ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (INPEA) జూన్ 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్‌నెస్ డేని స్థాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని డిసెంబర్ 2011లో అధికారికంగా గుర్తించింది. వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఎదుర్కొనే వేధింపులు దోపిడీ గురించి అవగాహన పెంచడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం లక్ష్యం.
ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. కుటుంబం సంక్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి జీవిత చరమాంకంలో సముచిత స్థానం లభించడం లేదు సరికదా, వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస,దాడులు బాధాకరం. భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొంటున్నారు.
ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, కాన్పూర్ , మదురై సహా అనేక నగరాలను ఈ సర్వేలో చేర్చారు. అందిన నివేదిక ప్రకారం, 73శాతం మంది యువకులు వృద్ధుల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మందిలో ఒకరు ఈ వేధింపులకు గురవుతున్నారు.
కన్నబిడ్డల్నితల్లిదండ్రులు ఎంత అప్యాయంగా, ప్రేమగా పెంచి, ఆసరాగా ఉన్నట్లే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి బిడ్డ విధి. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఆస్తి కోసం, శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. సామాన్య మానవుల నుంచి కార్పొరేట్ కుటుంబాల దాకా ఇలాంటి సంఘటనలను ప్రతీనిత్యం చూస్తూనే ఉన్నాం
WEAAD 2024 థీమ్: అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులపై ప్రత్యేక దృష్టి అనేది ఈ ఏడాది థీమ్. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు , కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను ఇది నొక్కి చెబుతుంది. అత్యవసర సమయాల్లో వృద్ధుల నిర్దిష్ట అవసరాలు పరిష్కరించడం చాలా కీలకమనే విషయాన్ని తెలియజేస్తుంది.
వృద్ధులు లేదా సీనియర్ సిటిజన్ల హక్కులను, కుటుంబ సభ్యులతోపాటు, సమాజం కూడా గుర్తించాలి. వృద్ధులకు విలువనిచ్చి, వారిని గౌరవించే సమాజాన్ని సృష్టించేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సాంఘిక సంఘాలు ఐక్యంగా ఉంటూ, వృద్ధులు శారీరకంగా, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని నిర్మించాలి.
చట్టాలు
సీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల చట్టపరమైన హక్కులు సీనియర్ సిటిజన్‌ను ఎక్కడైనా వదిలిపెట్టడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలని, అలాగే సీనియర్ సిటిజన్‌లకు తగిన వైద్య సంరక్షణను అందించాలని కూడా ఈ చట్టం చెబుతుంది.
ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రతి హిందువు తన/ఆమె జీవితకాలంలో తన/ఆమె వృద్ధులైన లేదా బలహీనమైన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యతను విధిస్తుంది. కాబట్టి, వృద్ధులు లేదా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులను కాపాడుకోవడం కొడుకులు, కుమార్తెలు ఇద్దరి బాధ్యత ఉంటుంది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 కింద, వారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. పిల్లలు లేదా బంధువులు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు గుర్తిస్తే, వారికి నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంత మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుందో అనేది కూడా కోర్టు విచారణ చేసిన నిర్ణయిస్తుంది దరఖాస్తు తేదీ నుండి మెయింటెనెన్స్ మొత్తంపై వడ్డీ (5-8 శాతం) తో కలిపి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు ఆర్డర్ తర్వాత కూడా మెయింటెనెన్స్ అందకపోతే ఏదైనా ఇలాంటి కోర్టు (మెయింటెనెన్స్ ట్రిబ్యునల్)కి వెళ్లి, ఆర్డర్‌ను అమలు చేయడంలో సహాయం కోసం అడగవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment