Elderly citizens protest
-
వృద్ధాప్యం బరువై.. ఆదరణ కరువై..
సాక్షి, హైదరాబాద్: పండుటాకులకు ఎంత కష్టం.. జీవనయానం ఎంత దయనీయం.. మలిసంధ్య వేళ వెలుగురేఖల్లేక అంధకారం అలముకుంది. వృద్ధాప్యం బరువైంది.. ఆదరణ కరువైంది. వృద్ధులను నిరాదరణ, నిర్లక్ష్యం ఆవరించాయి. అనువైన జీవనం కోసం ఎక్కువ శాతం మంది వృద్ధులు సంరక్షకులపై ఆధారపడాల్సి వస్తోందని హెల్ప్‌ఏజ్ ఇండియా నివేదిక వెల్లడించింది. హెల్ప్ ఏజ్ ఇండియా ఈ ఏడాది జాతీయ నివేదిక విడుదల చేసింది. పది రాష్ట్రాల్లో 20 ముఖ్యమైన టైర్ 1, 2 నగరాల్లో 5,169 వృద్ధులు, 1,333 వృద్ధుల సంరక్షకులు, కుటుంబసభ్యులపై అధ్యయనం చేసింది. ఈ సర్వేలో భాగంగా పలు కీలక ఆరి్థక, ఆరోగ్య, ప్రాథమిక సంరక్షణ విషయాలు వెలుగుచూశాయి. ప్రతి ముగ్గురు వృద్ధుల్లో ఒకరు ఆరి్థక సమస్యల్లో ఉన్నారు. వృద్ధుల్లో ఎలాంటి ఆదాయంలేని పురుషులు 27 శాతం, మహిళలు 38 శాతం ఉన్నారు. 32 శాతం వృద్ధులు రూ.50 వేల కంటే తక్కువ వార్షిక ఆదా యం కలిగి ఉన్నారు. 29 శాతం వృద్ధులు మా త్రమే సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య పెన్షన్/కాంట్రిబ్యూటరీ పెన్షన్/ప్రావిడెంట్ ఫండ్లను పొందుతున్నారని సర్వే వెల్లడించింది. నిరక్షరాస్యులైన వృద్ధులు (40 శాతం) ఎలాంటి ఆదాయ వనరులు లేక అవస్థలు పడుతున్నారు. 54 శాతం మందికి వ్యాధులు 52 శాతం వృద్ధులు ఆరోగ్యపరంగా నిత్యం ఏదో ఒక ప్రాథమిక సవాలును ఎదుర్కొంటున్నారు. 54 శాతం మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు. 31 శాతం మంది వృద్ధులు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్, ఈఎస్ఐ–సీజీహెచ్ఎస్ వంటి ఆరోగ్య బీమాలను కలిగి ఉంగా, 3 శాతం మంది మాత్రమే కమర్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లు నివేదించారు. ఆరోగ్య బీమా లేకపోవడానికి ప్రధాన కారణాలుగా అవగాహన లేకపోవడం(32%), ఆరి్థక స్థోమత లేకపోవడం (24%), దాని అవసరం లేకపోవడం (12%) అని గుర్తించారు. 1.5 శాతం మంది మాత్రమే టెలీ–హెల్త్ సేవలను ఉపయోగించారు. 79 శాతం మంది వృద్ధులు ప్రభుత్వ ఆసుపత్రులు/క్లినిక్‌లు/పీహెచ్‌సీలను సందర్శించారు. 80 ఏళ్లు పైబడిన 47 శాతం మందికి ఆసుపత్రులకు వెళ్లడానికి వ్యక్తిగత ఆదాయం లేక అవస్థలను ఎదుర్కొంటున్నారని హెల్ప్‌ఏజ్ ఇండియా పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ హెడ్ అనుపమ దత్తా వెల్లడించారు. నిరక్షరాస్యులపట్ల నిర్లక్ష్యం వృద్ధులు నిర్లక్ష్యానికి గురికావడంలో కుమారులు 42 శాతం, కోడళ్లు 28 శాతం కారణంగా ఉన్నారు. నిర్లక్ష్యం ఎదుర్కొన్నవారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కాగా, వృద్ధుల ఆదాయం తగ్గడంతో వారిపై నిర్లక్ష్యం పెరిగిందని 73 శాతం బాధితులు నివేదించారు. ఈ బాధితులు (94 శాతం మంది) కనీసం ఒక దీర్ఘకాలిక వ్యాధికి గురికావడం వల్ల కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. నిర్లక్ష్యానికి గురైన బాధితులు.. వారిని దూషించడం, కొట్టడం వంటి చర్యలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయగా, పరిష్కారం లభించలేదని కుమిలిపోతున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చాలా అత్యల్పమని హెల్ప్‌ఏజ్ ఇండియా సీఈఓ రోహిత్ ప్రసాద్ పేర్కొన్నారు. మంచాన పడినప్పుడువృద్ధుల సంరక్షణలో కుటుంబసభ్యులు ప్రాథమిక పాత్ర పోషించారని సర్వే తెలిపింది. వృద్ధులు మంచాన పడినప్పుడు వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు చూసుకున్నారని, 68 శాతం మంది సంరక్షకులు వారికి బాసటగా నిలిచామని తెలిపారు. సగటున వారంలో దాదాపు 20 గంటలు వారి సేవలకే అంకితం చేశామని సంరక్షకులు తెలిపారు. అయితే సంరక్షణలో భాగంగా 10 శాతం మంది మాత్రమే సమీపంలో వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్లు, పాలియేటివ్ కేర్(ఉపశమన సేవలు) వినియోగించుకున్నారని వెల్లడైంది. జెరియాట్రిక్ హెల్త్‌కేర్ సౌకర్యాలను 15 శాతం మంది మాత్రమే అందించారు. -
World Elder Abuse Awareness Day : మెయింటెనెన్స్ హక్కులు, ఆసక్తికర సంగతులు
ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (INPEA) జూన్ 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేని స్థాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని డిసెంబర్ 2011లో అధికారికంగా గుర్తించింది. వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఎదుర్కొనే వేధింపులు దోపిడీ గురించి అవగాహన పెంచడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. కుటుంబం సంక్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి జీవిత చరమాంకంలో సముచిత స్థానం లభించడం లేదు సరికదా, వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస,దాడులు బాధాకరం. భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొంటున్నారు.ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, కాన్పూర్ , మదురై సహా అనేక నగరాలను ఈ సర్వేలో చేర్చారు. అందిన నివేదిక ప్రకారం, 73శాతం మంది యువకులు వృద్ధుల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మందిలో ఒకరు ఈ వేధింపులకు గురవుతున్నారు.కన్నబిడ్డల్నితల్లిదండ్రులు ఎంత అప్యాయంగా, ప్రేమగా పెంచి, ఆసరాగా ఉన్నట్లే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి బిడ్డ విధి. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఆస్తి కోసం, శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. సామాన్య మానవుల నుంచి కార్పొరేట్ కుటుంబాల దాకా ఇలాంటి సంఘటనలను ప్రతీనిత్యం చూస్తూనే ఉన్నాంWEAAD 2024 థీమ్: అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులపై ప్రత్యేక దృష్టి అనేది ఈ ఏడాది థీమ్. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు , కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను ఇది నొక్కి చెబుతుంది. అత్యవసర సమయాల్లో వృద్ధుల నిర్దిష్ట అవసరాలు పరిష్కరించడం చాలా కీలకమనే విషయాన్ని తెలియజేస్తుంది.వృద్ధులు లేదా సీనియర్ సిటిజన్ల హక్కులను, కుటుంబ సభ్యులతోపాటు, సమాజం కూడా గుర్తించాలి. వృద్ధులకు విలువనిచ్చి, వారిని గౌరవించే సమాజాన్ని సృష్టించేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సాంఘిక సంఘాలు ఐక్యంగా ఉంటూ, వృద్ధులు శారీరకంగా, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని నిర్మించాలి.చట్టాలుసీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల చట్టపరమైన హక్కులు సీనియర్ సిటిజన్‌ను ఎక్కడైనా వదిలిపెట్టడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలని, అలాగే సీనియర్ సిటిజన్లకు తగిన వైద్య సంరక్షణను అందించాలని కూడా ఈ చట్టం చెబుతుంది.ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రతి హిందువు తన/ఆమె జీవితకాలంలో తన/ఆమె వృద్ధులైన లేదా బలహీనమైన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యతను విధిస్తుంది. కాబట్టి, వృద్ధులు లేదా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులను కాపాడుకోవడం కొడుకులు, కుమార్తెలు ఇద్దరి బాధ్యత ఉంటుంది.తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 కింద, వారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. పిల్లలు లేదా బంధువులు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు గుర్తిస్తే, వారికి నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంత మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుందో అనేది కూడా కోర్టు విచారణ చేసిన నిర్ణయిస్తుంది దరఖాస్తు తేదీ నుండి మెయింటెనెన్స్ మొత్తంపై వడ్డీ (5-8 శాతం) తో కలిపి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు ఆర్డర్ తర్వాత కూడా మెయింటెనెన్స్ అందకపోతే ఏదైనా ఇలాంటి కోర్టు (మెయింటెనెన్స్ ట్రిబ్యునల్)కి వెళ్లి, ఆర్డర్‌ను అమలు చేయడంలో సహాయం కోసం అడగవచ్చు. -
Thodu Needa Founder Rajeswari: సీనియర్ సిటిజన్స్‌కు భరోసా ఏది?
దేశం నిశ్శబ్దంగా ఒక ముఖ్యమైన జనాభా మార్పుకు గురవుతోంది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశ జనాభాలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సంతానోత్పత్తి రేటు తగ్గడం, అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానాల వల్ల భారతదేశ జనాభాలో వృద్ధుల వాటా నిశ్శబ్దంగా పెరుగుతోంది. అయితే, దీనికి తగినట్టుగా వారి ఆర్థిక శక్తి పెరగడం లేదు. ఫలితంగా వృద్ధులు సొంత కుటుంబాల నుంచే ఈసడింపులకు, వేధింపులకూ గురవుతున్నారు. వృద్ధుల జీవితం భరోసాగా గడవడం ఎలా?! పాశ్చాత్య దేశాల మాదిరి కాకుండా భారతదేశంలోని 40 శాతం మంది వృద్ధులు అత్యంత పేదరికంలో ఉన్నారు. 60 నుంచి 80 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు ఆర్థిక, ఇతర అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడి ఉన్నారు. గ్రామీణ వృద్ధులు కుల, వర్గ ఆధారిత వివక్షకూ గురవుతున్నారు. గ్రామాల్లో పెను సవాల్! నగరాలలో ఉండే సీనియర్ సిటిజన్స్ జీవితాలతో పోల్చితే గ్రామాల్లో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వీరు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నారు. మన ఆరోగ్య విధానం సాధారణంగా మాతా, శిశు సంరక్షణపైనే ఉంటుంది. వృద్ధుల సంరక్షణకు అంతగా ్రపాధాన్యత ఇవ్వడం లేదు. గ్రామీణ వృద్ధులలో ప్రత్యేకించి మహిళలు ఆర్థిక, అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడుతున్నారు. మన దేశంలో వృద్ధుల సంరక్షణ ఎక్కువ భాగం వారి పిల్లలు చూసుకోవడం ఆనవాయితీ. అయితే, కాలంతో పాటు ఈ విధానాలూ వేగంగా మారుతున్నాయి. పిల్లల వలస.. పెరుగుతున్న ఒంటరితనం విద్య, ఉద్యోగాల కోసం పిల్లలు వలసలు వెళ్లడం, ఉమ్మడి కుటుంబం వ్యవస్థ విచ్చిన్నం కావడం, వృద్ధుల సంరక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది. నివేదికల ప్రకారం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 6 శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నారు. 20 శాతం మంది పిల్లలు లేకుండా వారి జీవిత భాగస్వామితో మాత్రమే జీవిస్తున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తక్కువ ఆదాయ కుటుంబాలలో వృద్ధుల ఆరోగ్య అవసరాలు ఆర్థికంగా భరించలేనంత భారంగా మారుతున్నాయి. భారతదేశంలో వృద్ధులపై వేధింపుల కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ నివేదిక ప్రకారం 25 శాతం మంది పెద్దలు తమ సొంత కుటుంబాల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. సామాజిక భద్రత హె ల్ప్ ఏజ్ ఇండియా సూచనల మేరకు.. ► దేశంలో వృద్ధుల కోసం అధికారిక సంస్థాగత సంరక్షణలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. పటిష్టమైన పెన్షన్, సామాజిక భద్రతా వ్యవస్థ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం ద్వారా వారి కుటుంబ సభ్యులపై వృద్ధులు ఆధారపడటం తగ్గించవచ్చు. ► దాదాపు 33 శాతం మంది వృద్ధ స్త్రీలకు ఎటువంటి ఆదాయం లేదు. 11 శాతం మందికి మాత్రమే పెన్షన్ ద్వారా ఆదాయం వస్తోంది. 16.3 శాతం మంది సామాజిక పెన్షన్ పొందుతున్నారు. సీనియర్ కేర్ సంస్కరణలపై ఇటీవల ‘నీతి అయోగ్’ సమర్పించిన ఓ నివేదిక ప్రకారం వృద్ధుల ఆర్థిక సాధికారతను నిర్ధారించడానికి ప్రభుత్వ నిధుల కవరేజీని పెంచడం, తిరిగి పని నైపుణ్యాలవైపు మళ్లించడం, తప్పనిసరి ΄÷దుపు ప్రణాళికలు, రివర్స్ మార్టిగేజ్ మెకానిజమ్స్, పన్ను, జీఎస్టీ సంస్కరణల వంటి అనేక చర్యలు చేపట్టాలని పేర్కొంది. ► ఎటువంటి ఆస్తులు, ఆదాయం లేకుండా ఉన్నవారి అవసరాలకు అనుగుణంగా సంపూర్ణ వృద్ధాప్య సంరక్షణ నమూనాను అభివృద్ధి చేయాల్సి ఉంటుందనేది మరో సూచన. నలుగురు కలిసి ఉంటే ఎంతో మేలు.. వృద్ధులైనా డబ్బున్నవారి పరిస్థితి బాగానే ఉంది. డబ్బులేని వారే జీవశ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు. ► వృద్ధులకు ఓల్డేజీ హోమ్స్ తప్ప మరో మార్గం లేదు. ఫుడ్ షెల్టర్ ఈ రెండే ఇస్తుంది. కానీ, ఎమోషనల్‌గా ఒంటరితనం ఫీలవుతుంటారు. అందుకే, రీ మ్యారేజ్ ద్వారా మేం ఒక సొల్యూషన్ చూపిస్తున్నాం. లేదంటే, ఒంటరిగా ఉన్న వృద్ధులు ప్రమాదాలకు, దోపిడీలకు గురవుతున్నారు. ఇలాంటప్పుడు నలుగురు వృద్ధులు కలిసి ఒక చోట ఉండవచ్చు. దీని వల్ల ఒంటరితనం పోగొట్టుకోగలుగుతారు. ► అప్పడాలు, వడియాలు వంటివి చేసి, వ్యాపారం చేసుకోవచ్చు. కానీ, 70 ఏళ్ల వయసులో ఏ పనీ చేయడానికి ఓపిక ఉండదు. పెట్టింది తినడం తప్ప ఏ రకమైన ఫిజికల్ స్ట్రెయిన్ పడలేరు. అందుకని, రూమ్మెట్స్ లాగా కలిసి ఉండాలి. అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇండోర్‌గేమ్స్, స్థానిక పర్యాటక స్థలాలు చూసి రావచ్చు. ► యువత పట్టించుకోదు, మధ్య వయసువారికి కుటుంబ సమస్యలు. సీనియర్ సిటిజన్స్ పట్ల ఎవరికీ జాలి, దయ ఉండదు. వృద్ధులకు ఇచ్చే ఆత్మీయ స్పర్శను ఎంతో ఓదార్పుగా ఫీలవుతారు. ► రాజకీయ వర్గం తరచుగా యువ జనాభాను ఆర్థిక ఆస్తిగా పేర్కొంటుంది. పెరుగుతున్న వృద్ధ జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, సామాజిక మద్దతును అందించడానికి అంతగా ఆసక్తి చూపదు. ఏ రకమైన ఆదాయం లేనివారికి ప్రభుత్వమే వారికో దారి చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పెన్షన్ రూపేణ వచ్చే వనరుతోనూ నలుగురు కలిసి ఉండవచ్చు. – ఎన్.ఎమ్.రాజేశ్వరి, తోడు నీడ స్వచ్ఛంధ సంస్థ, హైదరాబాద్ -
హైకోర్టును కదిలించిన వృద్ధుల పోరాటం
సాక్షి, అమరావతి: జీవిత చరమాంకంలో ఉన్న ఇద్దరు వృద్ధులు దాదాపు దశాబ్దం నుంచి చేస్తున్న న్యాయపోరాటం హైకోర్టును కదిలించింది. ఆ వృద్ధులకు సత్వర న్యాయం అందించాలని విజయవాడ కోర్టును ఆదేశించింది. ఈ వయసులోనైనా న్యాయ ఫలాలను ఆస్వాదించనివ్వాలని, అప్పుడే వారు ఆనందిస్తారని తెలిపింది. రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో రాయితీల మీద పాసులు ఇస్తే వృద్ధులను గౌరవించినట్లు కాదని, సత్వర విచారణ జరిపి వారి కేసులను పరిష్కరిస్తేనే వారిని గౌరవించినట్లని స్పష్టం చేసింది. దాదాపు పదేళ్లుగా ఎలాంటి సహేతుక కారణాలు లేకుండానే ఈ వృద్ధుల పిటిషన్ అపరిష్కృతంగా ఉందని, అందువల్ల వారి వ్యాజ్యాన్ని గరిష్టంగా రెండు నెలల్లో పరిష్కరించాలని విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం తీర్పు వెలువరించారు. వారి అభ్యర్థనను సానుకూల దృక్పథంతో చూడాలి ఓ ఇంటి విషయంలో కింది కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, దీని ప్రకారం తమకు రావాల్సిన ప్రయోజనాలను మదింపు చేసేందుకు వీలుగా అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరుతూ వెంకట హనుమంత కృష్ణమూర్తి (80), ఉదయ్ ప్రభాకర్ శర్మ (72) విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో 2011లో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం అలాగే పెండింగ్‌లో ఉండటంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌ను పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపి సోమవారం తీర్పు వెలువరించారు. ‘పిటిషనర్లు ఇద్దరూ వయోవృద్ధులు. కింది కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఫలాలను తాము బతికున్నప్పుడే ఆస్వాదిస్తామన్న ఆశతో హైకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్’ పేరుతో పథకం తీసుకొచ్చింది. దీనికనుగుణంగా 65 ఏళ్లకు పైబడిన వారి కేసులను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలని న్యాయాధికారులను ఆదేశిస్తూ 1999, 2003, 2014ల్లో హైకోర్టు సర్క్యులర్లను జారీ చేసింది. అయినా వృద్ధుల కేసులు తగ్గడం లేదు. కొన్ని కోర్టులు ఏళ్ల తరబడి కేసులను వాయిదా వేస్తున్నాయి. ప్రస్తుత కేసు అందుకు ఉదాహరణ. పిటిషనర్లు 2002లో కింది కోర్టులో పిటిషన్ వేసి 2010లో సానుకూల తీర్పు పొందారు. ఆ తీర్పు ప్రకారం రావాల్సిన ప్రయోజనాల కోసం 2011లో విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ కోర్టు కేసును ఇప్పటికీ పెండింగ్‌లో ఉంచడం చట్ట నిబంధనలకు విరుద్ధం.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించండి
వరంగల్ రూరల్ : పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వృద్ధ దంపతులు గురువారం వరంగల్ రూరల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గుగులోతు దేప్యా, సతీమణి అంజరమ్మ దంపతులకు వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని 561, 562, 563, 658, 659, 660 సర్వే నంబ ర్లలో 9 ఎకరాల సాగు భూమి ఉంది. సన్నూరు వీఆర్ఓగా పనిచేస్తున్న డి.వెంకటేశ్వర్లు 2014లో వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయకుండా ఇతరుల పేరుపై జారీ చేశాడు. అప్పటి నుంచి దంపతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించు కోవడంలేదు. విసిగిపోయిన బాధితులు ‘సన్నూ రు వీఆర్వో బి.వెంకటేశ్వర్లు మా భూమి మాకు కాకుండా చేస్తున్నాడు. మా వయసు 75 సంవత్సరాలు. మేం రాయపర్తి ఎంఆర్వో కార్యాలయం చుట్టూ తిరగలేం. వీఆర్ఎపై చర్య తీసుకుని మా భూమి మాకు ఇప్పించాలని’ఫ్లెక్సీపై రాసి ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రదర్శించారు. వారం రోజుల్లో న్యాయం చేస్తాం: ఆర్డీవో వృద్ధ దంపతుల సమస్యపై ఆర్డీవో సీహెచ్.మహేందర్‌జీ స్పందించారు. వారం రోజుల్లో దంపతులకు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయిం చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే సన్నూరు వీఆర్వో వెంకటేశ్వర్లుపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ప్రధాని నివాసం వద్ద వృద్ధుల నిరసన
ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక నివాసం ఎదుట శుక్రవారం వయోవృద్ధులు, సామాజిక కార్యకర్త అరుణా రాయ్ ధర్నా నిర్వహించారు. 7 రేసు కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసానికి వెళ్లి పెన్షన్ పథకాన్నిపునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు నిరసన కారుల్ని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాబా ఆధావ్, ఆరుణా రాయ్ సారథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జైరాం రమేష్ సహా ఇతర నాయకుల్ని కలసినట్టు అరుణా రాయ్ తెలిపారు. ప్రతి నెల తగినంత భృతి అందేలా వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.