సాక్షి, అమరావతి: జీవిత చరమాంకంలో ఉన్న ఇద్దరు వృద్ధులు దాదాపు దశాబ్దం నుంచి చేస్తున్న న్యాయపోరాటం హైకోర్టును కదిలించింది. ఆ వృద్ధులకు సత్వర న్యాయం అందించాలని విజయవాడ కోర్టును ఆదేశించింది. ఈ వయసులోనైనా న్యాయ ఫలాలను ఆస్వాదించనివ్వాలని, అప్పుడే వారు ఆనందిస్తారని తెలిపింది. రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో రాయితీల మీద పాసులు ఇస్తే వృద్ధులను గౌరవించినట్లు కాదని, సత్వర విచారణ జరిపి వారి కేసులను పరిష్కరిస్తేనే వారిని గౌరవించినట్లని స్పష్టం చేసింది. దాదాపు పదేళ్లుగా ఎలాంటి సహేతుక కారణాలు లేకుండానే ఈ వృద్ధుల పిటిషన్ అపరిష్కృతంగా ఉందని, అందువల్ల వారి వ్యాజ్యాన్ని గరిష్టంగా రెండు నెలల్లో పరిష్కరించాలని విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం తీర్పు వెలువరించారు.
వారి అభ్యర్థనను సానుకూల దృక్పథంతో చూడాలి
ఓ ఇంటి విషయంలో కింది కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, దీని ప్రకారం తమకు రావాల్సిన ప్రయోజనాలను మదింపు చేసేందుకు వీలుగా అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరుతూ వెంకట హనుమంత కృష్ణమూర్తి (80), ఉదయ్ ప్రభాకర్ శర్మ (72) విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో 2011లో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం అలాగే పెండింగ్‌లో ఉండటంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌ను పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపి సోమవారం తీర్పు వెలువరించారు. ‘పిటిషనర్లు ఇద్దరూ వయోవృద్ధులు. కింది కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఫలాలను తాము బతికున్నప్పుడే ఆస్వాదిస్తామన్న ఆశతో హైకోర్టును ఆశ్రయించారు.
వీరి అభ్యర్థనను సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్’ పేరుతో పథకం తీసుకొచ్చింది. దీనికనుగుణంగా 65 ఏళ్లకు పైబడిన వారి కేసులను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలని న్యాయాధికారులను ఆదేశిస్తూ 1999, 2003, 2014ల్లో హైకోర్టు సర్క్యులర్లను జారీ చేసింది. అయినా వృద్ధుల కేసులు తగ్గడం లేదు. కొన్ని కోర్టులు ఏళ్ల తరబడి కేసులను వాయిదా వేస్తున్నాయి. ప్రస్తుత కేసు అందుకు ఉదాహరణ. పిటిషనర్లు 2002లో కింది కోర్టులో పిటిషన్ వేసి 2010లో సానుకూల తీర్పు పొందారు. ఆ తీర్పు ప్రకారం రావాల్సిన ప్రయోజనాల కోసం 2011లో విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ కోర్టు కేసును ఇప్పటికీ పెండింగ్‌లో ఉంచడం చట్ట నిబంధనలకు విరుద్ధం.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
హైకోర్టును కదిలించిన వృద్ధుల పోరాటం
Published Tue, Dec 8 2020 5:23 AM | Last Updated on Tue, Dec 8 2020 5:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment