సంరక్షకులపై ఆధారపడి బతుకీడుస్తున్న వృద్ధులు
ఆదాయంలేక వృద్ధులకు ఆదరణ కరువు
31 శాతం వృద్ధులకు మాత్రమే బీమా
హెల్పేజ్ ఇండియా నివేదికలో వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు
సాక్షి, హైదరాబాద్: పండుటాకులకు ఎంత కష్టం.. జీవనయానం ఎంత దయనీయం.. మలిసంధ్య వేళ వెలుగురేఖల్లేక అంధకారం అలముకుంది. వృద్ధాప్యం బరువైంది.. ఆదరణ కరువైంది. వృద్ధులను నిరాదరణ, నిర్లక్ష్యం ఆవరించాయి. అనువైన జీవనం కోసం ఎక్కువ శాతం మంది వృద్ధులు సంరక్షకులపై ఆధారపడాల్సి వస్తోందని హెల్ప్‌ఏజ్ ఇండియా నివేదిక వెల్లడించింది. హెల్ప్ ఏజ్ ఇండియా ఈ ఏడాది జాతీయ నివేదిక విడుదల చేసింది. పది రాష్ట్రాల్లో 20 ముఖ్యమైన టైర్ 1, 2 నగరాల్లో 5,169 వృద్ధులు, 1,333 వృద్ధుల సంరక్షకులు, కుటుంబసభ్యులపై అధ్యయనం చేసింది.
ఈ సర్వేలో భాగంగా పలు కీలక ఆరి్థక, ఆరోగ్య, ప్రాథమిక సంరక్షణ విషయాలు వెలుగుచూశాయి. ప్రతి ముగ్గురు వృద్ధుల్లో ఒకరు ఆరి్థక సమస్యల్లో ఉన్నారు. వృద్ధుల్లో ఎలాంటి ఆదాయంలేని పురుషులు 27 శాతం, మహిళలు 38 శాతం ఉన్నారు. 32 శాతం వృద్ధులు రూ.50 వేల కంటే తక్కువ వార్షిక ఆదా యం కలిగి ఉన్నారు. 29 శాతం వృద్ధులు మా త్రమే సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య పెన్షన్/కాంట్రిబ్యూటరీ పెన్షన్/ప్రావిడెంట్ ఫండ్‌లను పొందుతున్నారని సర్వే వెల్లడించింది. నిరక్షరాస్యులైన వృద్ధులు (40 శాతం) ఎలాంటి ఆదాయ వనరులు లేక అవస్థలు పడుతున్నారు.
54 శాతం మందికి వ్యాధులు
52 శాతం వృద్ధులు ఆరోగ్యపరంగా నిత్యం ఏదో ఒక ప్రాథమిక సవాలును ఎదుర్కొంటున్నారు. 54 శాతం మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు. 31 శాతం మంది వృద్ధులు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్, ఈఎస్‌ఐ–సీజీహెచ్‌ఎస్ వంటి ఆరోగ్య బీమాలను కలిగి ఉంగా, 3 శాతం మంది మాత్రమే కమర్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లు నివేదించారు. ఆరోగ్య బీమా లేకపోవడానికి ప్రధాన కారణాలుగా అవగాహన లేకపోవడం(32%), ఆరి్థక స్థోమత లేకపోవడం (24%), దాని అవసరం లేకపోవడం (12%) అని గుర్తించారు. 1.5 శాతం మంది మాత్రమే టెలీ–హెల్త్ సేవలను ఉపయోగించారు. 79 శాతం మంది వృద్ధులు ప్రభుత్వ ఆసుపత్రులు/క్లినిక్‌లు/పీహెచ్‌సీలను సందర్శించారు. 80 ఏళ్లు పైబడిన 47 శాతం మందికి ఆసుపత్రులకు వెళ్లడానికి వ్యక్తిగత ఆదాయం లేక అవస్థలను ఎదుర్కొంటున్నారని హెల్ప్‌ఏజ్ ఇండియా పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ హెడ్ అనుపమ దత్తా వెల్లడించారు.
నిరక్షరాస్యులపట్ల నిర్లక్ష్యం
వృద్ధులు నిర్లక్ష్యానికి గురికావడంలో కుమారులు 42 శాతం, కోడళ్లు 28 శాతం కారణంగా ఉన్నారు. నిర్లక్ష్యం ఎదుర్కొన్నవారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కాగా, వృద్ధుల ఆదాయం తగ్గడంతో వారిపై నిర్లక్ష్యం పెరిగిందని 73 శాతం బాధితులు నివేదించారు. ఈ బాధితులు (94 శాతం మంది) కనీసం ఒక దీర్ఘకాలిక వ్యాధికి గురికావడం వల్ల కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. నిర్లక్ష్యానికి గురైన బాధితులు.. వారిని దూషించడం, కొట్టడం వంటి చర్యలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయగా, పరిష్కారం లభించలేదని కుమిలిపోతున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చాలా అత్యల్పమని హెల్ప్‌ఏజ్ ఇండియా సీఈఓ రోహిత్ ప్రసాద్ పేర్కొన్నారు.
మంచాన పడినప్పుడు
వృద్ధుల సంరక్షణలో కుటుంబసభ్యులు ప్రాథమిక పాత్ర పోషించారని సర్వే తెలిపింది. వృద్ధులు మంచాన పడినప్పుడు వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు చూసుకున్నారని, 68 శాతం మంది సంరక్షకులు వారికి బాసటగా నిలిచామని తెలిపారు. సగటున వారంలో దాదాపు 20 గంటలు వారి సేవలకే అంకితం చేశామని సంరక్షకులు తెలిపారు. అయితే సంరక్షణలో భాగంగా 10 శాతం మంది మాత్రమే సమీపంలో వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్లు, పాలియేటివ్ కేర్(ఉపశమన సేవలు) వినియోగించుకున్నారని వెల్లడైంది. జెరియాట్రిక్ హెల్త్‌కేర్ సౌకర్యాలను 15 శాతం మంది మాత్రమే అందించారు.
Comments
Please login to add a commentAdd a comment