీ భర్తల పేర్లను నమోదు చేయాల్సినవసరం లేకుండా... అవకాశం కల్పించడం ఎంతో ముఖ్యమని మేనకా గాంధీ చెప్పారు. అంతేకాక పిల్లల్ని దత్తత తీసుకుని పెంచే తల్లులకు, తండ్రి ఉండరని, అలాంటి కేసుల్లో కూడా తండ్రి పేరు అవసరం లేకుండా పాన్ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మహిళల్లో సాధికారికత కల్పించడానికి దీన్ని ముందస్తుగానే అమలు చేయాల్సి ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అన్నారు. ఇది చాలా ప్రగతిశీలమైదన్నారు. ప్రస్తుతం ఇది చాలా మంచి నిర్ణయమని శర్మ అభివర్ణించారు. ఓ పురుషుడితో మహిళలు తమను తాము గుర్తింపు పొందాల్సివసరం లేదని, వారికి సాధికారికత కల్పించే విషయంలో ఎంతో స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు. సీనియర్ సీపీఐ లీడర్, సామాజిక కార్యకర్త అన్నీ రాజా కూడా ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. పాన్ కార్డును పొందడానికి ఇబ్బందులు పడుతున్న చాలా మంది పిల్లలకు ఇది ఎంతో సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ కార్డు దరఖాస్తు చేసుకునేటప్పుడు తండ్రి పేరు నమోదు చేయడం తప్పనిసరి. దీన్నే గుర్తింపు కార్డుగా కూడా భావిస్తున్నారు. ఒంటరి తల్లులు ఎదుర్కొనే చాలా సమస్యలను ఇది పరిష్కరిస్తుందని మహిళా హక్కుల కార్యకర్త మరియం ధవాలే చెప్పారు. -
ఎన్నారై పెళ్లిళ్లు.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నారై పెళ్లిళ్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్‌పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ బుధవారం తెలిపారు. దీనికి మందు ఎన్నారై పెళ్లి రిజిస్టర్‌కు నిర్దిష్ట కాల పరిమితి లేదు. అయితే, ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. నిందితులపై మోపిన నేరం నిరూపించడానికి, వారిని విదేశాల నుంచి రప్పించడానికి న్యాయ పరమైన సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. 48 గంటల్లో పెళ్లి రిజిస్టర్ చేయించడం ద్వారా కేంద్రం డాటాబేస్‌లోకి ఎన్నారై వివరాలు చేరుతాయి. తద్వారా భారత్‌కి వచ్చివెళ్లే ఎన్నారై కదలికలపై దృష్టి సారించవచ్చని మేనక తెలిపారు. వారిపై నిఘా ఉంచడం ద్వారా ఏదైనా నేరానికి పాల్పడి దేశం నుంచి పారిపోకుండా ఎన్నారైలను అడ్డుకోవచ్చని ఆమె అన్నారు. వీసా, పాస్‌పోర్టును రద్దు చేసి నేర విచారణ చేపట్టొచ్చని వివరించారు. కాగా, తాజా నిర్ణయానికి ముందు ఎన్నారై పెళ్లిని 30 రోజులలోపు రిజిస్టర్ చేసేలా నిబంధన రూపొందించాలని ‘లా కమిషన్’ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు సూచించడం గమనార్హం. -
మహిళా ఖైదీలకు శుభవార్త..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో మహిళా ఖైదీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శాఖ పలు మార్పులు చేయనుంది. జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి కొత్త జైలు సంస్కరణలను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకా గాంధీ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. జైళ్లలో మహిళల స్థితిగతులపై చాలా ఆందోళనకరమైన, అవాంఛనీయ నివేదికలు వచ్చాయని మేనకా గాంధీ చెప్పారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక కమిటీ ఉండాల్సి అవసరం ఉందన్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సహకారంతో మంత్రిత్వ శాఖ తయారు చేసిన ప్రొ ఫార్మాను దేశవ్యాప్తంగా 144 సెంట్రల్ జైళ్లకు పంపిణీ చేసినట్టు చెప్పారు. చాలా జైళ్లలో అధిక సంఖ్యలో మహిళా ఖైదీలు ఉండడంతో కనీస సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు, శానిటరీ నాప్కిన్లు, విద్యా సౌకర్యాలతోపాటు చట్టబద్దమైన అవగాహన వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందడం లేదని మంత్రి పేర్కొన్నారు. మహిళా ఖైదీలకోసం కొత్త జైలు నిబంధనావళిని సిద్ధం చేయటానికి తమ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీని కూడా సంప్రదించినట్టు మేనకా గాంధీ చెప్పారు. మరోవైపు వీరికి జైళ్లలో నైపుణ్యం అభివృద్ధి మరియు ఔత్సాహిక విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొన్ని నైపుణ్యం ఆధారిత శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఇంతకుముందు అనేక సిఫార్సులు అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ వీటి అమలు విషయంలో అధికారులు సీరియస్‌గా తీసుకోలేదన్నారు. తాజాగా వీటిని కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నామని ఎన్సీడబ్ల్యు యాక్టింగ్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ప్రకటించారు. -
మారిటల్ రేప్ లపై స్వరం మార్చిన మేనక
న్యూఢిల్లీ: మారిటల్ రేప్(భార్యపై అత్యాచారం) నేరమా? కాదా? అనే చర్చ మరో మలుపు తిరిగింది. భారత సంప్రదాయాలు, ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా మారిటల్ రేప్ ను నేరపూరిత చర్యగా పరిగణించలేమని గతంలో వెల్లడించిన కేంద్ర మంత్రి మేనకా గాంధీ తాజాగా స్వరం మార్చారు. సరైన ఆధారాలు లభించిన పక్షంలో మారిటల్ రేప్ ను క్రైమ్ గా పరిగణించే వీలుంటుందని, ఎక్కువ మంది బాధిత మహిళలు ఫిర్యాదులు చేయడం ద్వారానే ఇది వీలవుతుందని శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. మారిటల్ రేప్ ను క్రైమ్ గా పరిగణించేందుకు కొత్తచట్టాలు అవసరం లేదని మేనక స్పష్టం చేశారు. భారత శిక్షా స్మృతిలోని 375సి సెక్షన్ ప్రకారం మహిళ అంగీకారం లేకుండా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల బృందం ఆమెను బలవంతపెట్టడం అత్యాచారంగా పరిగణిస్తారు. అయితే భార్యలను హింసించే భర్తల విషయంలోనూ ఈ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో పలువురు సభ్యులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన కేంద్రం.. మారిటల్ రేప్ ను నేరంగా పరిగణించబోమని చెప్పింది. కాగా, ఇటీవల జాతీయ న్యాయ కమిషన్.. అత్యాచార చట్టాలను సమీక్షించడం, భార్యపై అత్యాచారం కూడా నేరంగా పరిగణించాలని సూచించినందువల్ల మాతాశిశు సంక్షేమ శాఖ తన విధానంలో మార్పులు చేసుకుంది. అంతేకాక పార్లమెంట్ లో చెప్పిన సమాధానాన్ని కూడా మార్చుకోవాలని భావిస్తున్నది. 'అత్యాచారాల నిరోధానికి ఇప్పుడున్న చట్టాలనే చాలామంది వినియోగించుకోవటం లేదు. మారిటల్ రేప్ విషయంలో కొత్త చట్టం అవసరం లేదు. బాధిత మహిళలు ఎక్కువ మంది బయటికి వచ్చి ఫిర్యాదు చేసినట్టయితే ఆ ఆధారాలను బట్టి మారిటల్ రేప్ ను క్రైమ్ గా పరిగణించే వీలుంటుంది' అని మేనకా గాంధీ అన్నారు.