Thodu Needa Founder Rajeswari: సీనియర్‌ సిటిజన్స్‌కు భరోసా ఏది? | Thodu Needa NGO Founder Rajeswari About Senior Citizens | Sakshi
Sakshi News home page

Thodu Needa Founder Rajeswari: సీనియర్‌ సిటిజన్స్‌కు భరోసా ఏది?

Published Sat, Apr 6 2024 12:59 AM | Last Updated on Sat, Apr 6 2024 12:59 AM

Thodu Needa NGO Founder Rajeswari About Senior Citizens - Sakshi

దేశం నిశ్శబ్దంగా ఒక ముఖ్యమైన జనాభా మార్పుకు గురవుతోంది. ఇండియా ఏజింగ్‌ రిపోర్ట్‌ 2023 ప్రకారం దేశ జనాభాలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సంతానోత్పత్తి రేటు తగ్గడం, అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానాల వల్ల భారతదేశ జనాభాలో వృద్ధుల వాటా నిశ్శబ్దంగా పెరుగుతోంది. అయితే, దీనికి తగినట్టుగా వారి ఆర్థిక శక్తి పెరగడం లేదు. ఫలితంగా వృద్ధులు సొంత కుటుంబాల నుంచే ఈసడింపులకు, వేధింపులకూ గురవుతున్నారు. వృద్ధుల జీవితం భరోసాగా గడవడం ఎలా?!

పాశ్చాత్య దేశాల మాదిరి కాకుండా భారతదేశంలోని 40 శాతం మంది వృద్ధులు అత్యంత పేదరికంలో ఉన్నారు. 60 నుంచి 80 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు ఆర్థిక, ఇతర అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడి ఉన్నారు. గ్రామీణ వృద్ధులు కుల, వర్గ ఆధారిత వివక్షకూ గురవుతున్నారు.

గ్రామాల్లో పెను సవాల్‌!
నగరాలలో ఉండే సీనియర్‌ సిటిజన్స్‌ జీవితాలతో పోల్చితే గ్రామాల్లో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వీరు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నారు. మన ఆరోగ్య విధానం సాధారణంగా మాతా, శిశు సంరక్షణపైనే ఉంటుంది. వృద్ధుల సంరక్షణకు అంతగా ్రపాధాన్యత ఇవ్వడం లేదు. గ్రామీణ వృద్ధులలో ప్రత్యేకించి మహిళలు ఆర్థిక, అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడుతున్నారు. మన దేశంలో వృద్ధుల సంరక్షణ ఎక్కువ భాగం వారి పిల్లలు చూసుకోవడం ఆనవాయితీ. అయితే, కాలంతో పాటు ఈ విధానాలూ వేగంగా మారుతున్నాయి.

పిల్లల వలస.. పెరుగుతున్న ఒంటరితనం
విద్య, ఉద్యోగాల కోసం పిల్లలు వలసలు వెళ్లడం, ఉమ్మడి కుటుంబం వ్యవస్థ విచ్చిన్నం కావడం, వృద్ధుల సంరక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది. నివేదికల ప్రకారం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 6 శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నారు. 20 శాతం మంది పిల్లలు లేకుండా వారి జీవిత భాగస్వామితో మాత్రమే జీవిస్తున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తక్కువ ఆదాయ కుటుంబాలలో వృద్ధుల ఆరోగ్య అవసరాలు ఆర్థికంగా భరించలేనంత భారంగా మారుతున్నాయి. భారతదేశంలో వృద్ధులపై వేధింపుల కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ నివేదిక ప్రకారం 25 శాతం మంది పెద్దలు తమ సొంత కుటుంబాల ద్వారా వేధింపులకు గురవుతున్నారు.

సామాజిక భద్రత
హె ల్ప్‌ ఏజ్‌ ఇండియా సూచనల మేరకు..
► దేశంలో వృద్ధుల కోసం అధికారిక సంస్థాగత సంరక్షణలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. పటిష్టమైన పెన్షన్, సామాజిక భద్రతా వ్యవస్థ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం ద్వారా వారి కుటుంబ సభ్యులపై వృద్ధులు ఆధారపడటం తగ్గించవచ్చు.
► దాదాపు 33 శాతం మంది వృద్ధ స్త్రీలకు ఎటువంటి ఆదాయం లేదు. 11 శాతం మందికి మాత్రమే పెన్షన్‌ ద్వారా ఆదాయం వస్తోంది. 16.3 శాతం మంది సామాజిక పెన్షన్‌ పొందుతున్నారు. సీనియర్‌ కేర్‌ సంస్కరణలపై ఇటీవల ‘నీతి అయోగ్‌’ సమర్పించిన ఓ నివేదిక ప్రకారం వృద్ధుల ఆర్థిక సాధికారతను నిర్ధారించడానికి ప్రభుత్వ నిధుల కవరేజీని పెంచడం, తిరిగి పని నైపుణ్యాలవైపు మళ్లించడం, తప్పనిసరి ΄÷దుపు ప్రణాళికలు, రివర్స్‌ మార్టిగేజ్‌ మెకానిజమ్స్, పన్ను, జీఎస్టీ సంస్కరణల వంటి అనేక చర్యలు చేపట్టాలని పేర్కొంది.
► ఎటువంటి ఆస్తులు, ఆదాయం లేకుండా ఉన్నవారి అవసరాలకు అనుగుణంగా సంపూర్ణ వృద్ధాప్య సంరక్షణ నమూనాను అభివృద్ధి చేయాల్సి ఉంటుందనేది మరో సూచన.


నలుగురు కలిసి ఉంటే ఎంతో మేలు..
వృద్ధులైనా డబ్బున్నవారి పరిస్థితి బాగానే ఉంది. డబ్బులేని వారే జీవశ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు.
► వృద్ధులకు ఓల్డేజీ హోమ్స్‌ తప్ప మరో మార్గం లేదు. ఫుడ్‌ షెల్టర్‌ ఈ రెండే ఇస్తుంది. కానీ, ఎమోషనల్‌గా ఒంటరితనం ఫీలవుతుంటారు. అందుకే, రీ మ్యారేజ్‌ ద్వారా మేం ఒక సొల్యూషన్‌ చూపిస్తున్నాం. లేదంటే, ఒంటరిగా ఉన్న వృద్ధులు ప్రమాదాలకు, దోపిడీలకు గురవుతున్నారు. ఇలాంటప్పుడు నలుగురు వృద్ధులు కలిసి ఒక చోట ఉండవచ్చు. దీని వల్ల ఒంటరితనం పోగొట్టుకోగలుగుతారు.
► అప్పడాలు, వడియాలు వంటివి చేసి, వ్యాపారం చేసుకోవచ్చు. కానీ, 70 ఏళ్ల వయసులో ఏ పనీ చేయడానికి ఓపిక ఉండదు. పెట్టింది తినడం తప్ప ఏ రకమైన ఫిజికల్‌ స్ట్రెయిన్‌ పడలేరు. అందుకని, రూమ్మెట్స్‌ లాగా కలిసి ఉండాలి. అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇండోర్‌గేమ్స్, స్థానిక పర్యాటక స్థలాలు చూసి రావచ్చు.
► యువత పట్టించుకోదు, మధ్య వయసువారికి కుటుంబ సమస్యలు. సీనియర్‌ సిటిజన్స్‌ పట్ల ఎవరికీ జాలి, దయ ఉండదు. వృద్ధులకు ఇచ్చే ఆత్మీయ స్పర్శను ఎంతో ఓదార్పుగా ఫీలవుతారు.
► రాజకీయ వర్గం తరచుగా యువ జనాభాను ఆర్థిక ఆస్తిగా పేర్కొంటుంది. పెరుగుతున్న వృద్ధ జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, సామాజిక మద్దతును అందించడానికి అంతగా ఆసక్తి చూపదు. ఏ రకమైన ఆదాయం లేనివారికి ప్రభుత్వమే వారికో దారి చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పెన్షన్‌ రూపేణ వచ్చే వనరుతోనూ నలుగురు కలిసి ఉండవచ్చు.

– ఎన్‌.ఎమ్‌.రాజేశ్వరి, తోడు నీడ స్వచ్ఛంధ సంస్థ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement