న్యూఢిల్లీ: తీహర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు వచ్చే నెలలో ప్రత్యేక క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. పురుష ఖైదీలకు ఉద్యోగ నియామకాల కోసం చేపట్టిన డ్రైవ్‌లో ఎక్కువ మంది సంవత్సరానికి రూ.4.5 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగాన్ని దక్కించుకోవడంతో మహిళా ఖైదీలకు కూడా అవకాశమివ్వాలని నిర్ణయించారు. వివిధ కేసుల్లో అరెస్టయి శిక్ష కాలం పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉన్న ఖైదీల కోసం 2010 నుంచి ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ను జైలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 400 మందికి పైగా ఖైదీలు ఉద్యోగాల్లో చేరారు. అయితే మహిళా ఖైదీలు మాత్రం పెద్దగా లబ్ధి పొందలేదు. కేవలం 15 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. జైలు నంబర్ ఆరులోని మహిళా ఖైదీలకు కొత్త జీవితాన్ని అందించడం కోసం ప్రత్యేక ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నామని తీహర్ జైలు పీఆర్‌వో సునీల్ గుప్తా ఆదివారం తెలిపారు. వివిధ నేరాల్లో ప్రస్తుతం జైల్లో 600 మంది మహిళా ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వీరిలో అర్హులైన వారందరికి ఉద్యోగం వచ్చేలా చూస్తున్నామని తెలిపారు.
మహిళా ఖైదీలకు ప్రత్యేక ప్లేస్‌మెంట్ డ్రైవ్
Published Sun, May 11 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement