
ఖైరతాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్ వాజిద్ దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో నివసించే మహ్మద్ అజీజ్ జలమండలి ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు మహ్మద్ వాజిద్ (28) 2021లో ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లాడు.
వాజిద్ తమ్ముడు మహ్మద్ మాజిద్ కూడా అక్కడే ఎంఎస్ చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మాజిద్ అనారోగ్యం బారిన పడటంతో మందులు తీసుకువచ్చేందుకు వాజిద్ కారులో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కారును ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
పెళ్లి చేసే యోచనలో ఉండగానే..
మహ్మద్ వాజిద్‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉండగానే.. అతని మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను అమెరికా రావాలంటూ వాజిద్ వారం రోజుల క్రితం వీసా కూడా పంపించినట్లు సమాచారం.

వారు రెండు మూడు రోజుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే కుమారుడి మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలోనే వాజిద్ అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మహ్మద్ వాజిద్ గతంలో ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ లీడర్‌గా పని చేశాడని, ప్రస్తుతం అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. ఎంఎస్ మక్తాలోని వాజిద్ కుటుంబ సభ్యులను ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment