
పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను, మన సైన్యం చేపట్టిన చర్యల గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. భారత్- పాక్ కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం ఎక్స్ ద్వారా వెల్లడించారు. భారత్ తరపున విక్రమ్ మిస్రీ దీన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ప్రకటన చేశారు. ఆ మరుక్షణం నుంచే ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులను కూడా పరుష పదజాలంతో దూషిస్తూ పోస్ట్‌లు పెట్టారు. కుట్రదారు, దేశద్రోహి అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. మిస్రీ కుమార్తె పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ కొంత మంది పోస్ట్‌లు పెట్టారు.
మిస్రీ బాసటగా ఒవైసీ
విక్రమ్ మిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్‌ను ఖండిస్తూ పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు బాసటగా నిలిచారు. విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) ఖండించారు. ఆయన నిజాయితీపరుడైన మంచి అధికారి అని, దేశంలో కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారని, ప్రభుత్వ నిర్ణయాలకు అధికారులను నిందించడం తగదని హితవు చెప్పారు.
చర్యలు తీసుకోరా?
మిస్రీకి కేంద్ర సర్కారు బాసటగా నిలబడలేదని, ఆయన గౌరవాన్ని కాపాడటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav) నిందించారు. మిస్రీపై ట్రోలింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు బీజేపీ సర్కారు ఆసక్తి చూపించడం లేదని ఆరోపించారు. అధికారులు.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరే సంధానకర్తలు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత, అధికారులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేరని అఖిలేశ్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, సల్మాన్ అనీస్ సోజ్ కూడా మిస్రీపై ట్రోలింగ్‌ను ఖండించారు.
ట్రోలింగ్ సిగ్గుచేటు
విదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమ మీనన్ రావు కూడా మిస్రీకి అండగా నిలిచారు. మిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. అంకితభావం కలిగిన దౌత్యవేత్త అయిన మిస్రీ.. మన దేశానికి వృత్తి నైపుణ్యం, దృఢ సంకల్పంతో సేవ చేశారని ప్రశంసించారు. ఆయన దూషించడానికి ఎటువంటి కారణం లేదన్నారు. హద్దులు దాటి దూషణలకు పాల్పడటం సరికాదన్నారు. ద్వేషంతో విషపూరితంగా చేసే వ్యాఖ్యలు ఆగిపోవాలి. మన దౌత్యవేత్తలకు భరోసా కల్పించేందుకు వారికి మనమంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.
బాధ్యతారహిత చర్య
మిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో విషం కక్కడాన్ని జాతీయ మహిళా సంఘం (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. మిస్రీ కుమార్తెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంపై ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ విజయ రహత్కర్ ఫైర్ అయ్యారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే బాధ్యతారహిత చర్య అని పేర్కొన్నారు. ట్రోలింగ్ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతాను లాక్ చేశారు విక్రమ్ మిస్రీ. తన పోస్ట్‌లను ఎవరూ చూడకుండా నియంత్రణ విధించారు.
చదవండి: విక్రమ్ మిస్రీపై ట్రోల్స్.. కాంగ్రెస్ నేత శశి థరూర్ కౌంటర్