అక్షరధామ్ నుండి ప్రవాసాంద్రులకు పిలుపు
ప్రముఖ స్వచ్ఛంద సంస్థ స్పర్శ్ హస్పైస్ హైదరాబాద్‌లో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని స్పర్శ్ విభాగం మద్ధతుగా నిలిచింది. అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో ఇటీవల నిర్మించిన అక్షర్ ధామ్ మందిరం వేదికగా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి అంటూ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చింది.
స్పర్శ్ హస్పైస్ కార్యక్రమాలేంటీ?
స్పర్శ్ హస్పైస్ ఒక స్వచ్ఛంధ సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా రోగులకు ఉచిత సేవలందిస్తోంది. ముఖ్యంగా చాలా కాలం పాటు వైద్య సేవలు అవసరమయ్యే అభాగ్యులకు (Long term care) స్పర్శ్ అండగా నిలుస్తోంది. మంచానికే పరిమితమైపోయి, దీర్ఘకాలం మెడికల్ కేర్ కోరుకునే వారికి ఇది అండగా నిలుస్తోంది. దీంతో పాటు కొందరు వృద్ధులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడమో, లేక కుటుంబం, దగ్గరి వారి నుంచి మద్ధతు లేకపోవడమో, లేక చికిత్స లేదనుకున్న సమయంలో తీవ్ర ఆందోళనకు గురైపోతున్నారు. క్యాన్సర్, న్యూరో, గుండె పోటు లేక ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడిన వారు ఇందులో ఉంటున్నారు. ఇలాంటి వారందరికి స్పర్శ్ అండగా నిలుస్తోంది.
స్పర్శ్ హస్పైస్‌లో ఎలాంటి సౌకర్యాలున్నాయి?
స్పర్శ్‌లో ఆరు హోం కేర్ వ్యాన్‌లు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. అలాగే ఔట్ పేషేంట్ సర్వీసులతో పాటు ఇన్ పేషేంట్ సౌకర్యాలున్నాయి. దీర్ఘకాలం చికిత్స అందించే సౌకర్యాలు, నొప్పి నివారణ మార్గాలు, ఔషద చికిత్సతో పాటు మేమున్నామంటూ అండగా నిలిచే సామాజిక మద్ధతు స్పర్శ్‌లో ఉంది. దీని వల్ల రోగులకు పూర్తి భరోసా కలగడంతో పాటు త్వరగా స్వస్థత లభిస్తోంది.
అమెరికా అక్షర్‌ధామ్ కార్యక్రమమేంటీ?
న్యూజెర్సీ రాబిన్స్‌విల్లె 112 మెయిన్ స్ట్రీట్‌లో ఏర్పాటయిన BAPS స్వామి నారాయణ్ మందిర్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఇటీవల నిర్మించిన అక్షర్‌ధామ్ మందిరం అత్యంత ఆకర్షణీయంగా ఉండడంతో పాటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్పర్శ్ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు అక్షర్‌ధామ్ తన వంతు మద్ధతు ప్రకటించింది. అక్షర్‌ధామ్ ట్రస్టీలయిన డాక్టర్ సుబ్రహ్మణ్యం, లక్స్ గోపిశెట్టి ఈ సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి అంటూ పిలుపునిచ్చారు.
విజిట్ అక్షర్‌ధామ్
అక్షర్‌ధామ్ ఆలయంలో అక్టోబర్ 22, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడికి వచ్చే వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్షర్‌ధామ్ ఆలయ మందిరమంతా చూపిస్తారు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అతిథ్యంలో భాగంగా అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను స్పర్శ్ హస్పైస్‌కు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment