అర్ధ శతాబ్దంలో గణనీయంగా తగ్గుదల
2022తో పోలిస్తే నాలుగు శాతం ఎక్కువ
మంచి నీటిలో జీవించే జాతులకే అధిక ముప్పు
భారత్‌లో అంతరించిపోతున్న రాబందులు
వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్‌కు చెందిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్‌లో వెల్లడి
వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్లు పేర్కొంది. అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని వెల్లడించింది.
అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్టు పేర్కొంది. 1970 నుంచి 2020 మధ్య కాలంలో సగటు జాతుల్లో 73శాతం తగ్గుదలను గుర్తించింది.
అత్యధికంగా మంచి నీటిలో జీవించే జాతులు ఎక్కువ ప్రమాదానికి (85శాతం) అంతరించిపోయినట్టు స్పష్టం చేసింది. భూ సంబంధ జాతుల్లో 69శాతం, సముద్ర జాతుల్లో 56 శాతంగా ఉంది. ఇలా వన్యప్రాణులు అంతరించపోవడం 022(69శాతం)తో పోలిస్తే ఈ ఏడాది నాలుగు శాతం పెరగడం గమనార్హం.
ఈ క్రమంలోనే జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ అందించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్‌లో 1970–2020 నుంచి 35వేలకుపైగా వన్యప్రాణుల జాతులు, 5,495 జాతుల ఉభయ చరాలు, పక్షులు, చేపలు, క్షీరదాలు, సరీసృపాలు అంతరించిపోయాయి. – సాక్షి, అమరావతి
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లోనే ఎక్కువ
రెండువేల చెట్లు, 800 జంతుజాతులకు నిలయమైన అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వేట కారణంగా పెద్ద పండ్లను తినే జంతువులను కోల్పోవడంతో, పెద్ద విత్తనాల వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. పగడపు దిబ్బల వంటి అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థల్లో కొన్నింటిని కోల్పోవడం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
సముద్ర జీవ వైవిధ్యం, తీర ప్రాంత రక్షణలకు పగడపు దిబ్బలు అవసరమని అభిప్రాయపడింది. గ్రీన్ ల్యాండ్, వెస్ట్ అంటార్కిటిక్‌లో మంచు పలకలు కరగడంతో పెద్ద ఎత్తున మీథేన్, కార్బన్ ఉద్గారాలు పెరిగేందుకు కారణమవుతోందని తెలిపింది.
భారత్‌లో రాబందులు
భారతదేశంలో మూడు రాబందు జాతులు అంతరించపోవడం నివేదిక ప్రమాదంగా భావిస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వైట్–రంప్డ్ వల్చర్ (తెల్ల రాబందు) 67శాతం, ఇండియన్ రాబందు 48శాతం, స్లెండర్–బిల్డ్ రాబందు (హిమాలయన్ రాబందు) 89 శాతం అంతరించినట్టు నివేదిక పేర్కొంది. వీటిని రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి పరిరక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తోంది. దేశంలో వన్యప్రాణులు అంతరించిపోతున్నా, కొన్ని ప్రాంతాల్లోని జీవజాతులను రక్షించడం, పునరుద్ధరించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు చురుగ్గా ఉన్నట్టు నివేదిక చెబుతోంది.
అడవి పులులకు నిలయంగా భారత్
భారత్ ప్రపంచ వ్యాప్తంగా అడవి పులుల అత్యధిక జనాభాకు నిలయంగా ఉంది. ఆల్–ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 అంచనా ప్రకారం 3,682 పులులు ఉన్నట్టు తే ల్చింది. అలాగే మొట్టమొదటి మంచు చిరుత జనాభా అంచనానూ ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 718 మంచు చిరుతలను గుర్తించింది.
ఆహార భద్రత ముప్పు
జీవవైవిధ్య నష్టం, వాతావరణ సవాళ్ల కారణంగా 73.5 కోట్ల మంది ప్రజలు ప్రతి రాత్రి ఆకలితో పడుకుంటున్నారు. 90 శాతానికి పైగా పంట రకాలు కనుమరుగయ్యాయి. కేవలం 10 పంటలు (బార్లీ, సరుగుడు, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వరి, జొన్న, సోయాబీన్, చెరకు, గోధుమలు, రాప్‌సీడ్) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 83శాతం ఆహారాన్ని అందిస్తున్నాయి.
మత్స్య సంపద నుంచి సంవత్సరానికి సుమారు 9 కోట్ల టన్నుల సీఫుడ్ అందుతోంది. ఇది 300 కోట్ల మందికి పైగా ప్రజలకు అవసరం. అయితే 37.7శాతం అధికంగా చేపలు పట్టడం వల్ల చేపల జనాభా క్షీణత, పగడపు దిబ్బలు దెబ్బతింటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 1970–2020 వరకు వివిధ దేశాల్లో అంతరించిన వన్యప్రాణులు, ఉభయచరాలు, పక్షులు, చేపలు, క్షీరదాల జాబితా..
» లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో95%
» ఆఫ్రికాలో 76%
» ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో60%
» యూరప్‌లో మధ్యస్తంగా మధ్య ఆసియాలో 35%
» ఉత్తర అమెరికాలో39%
Comments
Please login to add a commentAdd a comment