rajeswari
-
Thodu Needa Founder Rajeswari: సీనియర్ సిటిజన్స్‌కు భరోసా ఏది?
దేశం నిశ్శబ్దంగా ఒక ముఖ్యమైన జనాభా మార్పుకు గురవుతోంది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశ జనాభాలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సంతానోత్పత్తి రేటు తగ్గడం, అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానాల వల్ల భారతదేశ జనాభాలో వృద్ధుల వాటా నిశ్శబ్దంగా పెరుగుతోంది. అయితే, దీనికి తగినట్టుగా వారి ఆర్థిక శక్తి పెరగడం లేదు. ఫలితంగా వృద్ధులు సొంత కుటుంబాల నుంచే ఈసడింపులకు, వేధింపులకూ గురవుతున్నారు. వృద్ధుల జీవితం భరోసాగా గడవడం ఎలా?! పాశ్చాత్య దేశాల మాదిరి కాకుండా భారతదేశంలోని 40 శాతం మంది వృద్ధులు అత్యంత పేదరికంలో ఉన్నారు. 60 నుంచి 80 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు ఆర్థిక, ఇతర అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడి ఉన్నారు. గ్రామీణ వృద్ధులు కుల, వర్గ ఆధారిత వివక్షకూ గురవుతున్నారు. గ్రామాల్లో పెను సవాల్! నగరాలలో ఉండే సీనియర్ సిటిజన్స్ జీవితాలతో పోల్చితే గ్రామాల్లో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వీరు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నారు. మన ఆరోగ్య విధానం సాధారణంగా మాతా, శిశు సంరక్షణపైనే ఉంటుంది. వృద్ధుల సంరక్షణకు అంతగా ్రపాధాన్యత ఇవ్వడం లేదు. గ్రామీణ వృద్ధులలో ప్రత్యేకించి మహిళలు ఆర్థిక, అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడుతున్నారు. మన దేశంలో వృద్ధుల సంరక్షణ ఎక్కువ భాగం వారి పిల్లలు చూసుకోవడం ఆనవాయితీ. అయితే, కాలంతో పాటు ఈ విధానాలూ వేగంగా మారుతున్నాయి. పిల్లల వలస.. పెరుగుతున్న ఒంటరితనం విద్య, ఉద్యోగాల కోసం పిల్లలు వలసలు వెళ్లడం, ఉమ్మడి కుటుంబం వ్యవస్థ విచ్చిన్నం కావడం, వృద్ధుల సంరక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది. నివేదికల ప్రకారం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 6 శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నారు. 20 శాతం మంది పిల్లలు లేకుండా వారి జీవిత భాగస్వామితో మాత్రమే జీవిస్తున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తక్కువ ఆదాయ కుటుంబాలలో వృద్ధుల ఆరోగ్య అవసరాలు ఆర్థికంగా భరించలేనంత భారంగా మారుతున్నాయి. భారతదేశంలో వృద్ధులపై వేధింపుల కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ నివేదిక ప్రకారం 25 శాతం మంది పెద్దలు తమ సొంత కుటుంబాల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. సామాజిక భద్రత హె ల్ప్ ఏజ్ ఇండియా సూచనల మేరకు.. ► దేశంలో వృద్ధుల కోసం అధికారిక సంస్థాగత సంరక్షణలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. పటిష్టమైన పెన్షన్, సామాజిక భద్రతా వ్యవస్థ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం ద్వారా వారి కుటుంబ సభ్యులపై వృద్ధులు ఆధారపడటం తగ్గించవచ్చు. ► దాదాపు 33 శాతం మంది వృద్ధ స్త్రీలకు ఎటువంటి ఆదాయం లేదు. 11 శాతం మందికి మాత్రమే పెన్షన్ ద్వారా ఆదాయం వస్తోంది. 16.3 శాతం మంది సామాజిక పెన్షన్ పొందుతున్నారు. సీనియర్ కేర్ సంస్కరణలపై ఇటీవల ‘నీతి అయోగ్’ సమర్పించిన ఓ నివేదిక ప్రకారం వృద్ధుల ఆర్థిక సాధికారతను నిర్ధారించడానికి ప్రభుత్వ నిధుల కవరేజీని పెంచడం, తిరిగి పని నైపుణ్యాలవైపు మళ్లించడం, తప్పనిసరి ΄÷దుపు ప్రణాళికలు, రివర్స్ మార్టిగేజ్ మెకానిజమ్స్, పన్ను, జీఎస్టీ సంస్కరణల వంటి అనేక చర్యలు చేపట్టాలని పేర్కొంది. ► ఎటువంటి ఆస్తులు, ఆదాయం లేకుండా ఉన్నవారి అవసరాలకు అనుగుణంగా సంపూర్ణ వృద్ధాప్య సంరక్షణ నమూనాను అభివృద్ధి చేయాల్సి ఉంటుందనేది మరో సూచన. నలుగురు కలిసి ఉంటే ఎంతో మేలు.. వృద్ధులైనా డబ్బున్నవారి పరిస్థితి బాగానే ఉంది. డబ్బులేని వారే జీవశ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు. ► వృద్ధులకు ఓల్డేజీ హోమ్స్ తప్ప మరో మార్గం లేదు. ఫుడ్ షెల్టర్ ఈ రెండే ఇస్తుంది. కానీ, ఎమోషనల్‌గా ఒంటరితనం ఫీలవుతుంటారు. అందుకే, రీ మ్యారేజ్ ద్వారా మేం ఒక సొల్యూషన్ చూపిస్తున్నాం. లేదంటే, ఒంటరిగా ఉన్న వృద్ధులు ప్రమాదాలకు, దోపిడీలకు గురవుతున్నారు. ఇలాంటప్పుడు నలుగురు వృద్ధులు కలిసి ఒక చోట ఉండవచ్చు. దీని వల్ల ఒంటరితనం పోగొట్టుకోగలుగుతారు. ► అప్పడాలు, వడియాలు వంటివి చేసి, వ్యాపారం చేసుకోవచ్చు. కానీ, 70 ఏళ్ల వయసులో ఏ పనీ చేయడానికి ఓపిక ఉండదు. పెట్టింది తినడం తప్ప ఏ రకమైన ఫిజికల్ స్ట్రెయిన్ పడలేరు. అందుకని, రూమ్మెట్స్ లాగా కలిసి ఉండాలి. అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇండోర్‌గేమ్స్, స్థానిక పర్యాటక స్థలాలు చూసి రావచ్చు. ► యువత పట్టించుకోదు, మధ్య వయసువారికి కుటుంబ సమస్యలు. సీనియర్ సిటిజన్స్ పట్ల ఎవరికీ జాలి, దయ ఉండదు. వృద్ధులకు ఇచ్చే ఆత్మీయ స్పర్శను ఎంతో ఓదార్పుగా ఫీలవుతారు. ► రాజకీయ వర్గం తరచుగా యువ జనాభాను ఆర్థిక ఆస్తిగా పేర్కొంటుంది. పెరుగుతున్న వృద్ధ జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, సామాజిక మద్దతును అందించడానికి అంతగా ఆసక్తి చూపదు. ఏ రకమైన ఆదాయం లేనివారికి ప్రభుత్వమే వారికో దారి చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పెన్షన్ రూపేణ వచ్చే వనరుతోనూ నలుగురు కలిసి ఉండవచ్చు. – ఎన్.ఎమ్.రాజేశ్వరి, తోడు నీడ స్వచ్ఛంధ సంస్థ, హైదరాబాద్ -
కువెంపు కోడలు రాజేశ్వరి కన్నుమూత
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): జాతీయ కవి కువెంపు కోడలు, కవి కే.పీ.పూర్ణచంద్ర తేజస్వి సతీమణి రాజేశ్వరి (84) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు దేహాన్ని ఓ ఆస్పత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: డిజిటల్ కరెన్సీకి తుది మెరుగులు!.. సెబీకి అప్పగిస్తే ఏం చేద్దాం? -
రాజేశ్వరి భర్త, అత్తపై కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం : అదనపు కట్నం కోసం ఆరు నెలల గర్భిణి అయిన గిరిజాల రాజేశ్వరి(23)పై అమానుషంగా దాడి చేసిన ఆమె భర్త దామోదర్, అత్త లలితలపై ఏయిర్పోర్ట్ జోన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివిధ సెక్షన్లకింద కేసు నమోదు చేసి వారిని కస్టడీలోకి తీసుకున్నారు. అనాద అయిన రాజేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దామోదర్.. కొద్దిరోజులకే ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ తల్లి లలితతో చిత్రహింసలలకు గురిచేశారు. వారు పెట్టే హింసను తట్టుకోలేక రాజేశ్వరి బయటకు వచ్చి ఒంటరిగా ఉంటోంది. చదవండి : అభాగ్యురాలిపై కట్న పిశాచి పంజా కలర్స్ సంస్థలో పనిచేస్తూ బతుకుతున్న రాజేశ్వరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన దామోదర్ ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంటి నుంచి బటయకు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతోపాటు దామోదర్ విపరీతంగా కారులోనే కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతుంది. అన్ని పరీక్షలు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. -
నా భర్తకు ప్రాణహాని
కర్నూలు: తన భర్త అనంతరెడ్డికి అధికార పార్టీకి చెందిన వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం మల్లెపల్లెకు చెందిన అనంతరెడ్డి సతీమణి రాజేశ్వరి ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆమె వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డితో కలసి ప్రజాదర్బార్‌లో ఎస్పీని కలసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తమ కుటుంబానికి శత్రువులెవరూ లేరని, అలాంటప్పుడు బాంబులు దాచుకోవాల్సిన అవసరం ఏముంటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ నేతలు తన భర్తను టార్గెట్ చేసి.. బాంబుల కేసులో ఇరికించారని ఆమె ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు తన భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నారని, ఈ విషయంలో స్థానిక పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆమె కోరారు. కుటుంబ సభ్యులమంతా కలసి ఈ నెల 19న అవుకు మండలం చెన్నంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లామని, గ్రామంలో లేనిసమయంలో అధికార పార్టీ నాయకులు తమ కల్లందొడ్డిలో బాంబులు పెట్టించి పోలీసులకు సమాచారమిచ్చి అక్రమంగా కేసులో ఇరికించారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన బోయ కుక్కల అయ్యస్వామి తమ కల్లందొడ్డి పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు అనుమానాస్పదంగా సంచరించాడని, ఆ తర్వాతే పోలీసులు కల్లందొడ్డిలోని గడ్డివాములో బాంబులు దొరికాయంటూ తన భర్తపై కేసు నమోదు చేశారని వివరించారు. మల్లెపల్లె మాజీ సర్పంచ్ బోయ జయరాముడుకు, బోయ అయ్యస్వామికి పొలం తగాదాలు ఉండేవని, జయరాముడు తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండటం చూసి ఓర్వలేక అతనే గడ్డివాములో బాంబులు పెట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీవి కుట్ర రాజకీయాలు : బి.వై.రామయ్య టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య విమర్శించారు. ఎస్పీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలకు రక్షణ కరువైందన్నారు. గడ్డివాములు, కల్లెందొడ్లకు కూడా కాపలా పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం ఈ ప్రభుత్వ హయాంలో ఏర్పడిందన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, లేదంటే మట్టుబెట్టడం టీడీపీ నేతలకు ఆనవాయితీగా మారిందన్నారు. మల్లెపల్లె అనంతరెడ్డిపై కేసులు నమోదు చేయడం కుట్రలో భాగమేనన్నారు. టీడీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది : కంగాటి శ్రీదేవి పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనలేక అధికార టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి విమర్శించారు. గతంలో తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక హత్య చేశారన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు కుట్రపూరితంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. అక్రమ కేసులు బనాయించి పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్పీని కలసిన వారిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దయ్య, నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రహిమాన్, దేవపూజ ధనుంజయ ఆచారి తదితరులు ఉన్నారు. -
ప్రాణాలకు తెగించి విద్యార్థులను కాపాడిన టీచర్
తూర్పుగోదావరి ,భీమక్రోసుపాలెం (రామచంద్రపురం): రామచంద్రపురం మండలం అన్నాయిపేటలోని లక్ష్మీ శర్వాణీ హైస్కూల్ బస్సు శుక్రవారం విద్యుదాఘాతానికి గురై కాలిపోయింది. ప్రమాద సమయంలో 15 మంది ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్కూలు బస్సు ఎప్పటిలాగానే ఉదయం సుమారు 7 గంటలకు కాజులూరు మండలం అండ్రంగిలోను, కె.గంగవరం మండలం అద్దంపల్లి, వట్రపూడి గ్రామాల్లోను విద్యార్థులను ఎక్కించుకుని భీమక్రోసుపాలెం గ్రామానికి చేరుకుంది. భీమక్రోసుపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మలుపు తీసుకుని గ్రామంలోని మరో 20 మంది విద్యార్థులను ఎక్కించుకోవలసి ఉండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల రోడ్డు పక్కన గల విద్యుత్ స్తంభానికి అమర్చిన సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను రాసుకుంటూ వెళ్లింది. దీనితో షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్దగా శబ్దాలు, మెరుపులు రావడంతో బస్సులో ఉన్న టీచర్ విశ్వనాథం రాజేశ్వరి అప్రమత్తమై మరో టీచర్ శలా మోహన సత్యలక్ష్మి సహకారంతో సెకన్ల వ్యవధిలో విద్యార్థులను బస్సు నుంచి దించేశారు. విద్యార్థులలో ఆ టీచర్ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆ తరువాత బస్సును మళ్లీ వెనక్కి తీయాలని డ్రైవర్ ప్రయత్నించగా మరింతగా శబ్దాలతో మంటలు చెలరేగాయి. దీనితో బస్సులో సీట్లు, విద్యార్థుల పుస్తకాలు, వారు తెచ్చుకున్న భోజనం క్యారేజ్‌లతో సహా కాలిబూడిదయ్యాయి. స్థానికులు కూడా సకాలంలో స్పందించి విద్యుత్ సరఫరా నిలుపుదల చేసి బకెట్లతో నీరు వేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్క విద్యార్థికి చిన్న గాయం కూడా కాకుండా కాపాడిన టీచర్ రాజేశ్వరిని అందరూ అభినందించారు. ఫైర్ ఇన్స్పెక్టర్ ఎన్.నాగేంద్రప్రసాద్ తన సిబ్బందితో వచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద బాధితులు లేరని, సుమారు రూ.5 లక్షలు నష్టం ఉంటుందని ఫైర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. రామచంద్రపురం సీఐ కొమ్ము శ్రీధర్‌కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కొత్త డ్రైవర్ కావడంతోనే ప్రమాదం ఈ బస్సు డ్రైవర్ పిల్లి విజయకుమార్ తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి ఆసుపత్రికి వెళతానని సెలవు పెట్టడంతో కొత్త డ్రైవర్ బస్సు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు అంటున్నారు. విజయకుమార్ ఎప్పుడూ ఎంతో మెళకువగా బస్సు మలుపు తిప్పేవాడని, కొత్త డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును నడిపి విద్యుత్ స్తంభంపై సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను రాసుకుంటూ వెళ్లడం వల్లనే ప్రమాదం సంభవించిందని అంటున్నారు. కాగా ద్రాక్షారామ పోలీసులురెగ్యులర్ డ్రైవర్ పిల్లి విజయకుమార్‌ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. -
రేమా ధీమా
ఏ మనిషికైనా... తాను ఒక పని చేస్తున్నప్పుడు... అది ఇతరుల శ్రేయస్సు కోసమైతే ఒక ధీమా ఉంటుంది. అదే పని... తన సొంతానికైనప్పుడు తెలియని న్యూనత ఉంటుంది. రేమా చేస్తున్న పనులు సమాజహితం కోసం... అందుకే రేమా ఏ పనినైనా ఎంతో ధీమాగా చేయగలుగుతోంది. రేమా రాజేశ్వరి ఎస్.పి.గా నేరాల దర్యాప్తు, వాటి పరిష్కారంతో సరిపెట్టుకోవడం లేదు, సమస్య మూలాలను తెగ నరుకుతోంది. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది, నిజమే. గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలనేది గొప్ప ఆలోచన. ఎంపీలంతా ఒక్కో గ్రామాన్ని తీసుకున్నారు. వాటి తీరు ఎలా ఉందనే నివేదిక ఇవ్వమంటే వెనకడుగు వేస్తారు. పోలీస్ దత్తత తీసుకున్న ఈ గ్రామం మాత్రం ధైర్యంగా ఛాతీ విరుచుకుని మరీ చూపించుకోగలిగినట్లు మారిపోయింది. ఇది పోలీస్ దత్తత గ్రామం అని గ్రామస్థులు గర్వంగా చెప్పుకుంటున్నారు. మా బడి పోలీస్ బడి అని చెప్పేటప్పుడు ఆ పిల్లల ముఖాలు వెలిగిపోతాయి. పెద్దయ్యాక పోలీస్ అవుతాం అంటారు ‘చోటా భీమ్’ను అనుకరిస్తూ. ఇది మహబూబ్ నగర్ జిల్లా, అడ్డాకుల గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్. కార్పొరేట్ స్కూల్‌ని తలపిస్తుంటుందా పాఠశాల. గోడలకు చోటాభీమ్, టామ్ అండ్ జెర్రీ వంటి కామిక్ స్టోరీల ఆయిల్ పెయింటింగ్స్, స్కూల్లో టాయిలెట్లు, వాటర్ సప్లయ్, కరెంట్, కంప్యూటర్ ఉన్నాయి. పోలీస్ బృందం టేకప్ చేసేనాటికి రాలిపోతున్న కప్పు, పెచ్చులూడిన గోడలతో ఉండేది. రిపేర్లు చేసి, రంగులు వేసి, ఫ్లోరింగ్ మార్చేసి, కొత్త గదులు కట్టించి మోడరన్ లుక్ తెచ్చేశారు. ఇదంతా ఎవరు చేశారంటే పిల్లల చూపులన్నీ అక్కడే ఫొటోలో ఉన్న ఎస్.పి. రేమా రాజేశ్వరి వైపు మరులుతాయి. అదేమాట ఆమెను అడిగితే... ‘క్రెడిట్ మొత్తం మా టీమ్‌లోని సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కానిస్టేబుల్ బాలరాజులదే’ అన్నారు నవ్వేస్తూ. అమ్మమ్మ చెప్పిన కథలు... తాను చూసిన వాస్తవాలు! రేమా రాజేశ్వరి పుట్టింది కేరళ రాష్ట్రం మున్నార్ జిల్లా ఇడుక్కిలో. పశ్చిమ కనుమల్లో విస్తరించిన టీ తోటల్లో ఆమె బాల్యం పచ్చదనం మధ్య అచ్చమైన స్వచ్ఛదనంతో గడిచింది. తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో, తల్లి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ల ఉద్యోగాలతో వాళ్లు బిజీగా ఉంటే రేమాను పెంచడంలో అమ్మమ్మ పార్వతి రోల్ కీలకమైంది. వేళకింత అన్నం పెట్టి, స్నానం చేయించి స్కూలుకి పంపి ఊరుకోలేదామె. రేమాలో భవిష్యత్తు మీద ఒక గురిని ఏర్పరిచింది. ఆమె చూసిన బ్రిటిష్ పాలకులను కథలుగా చెప్పేది. కలెక్టర్ వేసవిలో మున్నార్‌కు వచ్చినప్పుడు సిబ్బంది చేసే హడావిడిని కళ్లకు కట్టేది. ‘నువ్వు కలెక్టర్ అవ్వాలి’ అని పదే పదే చెప్పేది. అమ్మమ్మ చెప్పింది సరే... ఆ గమ్యాన్ని చేరాలనే తపన పిల్లల్లో ఉంటేనే సాధ్యమవుతుందన్నప్పుడు ఆమె... ‘‘కేరళలో పిల్లలకు చదువుకోమని ఒకరు చెప్పాల్సిన పని ఉండదు. చదవడం తమ బాధ్యత అన్నట్లు ఉంటారు. స్కూలు పూర్తయ్యేలోపే ఏ కాలేజ్‌లో ఏకోర్సులో చేరాలనే ఆలోచనలతో ఉంటారు. పేరెంట్స్ వాళ్లను కొద్దిగా గైడ్ చేస్తే చాలు. నేను స్కూల్ కోసం రోజూ పదిహేను కిలోమీటర్ల దూరం నడిచేదాన్ని. గ్రాడ్యుయేషన్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ పోలీస్ మేనేజ్మెంట్లో పీజీతోపాటు సివిల్స్‌కి ప్రిపేరయ్యాను. ఐఏఎస్ రాలేదు. ఐపీఎస్ వచ్చింది. అమ్మమ్మ చెప్పిన కథలు ఒక కారణం అయితే, నేను చిన్నప్పటి నుంచి చూసిన సమాజంలో మహిళలకు, పిల్లలకు, కామన్ మ్యాన్‌కు ఎదురయ్యే సమస్యలను తీర్చే అవకాశం ఐఏఎస్ అయితేనే∙సాధ్యం అనే నమ్మకం నాది. అందుకే మళ్లీ ప్రయత్నిద్దాం అనుకున్నాను. కానీ ఇంట్లో వద్దన్నారు. దాంతో ఐపీఎస్‌లో చేరిపోయాను. ఇడుక్కి నుంచి ఐపీఎస్ అయిన తొలి మహిళను నేనే’’ అన్నారు. ఆపరేషన్ స్మైల్! రేమా రాజేశ్వరి 2009 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. హైదరాబాద్‌లో ట్రైనింగ్. రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పని చేశారు. ఇప్పుడు జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌గా మొదలైన ఆమె కెరీర్ తెలంగాణ క్యాడర్లో కొనసాగుతోంది. కృష్ణా పుష్కరాల నిర్వహణలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టారు రేమా. సైబరాబాద్ డి.సి.పిగా ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడానికి షీ టీమ్‌లో పని చేశారీ బ్రేవ్ సూపర్ కాప్. రంగారెడ్డి జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ప్రోగ్రామ్‌లో వలస వచ్చిన బాల కార్మికులను బడిబాట పట్టించారు. ‘సేవింగ్ చైల్డ్ బ్రైడ్’ క్యాంపెయిన్ చేపట్టి నాలుగు వందల మంది అమ్మాయిలను బాల్య వివాహాల నుంచి విముక్తి కలిగించారు. వాళ్ల పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇచ్చి ఆ అమ్మాయిలను మళ్లీ బడిలో చేర్పించారు. సీనియర్ సిటిజెన్ సర్వీసులు! ఎస్పీగా ఆమె శాంతి భద్రతల నిర్వహణ, ప్రమాదాల నిర్వహణ, నేరాల దర్యాప్తుకు పరిమితం కావడం లేదు. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. వాటి మూలాలను నిర్మూలించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని నమ్మారామె. ఫ్యామిలీ రిలేషన్ ప్రోగ్రామ్ పెట్టారు. టీచర్లు, ఇతర ఉద్యోగాలలో రిటైర్ అయిన సీనియర్ సిటిజెన్‌ను ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వాములను చేశారు. పోలీసులు ప్రతి కాలనీకి వెళ్లి ప్రమాదాల మీద అవేర్నెస్ తీసుకురావడం అయ్యే పని కాదు. అందుకే పట్టణంలోని సీనియర్ సిటిజెన్‌ని సమీకరించి వారి చేత కాలనీ వాసులకు చెప్పించేవారు. ఇది మంచి ఫలితాలనిచ్చింది. వేగం తాత్కాలికంగా ఆనందాన్నిస్తుందేమో కానీ ప్రమాదం జరిగితే కుటుంబం తల్లకిందులవుతుందని పెద్దవాళ్లు చెప్తుంటే విన్నవాళ్లలో పరివర్తన రాక మానుతుందా? అదే ఆమె టచ్ చేసిన పాయింట్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! పోలీస్ యూనిఫామ్ కనిపిస్తేనే ఆమడదూరం పారిపోతారు గ్రామాల్లో. చిన్న సమాచారం సేకరించాలన్నా తలకు మించిన పని అవుతుంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా పోలీస్ దగ్గరకు రావడానికి భయపడుతుంటారు. అలాంటిది రేమా గ్రామస్తుల్లో ఒకరిగా కలిసిపోయారు. వారితోపాటు బతుకమ్మను మోశారు, పాట పాడుతూ ఆట ఆడారు. గ్రామీణ మహిళల్లో తమ కష్టాన్ని తీర్చడానికి ఒక ఆలంబన ఉందనే భరోసా కలిగించారు. జోగినులకు కొత్త జీవితాన్నివ్వడం, దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేయడం, పిల్లలకు, మహిళలకు ఎదురయ్యే సమస్యల మూల కారణాల మీద కొరడా ఝళిపించడం వంటివన్నీ తొలి దశాబ్దంలోనే సొంతం చేసుకున్నారు. ఇందుకు ఆమె విస్తృతంగా సాహిత్యాన్ని చదవడమూ ఒక కారణమే. తమిళ, మలయాళ, తెలుగు, పంజాబీ, ఇంగ్లిష్, హిందీ భాషలు మాట్లాడతారామె. ఏ భాష సాహిత్యమైనా సరే ఆ కథల్లో ఇతివృత్తం కానీ, ప్రధాన సమస్యలు, సంఘటనలు అన్నీ పిల్లలు, స్త్రీల చుట్టూనే ఉండేవి. ఏ సమాజమైనా బాధితులు స్త్రీలు, పిల్లలే అని అర్థమైంది. అందుకే ఆమె డిజైన్ చేసిన ప్రోగ్రామ్లన్నీ మహిళలు, కుటుంబాల శ్రేయస్సు కోరుతూ ఉంటాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను భుజానికెత్తుకుని గురి తప్పని షూటర్లా వాటిని లక్ష్యాలకు చేరుస్తుంది. ఐపీఎస్ అయినప్పటికీ నా దృష్టి ఎప్పుడూ సామాజికాంశాల మీదనే లగ్నమవు తుంటుంది. సివిల్ సర్వెంట్‌గా సోషల్ ఇష్యూస్‌ని పరిష్కరించే దారులనే వెతుకు తుంటాయి నా కళ్లు. నాకు నచ్చిన దృశ్యాన్ని కెమెరాలో క్యాప్చర్ చేయడం, నా దృష్టికి వచ్చిన విషయాన్ని రాయడం నాకు ఇష్టమైన వ్యాపకాలు. వీలు చేసుకుని మరీ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వ్యాసాలు రాస్తుంటాను. ఇక నాకు ఇప్పటికీ మిగిలిపోయిన కోరిక హార్వర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయాలనేది. నా పిల్లలతో మాట్లాడించండి! అది వేసవి కాలం, సోమవారం, గ్రీవెన్సెస్డే. ఓ ముప్పై ఏళ్ల మహిళ దైన్య స్థితిలో వచ్చింది. గట్టిగా గాలి వీస్తే పడిపోతుందేమో అన్నంత బలహీనంగా ఉంది. ఆమె తన కష్టం చెప్పుకోవడానికి ముందు గతాన్ని చెప్పింది. ఆమె 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్లు స్కూలుకు వచ్చారు, ఆమెను స్కూలు నుంచి నేరుగా కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. మేనమామతో పెళ్లి అని అప్పుడు తెలిసింది. మేనమామ తనకంటే పన్నెండేళ్లు పెద్దవాడు, అంతేకాదు అతడికి అప్పటికే పెళ్లయింది. అయినా తనతో మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. తన అమ్మానాన్నలే ఆ పెళ్లి చేస్తున్నారు. ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండానే పెళ్లి చేసేశారు. పెళ్లి కాగానే భర్త ఆమెను మహబూబ్‌నగర్ జిల్లాలోనే తాను ఉద్యోగం చేసే టౌన్‌కు తీసుకెళ్లాడు. తొలి భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఆమెకి పిల్లలు లేనందువల్ల ఈమెను పెళ్లి చేసుకున్నాడు. కేవలం పిల్లలకోసమే. పిల్లలను కనడమే ఆమె చేయాల్సిన పని అన్నట్లే వ్యవహరించాడా భర్త. చీకట్లో భర్త దేహానికి తగలడం తప్ప అతడితో ఇంకే బాంధవ్యమూ పెరగలేదామెకు. పెంచుకోవడం అతడికీ ఇష్టం లేదు. ముగ్గురు పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి ఆమెను పూర్తిగా వంటగదికి పరిమితం చేశారు. చివరికి ఆమె పిల్లలను కూడా ఆమెకు చూపించకుండా కట్టడి చేశారు. ఆ పరిస్థితిలో ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ‘నా పిల్లలతో ఒక్కసారి మాట్లాడించండి’ అని కళ్లనీళ్లు పెట్టుకుంది. ఆమె భర్త, అతడి మొదటి భార్యను అదుపులోకి తీసుకుని ఆమె పిల్లలను దగ్గర చేయడంతోపాటు జీవితానికి భరోసా కల్పించారు రేమా. అప్పుడామెను ‘ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎందుకు కంప్లయింట్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న స్టేషన్‌ను వదిలిపెట్టి ఎస్పీ ఆఫీస్‌కు ఎందుకొచ్చావు?’ అని అడిగారు రేమా. అందుకామె చెప్పిన సమాధానం ఒక్కటే... ‘ఆడవాళ్లకైతేనే ఆడవాళ్ల కష్టం తెలుస్తుందని, ఇంకా మగ పోలీసుల నుంచి వచ్చే ప్రమాదాలుండవని’ చెప్పింది. ‘పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళల సంఖ్య పెరగాలని తాను ఇస్తున్న నివేదికకు ఇలాంటి సంఘటనలన్నీ కారణమే. అందుకే సెక్యూరిటీ ఫోర్సెస్‌లో కూడా జెండర్ ఈక్వాలిటీ ఉండా’లంటారు రేమా రాజేశ్వరి. పున్నమి వెన్నెల రేమా రాజేశ్వరి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పటికీ ఊటుకూరు గ్రామ ప్రాంతంలో జోగినీ వ్యవస్థ కొనసాగుతూనే ఉండేది. రూపుమాసిపోయిందనుకున్న దురాచారం కళ్ల ముందే కనిపిస్తుంటే దానిని నిర్మూలించి తీరాలని నిర్ణయించుకున్నారామె. ‘పున్నమి వెన్నెల’ ప్రోగ్రామ్‌తో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మొత్తం 36 మంది జోగినులకు కొత్త జీవితాన్నిచ్చారు. టైలరింగ్‌లో రెండు నెలలు ట్రైనింగ్ ఇప్పించి, వారందరికీ మెషీన్లు అందజేశారు. చిన్నప్పటి నుంచి చూసిన సంఘటనలు ఆమెకు సమాజంలో హానికి గురవుతున్నది మహిళలు, పిల్లలేనని చెప్తున్నాయి. తాము దోపిడీకి గురవుతున్నామని తెలుసుకోలేని అమాయకత్వం కూడా బలంగానే రాజ్యమేలుతోందనీ తెలుస్తోంది. దాంతో ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ గురించి పిల్లలను చైతన్యవంతం చేయడాన్ని కూడా చాలా ఇష్టంగా చేపట్టారామె. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రతి హైస్కూల్లోనూ ఈ ప్రోగ్రామ్ చేశారు. పాంప్లెట్లు, పోస్టర్లు వేశారు. షార్ట్ ఫిల్మ్‌లు చిత్రీకరించి స్కూళ్లలో ప్రదర్శించారు. అనేక స్కూళ్లకు ఆమె స్వయంగా వెళ్లి ఆడపిల్లలతో మాట్లాడారు. అసహజమైన స్పర్శను ఉపేక్షించరాదని, టీచర్లకు, అమ్మకు చెప్పి తీరాలని, ఆ ధైర్యాన్ని పెంచుకోవాలని చెప్పేవారామె. అడ్డాకులను నూరు శాతం టాయిలెట్లున్న గ్రామంగా తీర్చిదిద్దారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ముసలోళ్లకు పెళ్లేంటన్నారు..
అదే ఐదారేళ్ల క్రితం అరవై ఏళ్ల వయసులో ఓ మహిళ పెళ్లి చేసుకుంటోంది లేదా మరో వ్యక్తితో కలిసి ఉంటోంది.. అనే విషయం తెలిస్తే నగరం కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకునేవి. ‘ఈ వయసులో ఇదేం పని’.. అంటూ నలుగురి నోళ్లు తిట్టిపోసేవి. అయితే ఇప్పుడుపరిస్థితిలో మార్పు వచ్చింది. ఆశ్చర్యపోవడం తగ్గింది. ఎందుకంటే.. ప్రస్తుతం వృద్ధుల పెళ్లిళ్లు సిటీలో జరుగుతున్నాయి. దీనికి కారణం నిన్నటి దాకా ఒంటరిగా ఉన్న ‘రాజేశ్వరి’ కృషి. జీవితం మలిసంధ్యలో ఒంటిరి జీవితం ఎంత కష్టమో గుర్తెరిగిన ఆమె.. పెద్ద వయసు వారిని ఒక్కటి చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో: ‘ప్రస్తుతం మనిషి సగటు జీవిత కాలం పెరిగింది. ఇప్పుడు 60 దాటినా ఆరోగ్యంగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అనుకోకుండా హఠాత్తుగా జీవిత భాగస్వామి దూరమైతే మిగిలిన జీవితం అంతా ఒంటరిగా గడపాల్సిందేనా? విడాకులు లేదా ఇంకేదైనా కారణంతో తోడు లేకుండా మిగిలిపోతున్న వారికి తోడు కల్పించడం కోసమే మా ‘తోడు– నీడ’ కృషి చేస్తోంది’ అని చెప్పారు రాజేశ్వరి. పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాజేశ్వరి.. నగరంలో ఒంటరి వృద్ధులకు ‘తోడు’ వెతికిపెట్టే బాధ్యతలను కొన్నేళ్ల క్రితం స్వచ్ఛందంగా తలకెత్తుకున్నారు. అయితే తొలుత చాలా మంది ఆమెను వారించారు. ముసలోళ్లేమిటి? వారికి నువ్వు పెళ్లి చేయడం ఏమిటంటూ ఎగతాళి చేశారు. అయితే రాజేశ్వరి మాత్రం పట్టు వదల్లేదు. ‘వయసు మళ్లిన వారికే తోడు కావాలి. కాని దురదృష్టవశాత్తూ ఒంటరితనం ప్రాప్తించే అవకాశాలూ పెద్ద వయసులోనే ఎక్కువ’ అంటారామె. వృద్ధుల కోసం పెళ్లి చూపులు, గెట్ టు గెదర్ వంటి ఈవెంట్లు, వారికి నాణ్యమైన జీవనాన్ని అందించే కమ్యూనిటీ సెంటర్లు, వృద్ధుల కోసం పిక్నిక్లు నిర్వహిస్తూ.. సిటీలోని సీనియర్ సిటిజన్స్‌కు పలు విధాలుగా ఆసరా అందిస్తున్నారు. ‘వృద్ధాశ్రమాలు శేష జీవితం గడిపేందుకు ఎంచుకుంటాం. మనకు నచ్చింది తినడానికో, నచ్చినట్టు ఉండడానికో అక్కడ వీలుండదు. కమ్యూనిటీ లివింగ్ ప్లేస్‌ల ద్వారా అలాంటి కొరత తీరుతుంద’ని చెప్పారు రాజేశ్వరి. లివింగ్ టు గేదర్.. ‘వృద్ధాప్యంలోనే ఒంటరి తనపు సమస్య ఎక్కువ. రెక్కలొచ్చాక పిల్లలు వెళ్లిపోయి, జీవిత భాగస్వామి సైతం దూరమైతే.. ఏకాకిగా రోజులు వెళ్లబెట్టడం కన్నా నరకం మరొకటి లేదు’ అంటారామె. పెళ్లి కావచ్చు లేదా సహజీవనం కావచ్చు.. ఇద్దరు వృద్ధులు ఇష్టపడి కలిసి జీవించాలి అనుకుంటే వారికి తోడు నీడ అండగా ఉంటుంది. వృద్ధుల ఒంటరి తనపు సమస్యను పరిష్కరించే క్రమంలో సంస్థ ప్రారంభించిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దాదాపు 50కి పైగా ఒంటరి జీవితాలను జంటగా మలచామంటూ ఆనందంగా చెబుతారామె. అయితే ఈ క్రమంలో రాజేశ్వరి ఎదుర్కున్న ఒడిదొడుకులు అన్నీ ఇన్నీ కావు. ‘పెద్దవాళ్లు పిల్లల పెళ్లిళ్లు తమ ఇష్ట్రపకారం జరగాలని ఆశిస్తారని, అలా జరగకపోతే వారిని అదుపు చేయాలని నానా విధాలుగా ప్రయత్నిస్తారని మనకు తెలుసు. కాని తమ ఒంటరి తల్లి/ లేదా తండ్రి మలి వయసులో ఓ తోడు కోసం ఆరాటపడడాన్ని జీర్ణించుకోలేని పిల్లల సంఖ్యాఎక్కువే. నిజానికి ప్రేమించుకున్న పిల్లల పెళ్లి్లకన్నా.. పెద్దల పెళ్లికే అడ్డంకులు ఎక్కువ’ అంటారామె. పిల్లలు ఏదైనా హాలిడే ట్రిప్‌కు వెళుతుంటే తమను తీసుకువెళితే బాగుణ్నని వృద్ధులు అనుకుంటారు. ఈ పరిస్థితుల్లో తమంతట తామే సహ వయోజనులతో ట్రిప్స్‌కు ప్లాన్ చేసుకునేందుకు ఈ సంస్థ అండగా ఉంటోంది. ప్రతి మూడు నెలలకూ ఏదో ప్రాంతానికి టూర్స్ నిర్వహిస్తోంది. యువతకు మాత్రమే పరిమితం అని భావించే న్యూ ఇయర్ పార్టీల నుంచి వాలంటైన్స్‌డే వరకూ ఇందులో సభ్యులైన పెద్దలు సంబరంగా జరుపుకుంటున్నారు. ‘వృద్ధాప్యం అంటే కృష్ణా రామా అనుకుంటూ గడిపే దశ కాదు. దానికీ కలలూ కోరికలూ సరదాలూ అవసరమే. తమలాంటి పరిస్థితిలోనే ఉన్న మరికొందరితో కలిసి అవి నెరవేర్చుకునే చక్కటి వేదికే ఇది’ అంటున్న రాజేశ్వరి.. ఒంటరి వృద్ధులకు సంబంధించి ఆధునిక కాలంలోనూ పిల్లలు చాలా స్వార్ధంగా, సంకుచితంగా ఆలోచిస్తున్నారని, వారికి ఏ సరదా, ముచ్చటా అవసరం లేదని భావిస్తున్నారంటారు. వారి మలి జీవితం నిస్సారంగా గడచిపోయేందుకు తెలిసో తెలియకో దోహదం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. వీలైనంత వరకూ ఈ పరిస్థితిని మార్చడమే తన లక్ష్యం అంటున్నారు. -
బెట్టింగ్ భూతానికి దంపతులు బలి
♦ భర్త భాధ చూసి భార్య, భార్య లేదని ♦ తెలిసి భర్త బలవన్మరణం ♦ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఆత్మహత్యలు బెట్టింగ్ భూతం రెండు ప్రాణాల్ని బలి కోరింది. చిన్నపాటి ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటున్న యువకుడు బెట్టింగ్‌లో దిగి సర్వం కోల్పోయి అప్పుల పాలయ్యాడు. ఆర్థికభారం చూసి భార్య కలత చెంది బలవన్మరణానికి పాల్పడింది. భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారిద్దరి ఏకైక కుమార్తెకు మాత్రం తల్లిదండ్రుల ఎడబాటు జీవితకాలం శిక్ష విధించింది. పట్నంబజారు(గుంటూరు) : నగరంలోని వసంతరాయపురంలో నివాసం ఉంటున్న నరసరావుపేటకు చెందిన పోక శ్రీకాంత్ (28)కి మూడు సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నకూరుకు చెందిన రాజేశ్వరి (25)తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె(రాశీ). ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా, జ్యూస్ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే.. ఉన్నట్టుండి శ్రీకాంత్‌కు క్రికెట్ బెట్టింగ్‌ల వైపు ఆకర్షితుడయ్యాడు. రూ.20 లక్షల వరకూ అప్పులు చేశాడు. వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఆర్థిక భారాన్ని మోస్తూ ఉండటం చూసి భార్య కలత చెందింది. ఇటీవల వడ్డీ వ్యాపారులు ఒత్తిడి పెట్టడంతో శ్రీకాంత్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ పరిస్థితి చూసి మనస్తాపానికి గురైన రాజేశ్వరి మంగళవారం పురుగులమందు తాగింది. అపస్మాక స్థితిలో ఉన్న భార్యను చూసిన శ్రీకాంత్ ఆమెను ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మార్చురీలో భార్య శవం ఉండగానే బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన శ్రీకాంత్ తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రెండేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. ఇద్దరి మరణం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. -
బాధితులకు అండగా ఉంటా
ఎమ్యెల్యే వంతల రాజేశ్వరి మారేడుమిల్లి (రంపచోడవరం) : మండలంలోని చావడికోట పంచాయతీ సిరిపెనలోవ గ్రామంలో అగ్ని ప్రమాదం నలుగురు చిన్నారులను కోల్పోయిన గిరిజన కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హామీ ఇచ్చారు. చిన్నారును కోల్పోయిన బచ్చల లక్ష్మిరెడ్డి, పద్మ దంపతులను మంగళవారం ఆమె పరామర్శించారు. రెవెన్యూ శాఖ అందించిన రూ.5 వేల ఎక్స్‌గ్రేషియాతో పాటు, దుస్తులు, వంటసామగ్రి, బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యేతో పాటు ఇన్చార్జి సబ్ కలెక్టర్ హెచ్.వి.ప్రసాద్ బాబు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకే కుటుంబంలో నాలుగురు చిన్నారులు మృతి చెందడం దారుణమన్నారు. వారి మృతి తల్లిదండ్రులకు తీరనిలోటున్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావల్సిన అన్ని సహాయ సహకారాలు త్వరితగతిన అందించేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఐటీడీఏ అధికారులు ప్రకటించిన మేరకు మృతి చెందిన చిన్నారులు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున తక్షణం అందజేయలన్నారు. ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ కుండ్ల సీతామహాలక్ష్మి, తాహసీల్దార్ యూరఖాన్, వైఎస్సార్ సీపీ మండల కార్యదర్శి బి.గంగరాజు తదితరుల పాల్గొన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నగరంలో కళ్యాణదుర్గం రోడ్డుకు సమీపంలోని పాపంపేటలో నివాసమున్న పద్మక్క కుమార్తె రాజేశ్వరి నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గురువారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున కుటుంబసభ్యులు గమనించారు. కాగా టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. -
కుమారులతో సహా తల్లి అదృశ్యం
అనంతపురం సెంట్రల్ : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని యువజన కాలనీలో శ్రీనివాసులు, రాజేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. వీరికి లోకేష్(9), పృథ్వి(6) కుమారులు ఉన్నారు. బోరు లారీ ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. సోమవారం ఉదయం తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఇద్దరు కుమారులతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎన్నిచోట్ల వెతికినా ఆమె జాడ కనిపించకపోవడంతో బాధితురాలి తల్లి లక్ష్మీదేవి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నిర్వాసితుల సమస్యలు అసెంబ్లీలో చర్చిస్తా
ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నాలుగు మండలాల కార్యకర్తలతో సమావేశం కూనవరం : పోలవరం నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తానని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. నాలుగు మండలాల కార్యకర్తల సమావేశాన్ని శనివారం పెదార్కూరులో నిర్వహించారు. సర్పంచ్ పాయం మధు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోలవరం ముంపుతో సర్వం కోల్పోయి నిరాశ్రయులవుతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 18 నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు నష్టపరిహారం విషయంలో నిర్వాసితులను దగా చేస్తున్నారన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీ భూ నష్ట పరిహారం, పునరావాసం, భూమికి భూమి సేకరణ,18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ముందస్తుగా ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. జగన్Sమోహన్‌రెడ్డిని సీఎంని చేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పని చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం విలీన మండలాల్లో రెండో విడత గడపగడపకూ వైఎస్సార్ నిర్వహించాలన్నారు. అనంతరం మండల, బూత్ కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు. సర్పంచ్ పాయం మధు,మాజీ ఎంపీపీ పాయం వెంకయ్య, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఎస్కే కిస్మత్, వీఆర్‌పురం మండల కన్వీనర్ పొడియం గోపాల్, జిల్లా కార్యదర్శి ముత్యాల మురళి, యూత్ నాయకుడు చిక్కాల బాలు, కోటం జయరాజ్, కారం సత్తిబాబు, చింతూరు వైస్ ఎంపీపీ పండా నాగరాజు ఆసిఫ్, చిట్టిబాబు, బేతి ముత్తయ్య, చిలకం హరనాథ్, నరేంద్రకుమార్, కుంజా అప్పారావు, డి.సాయిరాజ్ పాల్గొన్నారు. -
నిర్వాసితులకు అండగా ఉంటాం
దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు అండగా ఉండి సమస్యలపై పోరాడతామని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణంతో కనుమరుగవుతున్న గండికోట గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు పలు సమస్యలను అనంతబాబు దృష్టికి తీసుకువచ్చారు. తమకు పూర్తిస్తాయి ప్యాకేజీ చెల్లించకుండా, ఎంతమొత్తం ఇస్తారో తెలియకుండా, నిర్వాసిత కాలనీలో వసతులు కల్పించకుండా తక్షణం గ్రామాన్ని ఖాళీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. అనంత బాబు మాట్లాడుతూ నిర్వాసిత గిరిజనులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించేంతవరకూ గ్రామాన్ని ఖాళీ చేయరాదని, ఖాళీచేసే తేదీని కటాఫ్ డేట్‌గా గుర్తించి 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ అమలు చేయాలని, గిరిజనుల నుంచి సారవంతమైన భూమి తీసుకుని ఇచ్చిన కొండరాళ్ల భూముల స్థానే మరో చోట భూములు సేకరించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే గిరిజనులు కోరుకున్న విధంగా కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. నిర్వాసితులకు పరిహారాలు చెల్లించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్న అధికారులు 2013 భూసేకరణ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని అన్నారు. ఎంపీపీ పండా జయలక్ష్మి, జెడ్పీటీసీ మట్ట రాణి రాంబాబు, పార్టీ నాయకులు కుంజం చెల్లన్నదొర, పోలిశెట్టి శివరామకృష్ణ, కట్టా సత్యనారాయణ, కందుల బాబ్జీ, గారపాటి మురళీకృష్ణ, తుర్రం జగదీష్, మట్ట రాంబాబు, సోదే వెంకన్నదొర, శిరసం పెద్దబ్బాయి దొర, తైలం వీరబాబు, కోమలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే రాజేశ్వరి దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణంతో కనుమరుగవుతున్న గండికోట గిరిజనులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించిన తర్వాతే గ్రామాన్ని ఖాళీచేయించాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మంగళవారం సాయత్రం ఆమె గండికోట గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించారు. తమ గ్రామంలో కనీసం గ్రామ సభ నిర్వహించకుండా, ఎంత ప్యాకేజీ చెల్లిస్తారో తెలియజేయకుండా , కొంత మొత్తం జమ చేసారని వాపోయారు. గ్రామంలో తల్లిదండ్రులు లేని ఆరుగురు యువతీ, యువకులను ప్యాకేజీకి అర్హతలేదంటున్నారని తెలపారు. గిరిజనులకు భూమికి భూమి పరిహారంగా ఇచ్చిన కొండలను పరిశీలించారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయమైన ప్యాకేజీ చెల్లించేంతవరకూ గ్రామాన్ని ఖాళీచేసేది లేదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతవరకూ నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. పార్టీ మండల కన్వీనర్ నండూరి గంగాధరరావు, ఎంపీటీసీ సభ్యురాలు పరదా శీతారత్నం, నండూరి సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక దాడులు సహించం
రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి రాజమహేంద్రవరం రూరల్ : జిల్లాలో గిరిజన విద్యార్థినులకు అన్యాయం చేస్తే సహించమని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హెచ్చరించారు. బొమ్మూరులోని గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఇటీవల పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపులపై ఆరా తీశారు. లైంగిక వేధింపులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టంచేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్లకు డోర్లు, బోల్టులను వేయించాలని విద్యార్థినులకు రక్షణ ఉండాలంటే ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. విద్యార్థినులకు పెట్టే అన్నంలో ఒడ్లు, పోపు లేని చారు, నూనె లేకుండా కూర చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బొబ్బర్లకు బదులు బిస్కట్లు పెట్టడమేమిటని అధికారులను ప్రశ్నించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తనకు ఫోన్ చేస్తే సమస్యను కలెక్టరు, ఐటీడీఏ పీడీ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. పాఠశాలకు వెంటనే ఏఎన్ఎంను నియమించాలని, వార్డెన్, హెచ్ఎం, వాచ్మెన్లు మహిళలే ఉండాలన్నారు.గిరిజన విద్యార్ధినుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వీరి సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. ఇప్పటికే గిరిజన విద్యార్థినుల సమస్యలపై శాసనసభలో ప్రస్తావించానని గుర్తు చేశారు. అనంతరం ఆమె గిరిజన శిక్షణా కేంద్రానికి కూడా పరిశీలించారు. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, రంపచోడవరం జెడ్పీఈసీ పత్తిగోళ్ల భారతి, వైస్ ఎంపీపీ స్వామిదొర, ఎంపీటీసీలు లింగారెడ్డి, కామరోడి పూజ, నండూరి గంగాధరరావు, బొల్లోజి కాంతం, హెచ్ఎం ఉదయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌కు మన్యజనం నీరాజనం
-దిగ్విజయంగా ఏజెన్సీ పర్యటన -ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి చింతూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఏజెన్సీలో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని, ఈ పర్యటనకు అపూర్వ జనస్పందన లభించిందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులు, రైతులు, కాళ్లవాపు బాధితుల కష్టాలను జగన్ స్వయంగా తెలుసుకున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారని చెప్పారు. పర్యటన ఆద్యంతం జగన్‌కు గిరిజనులు నీరాజనం పలికారని, వ్యవసాయ పనులున్నా పక్కనబెట్టి జననేతను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పర్యటనను విజయవంతం చేసేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహన్ని కలిగించిందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహించడంతో పాటు పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముత్యాల మురళి, చింతూరు మండల కన్వీనర్ ఎగుమంటి రామలింగారెడ్డి, యూత్ కన్వీనర్ తుర్రం తమ్మయ్య, రేవు బాలరాజు, చిక్కాల బాలు, రాజు భవాని ఎమ్మెల్యే వెంట ఉన్నారు. -
గిరిజనులను తరిమేయాలని కుట్ర
ఎమ్మెల్యే రాజేశ్వరి ఏజీ కొడేరు (చింతూరు): పోలవరం నిర్వాసితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, ఎంతోకొంత ముట్టజెప్పి ఈ ప్రాంతం నుంచి తరిమేయాలని చూస్తున్నాయని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. ఆమె చింతూరు మండలం ఏజీ కొడేరు, మల్లెతోట గ్రామాల్లో గిరిజనులను మంగళవారం కలుసుకుని జగన్ పర్యటన ఉద్దేశాలను వివరించారు. నిర్వాసితుల సమస్యలను స్వయంగా తెలుసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకే జగన్ విలీన మండలాల పర్యటనకు వస్తున్నారని, రేఖపల్లిలో గురువారం నిర్వహించే సభకు అధికసంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. వైస్ ఎంపీపీ పండా నాగరాజు, ఎంపీటీసీ సోడె బాయమ్మ, సర్పంచ్ ముచ్చిక కృష్ణకుమారి, మండల కన్వీనర్ రామలింగారెడ్డి, అంజాద్, సుధాకర్, నాగార్జున, సత్యన్నారాయణ పాల్గొన్నారు. వన విహారిలో రాత్రి బస మారేడుమిల్లి : ఏజెన్సీ పర్యటనకు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం రాత్రి వన విహారి ప్రాంగణంలో బస చేస్తారు. ఆ ఏర్పాట్లను జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదమ్భాస్కర్, పార్టీ మండల కన్వీనర్, జెట్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి బి.గంగరాజు, ఉపసర్పంచ్ గురుకు ధర్మరాజు మంగళవారం పరిశీలించారు. ఆయన భోజనానికి ప్రత్యేకమైన ఏజెన్సీ వంటకాలను, మారేడుమిల్లికి ప్రసిద్ధి వంటకుం బేంబూ చికెన్ రుచులను తయారు చేస్తున్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం
అడ్డతీగల : అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అధికారులపై ధ్వజమెత్తారు. రూ.పది లక్షల ఐఏపీ నిధులతో అడ్డతీగలలో నిర్మించిన గ్రంథాలయ భవనానికి జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు మంగళవారం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అధికారుల వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆహ్వాన పత్రికలో పేర్ల ముద్రింపులో నిబంధనలు పాటించలేదన్నారు. భవన ప్రారంభోత్సవ విషయంపై తమకు తగిన సమాచారం ఇవ్వలేదన్నారు. శిలాఫలకంపై అడ్డతీగల సర్పంచ్‌కు, ఎమ్మెల్యే అయిన తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరించారన్నారు. అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై తాను శాసనసభలో ప్రస్తావిస్తానన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ అమలయ్యేలా చూడాల్సిన డీఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అన్ని పనులకూ తమ సేవలు వినియోగించుకున్న అధికారులు ప్రారంభోత్సవంలో మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానించడం దారుణమని అడ్డతీగల సర్పంచ్ పప్పుల చిట్టమ్మ అన్నారు. అధికారులది పొరబాటే.. అధికారులు ఈ విషయంలో పొరపాటు చేశారని, మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీరారెడ్డి అన్నారు. -
వ్యాధి మూలాలు గుర్తించకపోవడం శోచనీయం
చింతూరు : కాళ్ల వాపు వ్యాధితో ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు వ్యాధి మూలాలను గుర్తించకపోవడం శోచనీయమని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. చింతూరులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గిరిజన సంక్షేమశాఖా మంత్రి వచ్చి తూతూమంత్రంగా పర్యటించి వెళ్లిపోవడాన్ని తప్పుబట్టారు. వైద్యం కోసం అల్లాడుతున్న గిరిజనులకు భరోసా ఇవ్వాల్సిన ఆరోగ్యశాఖా మంత్రి ఇంతవరకూ వ్యాధి ప్రబలిన గ్రామాల్లో పర్యటించక పోవడం దారుణమన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే గిరిజనుడే ఆ శాఖకు మంత్రిగా ఉండాలని ఆమె అన్నారు. రాష్ట్రస్థాయిలో గిరిజన సలహా మండలిని నియమించాలని తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం ఇంతవరకు నియమించలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాళ్లవాపుతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తగదన్నారు. తక్షణమే వారి కుటుంబాలకు రూ 10 లక్షలతో పాటు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. చింతూరు ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందితో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. చింతూరు ఐటీడీఏకు రెగ్యులర్ పీవోతో పాటు సిబ్బందిని కూడా నియమించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పాఠశాలల సందర్శన ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆదివారం చింతూరు బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా బాలికల విద్యాలయాలను సందర్శించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గదులు కురుస్తున్నాయని, ఆవరణలోని వర్షపు నీరు గదుల్లోకి వస్తోందని, మరుగుదొడ్లు సరిగా లేవని, యూనిఫాం ఇవ్వలేదని, ఫ్యాన్లు లేకపోవడంతో దోమలు కుడుతున్నాయని కస్తూర్బా విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. అనంతరం ఆమె ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోయం అరుణ, వైస్ ఎంపీపీ పండా నాగరాజు, ఎంపీటీసీ సభ్యుడు సోడె బాయమ్మ పాల్గొన్నారు. -
ఆ నమ్మకంతో పెళ్ళి చేసుకున్నా!
ఫస్ట్ పర్సన్ భర్త తాగుడికి బానిస అయితే... భార్య తాగుబోతుకి బానిస కావాలా? భర్తది వ్యసనం అయితే... భార్యది సహనం కావాలా..? జబ్బు అర్థం కాకపోతే, భర్త అర్థం కాడు. మందు మానాలంటే... మందు రాయాలి. మార్గం చూపించాలి. మత్తు మైకం నుంచి బయటపడేయడానికి మమైకం అయ్యింది రాజేశ్వరి. మత్తు మైకం ఆల్కహాలిక్తో లైఫ్ షేర్ చేసుకోవడమంటే... ఆ పెయిన్ మాటల్లో చెప్పలేం! మనిషి భౌతికంగా మనతోనే ఉంటాడు.. కానీ మానసికంగా ఎక్కడో ఉంటాడు. అదో డిసీజ్ అని తెలియక ముందు... రాహుల్ ఏం చేసినా కావాలనే చేస్తున్నాడనుకునేవాళ్లం. ఈ మనిషితో కలిసుండం కష్టం అనిపించేది. ప్రేమించిన మనిషికి దూరమై బతకడం, దూరంగా బతకడం బాధే. కాని కలిసుండి చేసిన ఆ స్ట్రగుల్ నాలో నిరాశనే పెంచింది. కనీసం సపరేట్గా ఉంటేనన్నా, జీవితంలోని ఛాలెంజెస్లో పడి ఆ బాధను మరిచిపోవచ్చేమో అనుకున్నా. అందుకే దాదాపు నాలుగేళ్లు రాహుల్‌కి దూరంగా ఉన్నా. మొత్తానికి మేం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్.. ఎక్స్‌పీరియెన్స్‌తో ఇద్దరం ఓ ఇన్స్టిట్యూషన్లా పెరిగాం. ఆ నమ్మకంతో పెళ్ళి చేసుకున్నా! నేను ఢిల్లీ యూనివర్సిటీలో సైకాలజీ చేసి ట్రైనింగ్ కోసం బెంగుళూరు వెళ్లా. అక్కడే రాహుల్ పరిచయమయ్యాడు. అప్పటికే ఆయన డీ-ఎడిక్షన్ సెంటర్లో ఉన్నాడు. ఆల్కహాల్ మానేందుకు! రెండేళ్ల ఆ పరిచయం పెళ్లి వరకూ వెళ్లింది. పెళ్లికి ముందే ఆల్కహాల్‌కి ఎడిక్ట్ అవడం... ఆ అలవాటును మానేందుకు ట్రై చేయడం... ఇవన్నీ తెలిసినా రాహుల్‌తో పెళ్లికి నాకేమీ అభ్యంతరం అనిపించలేదు. ప్రేమగా చూసుకుంటే మనిషి నార్మల్ అవుతాడనే నమ్మకంతో పెళ్లి చేసుకున్నా. రెండేళ్లలో పాప(రైసా) పుట్టింది. అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం! అప్పుడర్థమైంది... అది డిసీజ్ అని! రాహుల్ ఆల్కహాల్ మానలేదు. ప్రేమగా చూసుకుంటే నార్మల్ అవుతాడనే నమ్మకంతోపాటు ధైర్యమూ పోయింది. అసలు మా ఇంట్లో ఎవరికీ తాగే అలవాటు లేదు. అందుకే ఈ ప్రాబ్లమ్‌ను ఎలా డీల్ చేయాలో తెలియలేదు. మామూలుగా అందరిలాగే నేనూ తనను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించా. బెడిసికొట్టింది. అలా అయిదేళ్లు గడిచిపోయాయి. పాప పెరుగుతోంది. రాహుల్ అలవాటు, అతనితో నా ఘర్షణ - పాప మీద ఎఫెక్ట్ చూపించసాగాయి. మళ్లీ బెంగుళూర్‌కి వెళ్లాం. ఆయనకు ట్రీట్మెంట్, నాకు, పాపకు కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్లో తెలిసింది. ఆల్కహాల్‌కి ఎడిక్ట్ కావడమనేది ఒక డిసీజ్ అని. రాహుల్‌తో ఎలా డీల్ చేయాలో చెప్పారు కౌన్సిలింగ్లో. అయినా ఆయనతో కలిసి ఉండే ధైర్యం చేయలేకపోయా! నిజానికి ఆయనకూ ఫ్యామిలీ అంటే ప్రాణమే. అయినా నాకు ట్రస్ట్ పోయింది. ఓపిక నశించింది. నిరాశలో పడిపోయా. దేవుడి మీదా నమ్మకం పోయింది. సపరేట్ అయ్యాం ఇక కలిసి ఉండడం నావల్ల కాలేదు. విడిగా ఉంటే కనీసం కొత్త ఛాలెంజెస్ ఉండవ్. రోజూ ఈ యాతన ఉండదు కదా... అని ఆలోచించి పాపను తీసుకొని వెళ్లిపోయా! అయితే నాకు మా అత్తగారు, మామ (ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర లూథర్)గారి సపోర్ట్ చాలా ఉంది. లేకపోతే ఓవర్‌కమ్ అవడం ఇంకా కష్టమయ్యేదేమో! సాధారణంగా భర్త ఆల్కహాలిక్ అయితే ఇంట్లో అందరూ భార్యనే తప్పుపడతారు. దాంతో భార్య విపరీతమైన స్ట్రెస్ ఫీలవుతుంది. సమస్య మరింత సీరియస్ అవుతుంది. నాకు అలాంటి స్ట్రెస్ లేదు. మా పేరెంట్స్ కూడా రాహుల్ పరిస్థితిని అంతే ఇదిగా అర్థం చేసుకున్నారు తప్ప అవమానించలేదు. డిస్క్రిమినేట్ చేసి గొడవ పెట్టుకోలేదు. నేను రాహుల్‌తో సపరేట్గా ఉన్నా అమ్మ వాళ్లింట్లో ఏ ఫంక్షన్స్ అయినా రాహుల్‌ని పిలిచేవాళ్లు. నాలుగేళ్లు గడిచాయి.. 1999లో మా తమ్ముడి మ్యారేజ్ అయింది. ఆ ఫంక్షన్‌కి రాహుల్ వచ్చాడు. అందరూ ఫ్యామిలీస్‌తో ఉండడం.. పిల్లలతో సంతోషంగా గడపడం చూశాడు ఆయన. తనూ తన ఫ్యామిలీతో ఉండాలని ఆరాటపడ్డాడు. అప్పటికే ట్రీట్మెంట్లో ఉన్నాడు. పాపను చాలా మిస్ అవుతున్నాడని మాకూ అర్థమైంది. బాధ అనిపించింది. అయినా రీ-కన్సిలియేషన్కు నాకు ధైర్యం చాలలేదు. తనకు మాతో ఉండాలన్న బలంతోనే మళ్లీ కలిశాం. అప్పటికి పాపకు తొమ్మిదేళ్లు. ఏళ్ల తరబడి ఆల్కహాల్ అలవాటున్న మనిషి పర్సనాలిటీ చాలా ఛేంజ్ అవుతుంది. తాగినందుకు వాళ్లూ హ్యాపీగా ఉండరు. మనకన్నా ఎక్కువ సఫర్ అవుతారు. మంచి, చెడు విశ్లేషించుకోలేరు. కౌన్సిలింగ్ సహాయంతో...చాలా ఓపికగా సమస్యను సాల్వ్ చేసుకునే పనిలో పడ్డాం. రాహుల్ కూడా నన్ను ట్రస్ట్ చేయడంతో ఆ అలవాటు నుంచి ఆయనను బయటకు లాగడం ఇదివరకటి కన్నా ఈజీ అయింది. రెండేళ్లకు బాబు (రిషల్) పుట్టాడు. ఆ యాంగిల్ తెలియదు వాడు వచ్చాక అయితే రాహుల్ పూర్తిగా మారిపోయాడు. బాబుకి వాళ్ల నాన్నతో మంచి రిలేషన్ ఉంది. వాళ్లిద్దరికీ ఎటాచ్మెంట్ ఎక్కువ. పాప వాళ్ల నాన్నలోని నెగటివ్ షేడ్స్ చూసింది. కానీ వీడికి ఆ యాంగిల్ తెలియదు. మేం చెప్పినా నమ్మడు. పిల్లలతో చాలా ఓపెన్‌గా ఉంటాం. వాళ్ల దగ్గర దాచాల్సిన అవసరం లేదనుకుంటాం. మనం దాస్తే.. వాళ్లూ విషయాలను దాచడం నేర్చుకుంటారు. అందుకే ఏదైనా ఓపెన్‌గానే చర్చిస్తాం. ఎమోషనల్ బ్లాక్మెయిల్ కుదరదు ఆల్కహాలిక్స్, వాళ్ల కుటుంబాలు పడుతున్న బాధను చూశా కాబట్టి హైదరాబాద్‌లో డీఎడిక్షన్ సెంటర్ పెట్టాల నుకున్నా. రాహుల్ కూడా సపోర్ట్ చేశాడు. వర్క్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రాహుల్ ట్రీట్మెంట్ తీసుకున్న డీ-ఎడిక్షన్ సెంటర్ హైదరాబాద్ బ్రాంచ్‌లో రెండు మూడేళ్లు ఇద్దరం పనిచేశాం. 2002లో సొంతంగా ‘హోప్ ట్రస్ట్’ స్టార్ట్ చేశాం. పేషంట్‌తో పాటు ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇవ్వడం మా ప్రత్యేకత. మురికివాడల్లో ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాలు చేస్తుంటాం. అంతేకాదు లోకల్ స్కూల్స్‌ని అడాప్ట్ చేసుకొని పిల్లలను చైతన్యపరుస్తుంటాం. ఆల్కహాలిక్స్ ఉన్న కుటుంబాలకు నేను చెప్పేది ఒకటే.. తప్పునంతా భార్యల మీదకు నెట్టొద్దు. అల్కహాలిక్స్ని పేషంట్స్లా చూడాలి. వాళ్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మార్చుకోవడం కుదరదు. నిరాశానిస్పృహలకు లోను కాకుండా ప్రొఫెషనల్స్ దగ్గరకెళ్లాలి. సమస్య చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. పేషంట్‌కు ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో, అతన్ని డీల్ చేసే ఫ్యామిలీకి కౌన్సిలింగ్ అంతే ముఖ్యం. ఇది నయం కాని వ్యాధి కాదు. కాకపోతే ఓపిక అవసరం అంతే! ఎవరమూ పర్ఫెక్ట్ కాదు. అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని సరిదిద్దుకునేందుకు ఒకరి సపోర్ట్ ఒకరికి కావాలి! ఆయన... బెస్ట్ హజ్బెండ్ గతాన్ని తల్చుకోలేను. నెగటివ్ పాస్ట్‌లోకి వెళ్లడానికి ఇష్టపడను. ఇప్పటి మా ఈ అచీవ్మెంట్ రాహుల్ సపోర్ట్ లేనిదే కుదిరేది కాదు. తాను అందులోంచి బయటకు రావాలని అనుకున్నాడు కాబట్టే మా ప్రయత్నాలకు సహకరించాడు. నేను కలలు కన్న ది బెస్ట్ హజ్బెండ్‌గా మారాడు. అప్పుడు సిట్యుయేషన్ వరెస్టే. అసలు మా పరిస్థితి మారుతుందా అని దిగులు పడ్డ సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం తను బెస్ట్ హజ్బెండ్ ఎవర్. ఎంత మారినా ఆల్కహాలిక్స్‌లో ఎమోషనల్ ఎక్స్పోజింగ్ డామేజ్ అయి ఉంటుంది. అందుకే మన మీదున్న ప్రేమను.. ఇష్టాన్ని మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేరు. వాళ్ల యాక్టివిటీ ద్వారా బయటపెడుతుంటారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో రాహుల్ కూడా అంతే. సారీ, థ్యాంక్స్‌లు చెప్పరు. కాంప్లిమెంట్స్ ఉండవు. అలాగని ఆయన మనసులో ఆ ఫీల్ లేదని కాదు. నాకిష్టమైన పనులు చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తుంటాడు. - సరస్వతి రమ -
దళిత సాహిత్య అకాడవీ జేఏస్‌గా రాజేశ్వరి
భారతీయ దళిత సాహిత్య అకాడమీ (బీడీఎస్‌ఏ) హైదరాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా మెట్టుగూడకు చెందిన ఎం.రాజేశ్వరి శుక్రవారం నియమితులయ్యారు. బీడీఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజేశ్వరిని జిల్లా సంయుక్త కార్యదర్శిగా నియమించినట్టు అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ప్రకటించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సమక్షంలో ఆమెకు నియామక పత్రం అందించారు. రాజేశ్వరి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన అకాడమీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నాయకులు ఎర్రగుడ్ల వేంకటేశ్వర్లు, నీరుడు కృష్ణ, సి.అంజలి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎంపీటీసీపై అంగన్వాడీ కార్యకర్త ఫిర్యాదు
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆదివారం టీడీపీ ఎంపీటీసీపై అంగన్వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ రాజేశ్వరి అనే అంగన్వాడీ కార్యకర్త టీడీపీ ఎంపీటీసీ శ్రీనివాసులుపై ఆరోపించింది. చెప్పిన మాట వినకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో రాజేశ్వరి.. ఎంపీటీసీపై గార్లదిన్నె మండలం కమలాపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మృత్యుశకటం..
-
మృత్యుశకటం..
- బాలికలపైకి దూసుకెళ్లిన లారీ - ముగ్గురు చిన్నారులు మృతి కొలిమిగుండ్ల కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం పాలు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్న ముగ్గురు బాలికలపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో మణి (12), రాజేశ్వరి (16), తిరుపతమ్మ (14 ) తీవ్ర గాయాలతో మృతి చెందారు. బాలికలను ఢీకొట్టిన లారీ అదే వేగంతో 100 అడుగుల దూరం వెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. దీంతో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొలిమిగుండ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
బాక్సైట్ ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఐక్య కార్యచారణ కమిటీ ఏర్పాటైంది. ఆదివారం విశాఖలోని ఎంవీపీ కాలనీ ప్రాంతంలోని గిరిజన భవన్లో వివిధ ఆదివాసీ సంఘాలు, గిరిజన మేథావులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కెడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, పి.రాజన్నదొర, రాజేశ్వరి, కళావతి తదితరులు సమావేశమయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు గ్రామసభ ఆమోదాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తీర్మానించారు. తవ్వకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
డ్రెస్ కోడ్ బాలేదన్నందుకు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కాలేజిలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు వేధిస్తున్నారంటూ.. డిగ్రీ సెకండియర్ చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలిపింది. దాంతో పోలీసులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. నిజాం కాలేజీలో బీఎస్సీ రెండో ఏడాది చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థినినీ అదే కాలేజీకి చెందిన రాజశేఖర్ అనే సీనియర్ డ్రెస్ కోడ్ సరిగా లేదని బుధవారం సాయంత్రం చెప్పాడు. ఈ విషయం గురువారం కాలేజీ మొత్తం తెలియడంతో తోటి విద్యార్ధినులు రాజేశ్వరిని ఈ విషయం గురించి అడిగారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బర్కత్‌పురలోని తన హాస్టల్‌కు వెళ్లి కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమైన నారాయణగూడ పోలీసులు హాస్టల్‌కు వెళ్లి అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఆబిడ్స్ పోలీసులకు అప్పగించారు. సీనియర్ రాజశేఖర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఇద్దరినీ జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. తాను కేవలం డ్రెస్ కోడ్ సరిగా లేదని మాత్రమే సలహా ఇచ్చానని రాజశేఖర్చెప్పడం, అదే విషయాన్ని రాజేశ్వరి ధ్రువపర్చడంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
మాంగల్యం మరణ శాసనం
అగ్నిసాక్షిగా కట్టిన తాళే కసాయి భర్త చేతిలో ఉరితాడుగా మారింది. కష్ట సుఖాల్లో తోడుంటానని ... జీవితమంతా నీతో నడుస్తానన్న ఆ మృగాడు జీవితాన్నే అంతం చేశాడు. మూడు పదుల వయసు నిండకుండానే నూరేళ్ల ఆయువును తీసేశాడు. భార్యను చంపి రెండున్నరేళ్ల కుమార్తెను, ఆరు నెలల వయసున్న కుమారుడిని తల్లికి దూరం చేశాడు. మార్కాపురం : దురలవాట్లకు బానిసగా మారిన ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆమె మెడలో ఉన్న తాళినే గొంతుకు బిగించి అత్యంత దారుణంగా హతమార్చాడు. కనీసం తన ఇద్దరు పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఘాతుకానికి ఒడిగట్టాడు. మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం... మార్కాపురం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఆవుల అల్లూరయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా, కుమార్తె రాజేశ్వరి (28)ని ఎనిమిదేళ్ల క్రితం గుండంచర్ల గ్రామానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. రెండు నెలలకే భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అనంతరం 2009లో మార్కాపురం పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ పులిమి శ్రీనుతో రాజేశ్వరికి వివాహం చేశారు. వీరికి ప్రస్తుతం రెండున్నరేళ్ల కుమార్తె భవాని, ఆరు నెలల కుమారుడు రమేష్ ఉన్నారు. అయితే, ఏడాది కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీను.. భార్య అడ్డును తొలగించుకోవాలని భావించాడు. కొద్ది రోజులుగా రాజేశ్వరిని వేధిస్తూ వస్తున్నాడు. ఇటీవల అతని వేధింపులు తట్టుకోలేకపోయిన రాజేశ్వరి పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వారు సర్దిచెప్పి తిరిగి కాపురానికి పంపించారు. ఈ నేపథ్యంలో మార్కాపురంలోని కంభం రోడ్డులో ఉంటున్న శ్రీను.. ఇరవై రోజుల క్రితం తన కుటుంబాన్ని డ్రైవర్స్కాలనీలోకి మార్చాడు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వెళ్లిన శ్రీను.. రాజేశ్వరి మెడకు తాళి బిగించి హత్యచేసి పరారయ్యాడు. చుట్టుపక్కల వారిద్వారా సమాచారం అందుకున్న రాజేశ్వరి తల్లిదండ్రులు 11.30 గంటల సమయంలో డ్రైవర్స్‌కాలనీ చేరుకున్నారు. నోటి నుంచి రక్తంపడి మృతిచెంది ఉన్న కుమార్తె, ఉయ్యాలలో గుక్కపట్టి ఏడుస్తున్న మనుమడు రమేష్‌లను చూసి భోరున విలపించారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ శివరామకృష్ణారెడ్డి.. గొంతుకు తాళి బిగించడంతో నోటి నుంచి రక్తంకారి రాజేశ్వరి మృతిచెందినట్లు భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి ఆవుల అల్లూరయ్య ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసుకుని శ్రీను కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
అయ్యో.. పాపం
ఫిట్స్‌తో తల్లి మృతి: కూతురు అదృశ్యం మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చున్న ఏడాది బాబు నాగోలు: భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మహిళకు ఫిట్స్ వచ్చి కిందపడి మృతి చెందింది. తల్లి మృతదేహం పక్కనే ఏడాదిన్నర బాలుడు ఏడుస్తూ ఉండటం పలువురిని కంటతడి పెట్టించింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... బేగంపేట పోలీస్‌లైన్‌కు చెందిన ఐలేని రాజేశ్వరి (24), మహేష్ భార్యాభర్తలు. వీరు నాచారం మల్లాపూర్‌లోని నర్సింహ్మనగర్ కాలనీలో ఉంటున్నారు. భర్త పెయింటర్. శివాని (5), కార్తీక్ ( ఏడాదిన్నర )వీరి సంతానం. ఈనెల 24న భర్తతో గొడవపడిన రాజేశ్వరి ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఆదివారం రాత్రి ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి ఎదురుగా సులభ్ కాంప్లెక్స్ వద్ద కార్తీక్‌తో కలిసి నడుచుకూంటూ వెళ్తూ కిందపడి చేతులు, కాళ్లు కొట్టుకోవడంతో స్థానికులు ఫిట్స్ వచ్చిందని గమనించి తాళంచెవులు చేతిలో పెట్టి 108కు తెలిపారు. 108 వాహనం వచ్చేసరికి రాజేశ్వరి చనిపోయింది. పక్కనే ఉన్న బాబు కార్తీక్ తల్లి మృతి చెందిన విషయం తెలియక మీదపడి రోదించాడు. ఎల్బీనగర్ పోలీసులు.. రాజేశ్వరి వద్ద లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. భర్త మహేష్ మాత్రం రాజేశ్వరికి ఇంతకు ముందు ఎప్పుడూ ఫిట్స్ రాలేదని, విషం తాగి మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. కూతురు అదృశ్యం.. రాజేశ్వరి వెంట వచ్చిన కూతురు శివాని అదృశ్యమైంది. దీంతో భర్త మహేష్, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల ముందు నాచారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. -
అరకు ప్రాంతంపై ప్రభుత్వానికి రహస్య అజెండా ?
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంపై టీడీపీ ప్రభుత్వానికి రహస్య అజెండా ఉన్నట్లుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాల కోసం ఆ ప్రాంతాన్ని డీ నోటిఫై చేస్తారేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ సీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజన్నదొర, సర్వేశ్వర్రావు, గిద్ది ఈశ్వరి, కళావతి, పుష్ప శ్రీవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ... ఇప్పటికీ గిరిజన సలహామండలి పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని వారు గుర్తు చేశారు. గిరిజన సంబంధిత అంశాల్లో ప్రభుత్వం... ఎస్టీ ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతం అరకును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వకపోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. గిరిజన అంశాలు సభలో చర్చకు వచ్చినప్పుడు స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఏసీబీ వలలో రెవెన్యూ సిబ్బంది
డోన్‌టౌన్: డోన్‌లో సోమవారం లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపిన మేరకు..డోన్ మండలం నక్కలవాగుపల్లె గ్రామ డీలర్ చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ దుకాణాన్ని 20 రోజుల క్రితం ఆర్ఐ రాజేశ్వరి, వీఆర్వో రాజు తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వకుండా ఉండాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి దఫాగా డీలర్ రూ.5 వేలు చెల్లించాడు. ఆ తర్వాత డిప్యూటీ తహశీల్దార్ జయంతికి కూడా రూ.15 వేలు ఇవ్వాలని, లేదంటే లెసైన్స్ రద్దు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. విసిగిపోయిన డీలర్ చంద్రశేఖరరెడ్డి తన సోదరుడు రమణారెడ్డితో కలసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం డీలర్ నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా డీటీ, ఆర్ఐ, వీఆర్వోలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆర్ఐ రాజేశ్వరి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. లంచం తీసుకున్నట్లుగా నిర్ధారించిన రంగు నీళ్ల సీసాను అధికారుల కళ్లెదుటే ధ్వంసం చేసి కార్యాలయంలోని మరో వాకిట్లో పరారయ్యేందుకు యత్నించగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో సీఐలు ప్రసాద్‌రావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాగా.. పౌరసరఫరాల శాఖ గోదాములో సరుకుల రవాణాపై ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో కూడా భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. -
అడ్డూ అదుపూ లేకుండా కుమ్మక్కు కుట్రలు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు తప్ప మరెవ్వరూ అందలమెక్కకూడ దు. ఒకవేళ సామాన్యుడ్ని సామాన్యులంతా ఎన్నుకుంటే వారికి ఏదో రకంగా అన్యాయం తలపెట్టాల్సిందే? ఏదో రకంగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాల్సిందే?. ఇంతవరకూ అయితే కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలే పదవులు దక్కించుకున్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీల నేతలనే ఎన్నుకోవలసి వచ్చేది. కానీ వైఎస్సార్ సీపీ ఆవి ర్భావంతో ఈ రెండు పార్టీల ప్రతినిధులు వీలున్న చోటల్లా కుమ్మక్కు కుట్రలకు తెరలేపారు. వేపాడ మండలంలోనూ ఇదే జరిగింది. మండలంలోని వావిలపాడులో వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్‌గా బీల రాజేశ్వరి ఎన్నికయ్యారు. దీంతో అప్పటి నుంచి ఈ వర్గానికి చెందిన వారిపై వేధింపులు ఎక్కువయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు కాకుండా వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి గెలుపొందడంతో ఖంగుతిన్న ఆ పార్టీల నేతలు ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్కటై తమ అభ్యర్థిగా గోగాడ పద్మావతిని గెలిపించుకున్నారు. నాటి నుంచి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ పనులకు అ డ్డు తగులుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ బీల రాజేశ్వరికి మద్ద తిచ్చిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు. సర్పంచ్‌తో పాటు వారి సమీప బంధువులు, మద్దతుదారులు, ఓట్లేసిన వారిని కూడా ఇబ్బందులు పెట్టి వేధిస్తున్నారు. సర్పంచ్ మద్దతుదారులైన మండల అప్పలనాయుడు, మండల సత్తిబాబుల ఇంటి పెరటి స్థలం తమదని తగాదా సృష్టించి, తమ రాజకీయ పలుకుబడి, అర్ధ బలంతో అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఇంటి పని నిలివేయించారు. వావిలపాడు గ్రామస్తులెన మండల అప్పలనాయుడు, సత్తిబాబులు ఇళ్లు కట్టుకునే సమయంలో ఆ పెరటి స్థలం తమదని, గ్రామా నికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీనేత గండి వెంకటరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్‌లు సివిల్ తగాదా అయి నందున తమకు సంబంధం లేదని తేల్చడంతో తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు తహశీల్దార్‌ను ఆశ్రయించారు. మాటమార్చి.... నేతల ఒత్తిళ్లతో తహశీల్దార్ ఇరు పార్టీలకు నోటీసులు ఇచ్చారు. విచారణ సమయంలో సంబంధిత మాజీ సర్పంచ్‌ను తహశీల్దార్ ప్రశ్నించినప్పుడు ఇంటి పెరడు మీదంటున్నారు. హక్కు పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే ప్రజలే మాకు డాక్యుమెంట్లు అంటూ చెప్పు కొచ్చారు. ఆ తర్వాత ఆర్డీఓ కోర్టులో మాత్రం తన పేరున ఇందిరమ్మ ఇంటి పట్టా ఉందంటూ చూపించారు. అకస్మాత్తుగా ఇదెక్కడి నుంచో వచ్చిందో అధికారులకే తెలియాలి. ప్రస్తుతం ఈ కేసు ఆర్డీఓ కోర్టులో ఉంది. రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం గ్రామకంఠంలోని ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ భాద్యత పూర్తిగా పంచాయితీలదే. గ్రామకంఠం భూములపై ఆజమాయిషీ చేసే హక్కు ప్రాథమికంగా రెవెన్యూ అధికారులకు లేదు. కాగా అది మరిచి ఇంటి నిర్మాణం వద్దంటూ ఏ హక్కుతో నోటీసులు ఇచ్చారో అర్ధం కాలేదు. ప్రస్తుతం సాగదీత ధోరణి అవలంభిస్తున్నారు. అన్ని ఆధారాలు చూపిస్తున్నా సామాన్యున్ని ఇబ్బందులు గురిచేయ టం ఏ తరహా న్యాయమో అధికారులకే తెలియాలి. ఆధారాలున్నా కాదంటున్నారు స్థలం తమది అని నిర్ధారించేలా 1961నుంచి చెల్లించిన ఇంటి పన్ను రశీదులు, తొలగించిన తాటాకుల మిద్దెఇంటి నంబర్‌తో ఓటర్లు జాబితాలో పేరు, విద్యుత్ బిల్లులు, పం చాయతీ పాలకవర్గం తీర్మానం, 1981లో వివాదాస్పద స్థలాన్ని తమ కుటుంబ సభ్యురాలికి దఖలు పరుస్తూ రాసిచ్చిన అగ్రిమెంట్ ఇలా అన్ని ఆధారాలు అప్పలనాయుడు కుటుంబీకులు చూపినా రెవెన్యూ అధికారుల్లో చలనం లే దు. మాజీ సర్పంచ్ గండి వెంకటరావు అకస్మాత్తుగా చూ పించిన ఇందిరమ్మ ఇంటిస్థలం పట్టాను పట్టుకుని విచారణ జరపడం జిల్లా రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు ఎలా దాసోహం అయ్యారో చెప్పకనే తెలుస్తోంది. ఇది కేవవలం ఉదాహరణ మాత్రమే ఇలాంటి వేధింపులు జిల్లా వ్యాప్తం గా రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. దీంతో రాజకీ య అండలేని సామాన్యులునానా అవస్థలు పడుతున్నారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
చండ్రలగూడెం (కారేపల్లి): అదనపు కట్నం కోసం భర్త, అత్త, మరిది వేధిస్తుండడాన్ని తాళలేని ఓ వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కటుంబీకులు తెలిపిన ప్రకారం.. చండ్రలగూడెం గ్రామానికి చెందిన కోటకొండ రవికి, నల్లగొండ జిల్లా కోదాడ పట్టణం బంజర కాలనీకి చెందిన రాజేశ్వరి(24)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. రాజేశ్వరి తల్లిదండ్రులు వివాహ సమయంలో లక్ష రూపాయల కట్నంతోపాటు ఇతర లాంఛనాలు ఇచ్చారు. రాజేశ్వరిని భర్త రవి, అత్త పద్మ, మరిది కోటేష్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఆమెను గురువారం రాత్రి భర్త రవి తీవ్రంగా కొట్టాడు. ఆమె శుక్రవారం ఉదయం తన తల్లి వెంకాయమ్మకు ఫోన్ చేసి.. ‘‘అమ్మా.. నన్ను తీసుకపోండి. రాత్రి బాగా కొట్టారు..’’ అని రోదించింది. అదే రోజున, ఊరి సమీపంలోగల స్వంత వ్యవసాయ బావిలో ఆమె దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త రవి.. బావిలో దూకి, రాజేశ్వరి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి, దగ్గర్లోని పొల్లాల్లో పనిచేస్తున్న రైతులకు చెప్పాడు. అదే సమయంలో, బిడ్డను తీసుకెళ్లేందుకని తల్లి వెంకాయమ్మ కోదాడ నుంచి ఖమ్మం చేరుకుంది. ఆమెకు అల్లుడు రవి ఫోన్ చేసి, రాజేశ్వరి మృతిచెందిన వార్త చెప్పాడు. వెంకాయమ్మ బావి వద్దకు వచ్చి, కూతురు మృతదేహంపై పడి రోదించింది. రాజేశ్వరి-రవి దంపతులకు ఐదేళ్ల వయసున్న కవలలైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తే చంపాడని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన రాజేశ్వరిని ఆమె భర్త రవి చంపి బావిలో పడేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ రాజేశ్వరి మృతదేహంతో ఆమె బంధువులు కారేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో ఉన్న రవిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. నిందితుడిని చట్టపరంగా శిక్షిస్తామని పోలీసులు నచ్చచెప్పడంతో వారు శాంతించారు. అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తల్లి వెంకాయమ్మ ఫిర్యాదుతో ఎస్ఐ బి.మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
అంధకారంలో...
మన నవలలు ‘మీరెందుకు ఈ వృత్తిలోకి వచ్చారండీ. ఇలా ఎలా చెడిపోయారు?’ చెడిపోవడం ఏంటి? ఈ పని చేసినవాళ్లు చెడిపోయినట్టయితే ఈ పని చేయడానికి వచ్చినవాళ్లు చెడిపోయినట్టు కాదా? ఈ ప్రశ్నకు ఎప్పుడూ జవాబు దొరకలేదు రాజేశ్వరికి. అవును. ఈ వృత్తిలోకి తానెందుకు వచ్చింది? ఒళ్లు కొవ్వెక్కి వచ్చిందా. దుర్గ ఎందుకు వచ్చింది. వాళ్ల నాన్న తాగుడు ఇల్లు గుల్ల చేసి- చాలక కడుపున పుట్టిన ఆడపిల్లలను కూడా గుల్ల చేస్తుంటే వచ్చింది. సావిత్రి ఎందుకొచ్చింది? కట్టుకున్నవాడు నాలుగునాళ్లు కాపురం చేసి నెపం వేసి పారిపోతే ఏం చేయాలో తోచక దిక్కు తెలియక వచ్చింది. సత్తులు ఎందుకు వచ్చింది? మద్రాసు వెళ్లి సినిమాల కోసం స్టూడియోలు తిరిగి ఉన్న అందం హూనం చేసుకొని పట్టెడు మెతుకులు దొరక్క నెత్తిన ఇంత నీడ దొరక్క వచ్చింది. మరి రాజేశ్వరి ఎందుకు వచ్చింది? మగ అహంకారం వల్ల వచ్చింది. ఉత్త మగ అహంకారం. రాజేశ్వరి తల్లి రాధ బంగారుబొమ్మ. ఊరి పెద్దమనిషి కూతురు. కలిగిన ఇంట పుట్టిన కల్పవల్లి. కాని తప్పు చేసింది. పోయి పోయి పాలేరును ప్రేమించింది. తండ్రి అహంకరిస్తే- కులం మర్యాద పరువు అని ప్రేలాపిస్తే పాలేరుతో పారిపోయింది. కష్టజీవి తన భర్త. రెండు పొట్టలకు సంపాదించకపోడు. అతడలాగే సంపాదించాడు. తన కోసం వచ్చేసిన పెద్దంటి అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూశాడు. కాని రోడ్డున పడి తిరిగే బతుకులకు గ్యారంటీ లేదు. పాలేరు బండిని లారీ గుద్దేసింది. రాధ బతుకు చితికిపోయింది. ఇంటికి వచ్చేయొచ్చు. అంత ఆస్తి ఉందే! తండ్రి మళ్లీ చేరదీసి అక్కున జేర్చుకుంటే ఎంత భరోసా. కాని కులం, పరువు, మర్యాదా.... లేచిపోయిన కూతురిని ఇంట పెట్టుకుంటారా ఎవరైనా? అహంకారం. వద్దన్నాడు. ఆడది ఏం చేయాలి. వయసులో ఉన్న ఆడది. బయట బతకడానికి వీల్లేని పరిస్థితులున్న ఒంటరి ఆడది. ఒక ఆడపిల్ల పుట్టి మగదిక్కు లేని ఆడది. వేరే మార్గం లేదు. వేలాది ఏళ్లుగా వేసిన రాజమార్గం ఉండనే ఉంది. అదే సరైనది. ఒక రాజుగారికి ఉంపుడుగత్తెగా పోయింది. పడుపుగత్తెగా ఉండటం కంటే ఇది కాస్త మేలు. అంధత్వం కంటే చత్వారమే నయం. రాజుగారు బానే చూసుకున్నారు. రెండు గుడ్డలు పడేశారు. నాలుగు మెతుకులు పడేశారు. బదులుగా నిత్యం సేవ చేయించుకున్నారు. కాని ఉంపుడుగత్తె కూతురు తన కూతురు అవుతుందా? దాని పెళ్లి మాటే ఎత్తడే. అదే దిగులు రాధకి. ఆ దిగులుతోనే తీసుకు తీసుకు పోయింది. రాజుగారికి చాలా బాధ వేసింది. పోయినందుకు కాదు. రోజూ సుఖం ఇచ్చే ఒక ప్రాణి లేకుండా పోయినందుకు. రాజుగారు చాలా మంచివారు. తల్లి లేని లోటును కూతురిలో చూసుకోబోయారు. వయసొచ్చిన కూతురు. తనకు పుట్టలేదు కాబట్టి, తాను తండ్రిని కాదు కాబట్టి, తల్లి తనకు ఉంపుడుగత్తె అయినా పిల్ల మాత్రం తన కూతురు కానేరదు. కూతురు వరస కూడా కానేరదు. అయితే గియితే ఉంపుడుగత్తే అవుతుంది. రాజుగారు రాత్రికి రాత్రి పిశాచంలా మారి పిల్లను కాటేశారు. నమిలేశారు. మింగేశారు. నాన్నా... నాన్నా... అని పెనుగులాడుతున్న కూతురు... రాజేశ్వరి.... ఈ మృగానికి మూర్ఖుడికి మగాడికి భయపడి పారిపోయింది. పారిపోయి పారిపోయి ఎక్కడ తేలుతుంది? తెలిసిందేగా. అవే ఇరుకు సందులు. తరతరాలుగా ఇలాంటివారి కోసమే సిద్ధమై ఉన్న మురికివాడలు. పడుపుగొందులు. ఈ కథ ఎవరికి చెప్పుకోవాలి? ఈ కథ ఎవరికి చెప్పినా ఏం అర్థమవుతుంది? కాని ప్రతివాడూ పెద్ద ఆపద్బాంధవుడిలాగా ప్రశ్నించడమే- మీరీ వృత్తిలోకి ఎలా వచ్చారండీ. ‘ఏం పెళ్లి చేసుకుంటారా?’ ‘పెళ్లా?’ ‘ఏం ఎందుకు చేసుకోకూడదు?’ ‘పడుపుగత్తెను పెళ్లాడతారా ఎవరైనా?’ ‘విటుడైన వెధవ ఏమీ ఎరగనట్టు దర్జాగా అమ్మాయిని దొరకబుచ్చుకుని పెళ్లి చేసుకుంటుంటే పడుపుగత్తె ఎవణ్ణో ఒకణ్ణి పెళ్లి చేసుకుంటే తప్పేంటి! ఇద్దరూ చేసింది ఒకటే తప్పు అయినప్పుడు ఒకరికో న్యాయం ఇంకొకరికో న్యాయమా?’ దెబ్బకు పరార్. మళ్లీ కనిపించడు. ‘అసలు ఈ ఆడవాళ్లు ఎందుకు వ్యభిచారం చేస్తారో?’ ఎంత పనికిమాలిన ప్రశ్న ఇది. వ్యభిచారం అనే మాటను కేవలం నాలుగ్గోడల మధ్య, మూడు నిమిషాల పాటు జరిగే పనికి కుదించుకోవడం వల్ల వచ్చే ప్రశ్న. వ్యభిచారం అంటే అసలర్థం ఏమిటి? చాలా పెద్ద నేరం. శీలం అంటే? నేరం చేయకపోవడం. కాని అలా ఉందా? రాజకీయ నాయకులకు తమ రాజకీయల పట్ల శీలం లేదు. వ్యాపారస్తులకు తమ వ్యాపారాల పట్ల శీలం లేదు. ఉద్యోగులకు తమ ఉద్యోగాల పట్ల శీలం లేదు. టీచర్లకు, లెక్చరర్లకు, వైద్యులకు, న్యాయవాదులకు, చట్టాన్ని నిలబెట్టాల్సిన పోలీసులకు తమ తమ వృత్తుల పట్ల శీలం లేదు. ఈ శీలం తప్పి ఉండటం మనకు నేరం కాదు. కాని స్త్రీ తన శీలం తప్పడం మాత్రం నేరం. ఇక్కడంతా శీలం ఏర్పడినప్పుడు స్త్రీలు తమ శీలం కోల్పోయే పరిస్థితులు పోతాయి. ఇక్కడ వ్యభిచారం పోతే స్త్రీలు చేసే వ్యభిచారం కూడా పోతుంది. రాజేశ్వరి తన జీవితంలో చాలామందిని చూసింది. గొప్ప గొప్పవాళ్లని. రూపాయికి ఠికానా లేని వాళ్లని. అందరూ ఇదే బాపతు. దివాలా తీసినవారు. లేదా లోన దివాలా తీసి పైకి వేదాంతం వల్లించే వెధవలు. ఎలా బయటపడతారు తనలాంటివాళ్లు ఈ ఊబి నుంచి. ఎలా బయటపడతారు ఈ పుణ్యభూమిలో లక్షలాది మంది ఆడవాళ్లు ఈ నరకం నుంచి. ‘శ్రమదోపిడి పోతే బయటపడతారు’ అని జవాబు చెప్పాడు కృష్ణారావు. అతడు సమాజంలోని అవకతవకల గురించి ఆలోచించే సంస్కారవంతుడు. ‘దానికీ దీనికీ ఏం సంబంధం?’ అని అడిగాడు స్నేహితుడు. ‘ఉంది. ఈ భూమి అందరిదీ. కాని కొందరి చేతుల్లో ఉంది. వనరులు అందరివి. కాని కొందరి చేతుల్లోనే ఉన్నాయి. పరిశ్రమల వల్ల, పెట్టుబడుల వల్ల, భారీ వ్యాపారాల వల్ల వచ్చే ఆదాయం అందరిది. కాని కొందరి జేబుల్లోనే ఉంది. అందరూ చేస్తే వచ్చిన ఫలం అందరిదీ కాకపోతే కొందరు శ్రీమంతులవుతారు. కొందరు దరిద్రులవుతారు. ఈ దరిద్రులను ఆ శ్రీమంతులు పీక్కుతింటూనే ఉంటారు. దరిద్రం ఏం చేస్తుందిరా అంటే మన దగ్గర ఏం ఉంటే అది అమ్ముకునేలా చేస్తుంది. ఆడవాళ్లు మానం అమ్ముకుంటారు. మగవాళ్లు విలువలు అమ్ముకుంటారు. శ్రమను దోచే వ్యవస్థ ఉన్నంతకాలం శరీరాన్ని దోచే వ్యవస్థ కూడా ఉంటుంది’ కాని ఈ పరిస్థితి ఎప్పటికి పోవాలి? నలిపే శరీరాల కింద రాజేశ్వరిలాంటివాళ్లు ఎంతకాలం నలగాలి. నలిగి నలిగి... అదిగో ఆమె కడుపున పుండు పడింది. కేన్సర్. ఆ సందు చివర చిన్నపాకలో వేదన పడుతూ బాధ అనుభవిస్తూ పుట్టిన పిల్లను తనలాంటి పతిత చేతుల్లో పెట్టి కన్ను మూసింది రాజేశ్వరి. బతికినంతకాలం ఈ రాజేశ్వరి అంధకారంలో బతికింది. రేపు ఆ పిల్ల? నవల ముగిసింది. రంగనాయకమ్మ 1969లో రాసిన నవల ఇది. తెలుగులో ఒక విశిష్టమైన నవల. వేశ్యాజీవితాల మీద, వారి దగ్ధపూరితమైన అవస్థల మీద మొదటిసారిగా రష్యన్ రచయిత కుప్రిన్- ‘యమకూపం’ నవల రాయడం ద్వారా వెలుగు ప్రసరింపజేశాడని అంటారుగాని అంతకంటే ముందే అంటే 1899లోనే మన ప్రఖ్యాత ఉర్దూ రచయిత మిర్జా హదీ రుస్వా ఉత్తర భారతదేశంలోని తవాయిఫ్‌ల మీద (నాట్యం చేసే వేశ్యల మీద) ‘ఉమ్రావ్‌జాన్ అదా’ నవల రాసి (సినిమా ప్రసిద్ధం) సంచలనం సృష్టించాడు. అయితే ఈ ఇద్దరూ మగవాళ్లు. కాని ఒక స్త్రీ అయి ఉండి స్త్రీ చర్చించడానికి వీలులేని విషయంగా ఎంచబడుతూ స్త్రీ రచయిత ప్రవేశించి చూడలేని చీకటిదారిగా ఉంటూ వచ్చిన వేశ్యా జీవితాన్ని దగ్గరి నుంచి చూసి, పరిశీలించి రాయడం సామాన్యమైన విషయం కాదు. వేశ్యల మీద ఎవరు రాసినా ఎంత రాసినా వాస్తవిక చిత్రణ చేయడంతోనే ముగుస్తారు. కాని రంగనాయకమ్మ ఈ నవలను మార్క్సిజం వెలుగులో చూస్తారు. మార్క్సిజం వెలుగులో శాశ్వత పరిష్కారం చూపుతారు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో వేశ్యావాటికలు కళకళలాడటం విన్నాం. వాటి ఆదాయమే రాజ్య ఆదాయంలో కీలకం కావడం తెలుసుకున్నాం. రాజరికం అయినా, ఫ్యూడల్ వ్యవస్థ అయినా, పెట్టుబడిదారీ వ్యవస్థ అయినా భోక్తలుగా కొందరు ఉండాలని నిశ్చయించుకున్నప్పుడే భుజించడానికి స్త్రీ మాంసం అవసరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగానే కాదు ఈ దేశంలో కూడా ఇప్పుడప్పుడే పోయేలా లేదు. కాని అంతవరకూ సమాజాన్ని సంస్కరించడానికి సాహిత్యమే తోడు. ఆ పనిని చాలా సమర్థంగా చేసే నవల, వేశ్యా వృత్తి మూలాలపై విపులమైన అవగాహన కలిగించే నవల- అంధకారంలో. నవల: అంధకారంలో రచయిత: రంగనాయకమ్మ తొలి ముద్రణ: 1972 తెలుగులో వేశ్యావృత్తిపై విపుల చర్చను పెట్టిన తొలి నవల. వేశ్యల జీవితాలను, విటుల వికృతత్వాలను, మనస్తత్వాలను, మలిన పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపి ఒక విముఖత్వం ఏర్పరచడం ద్వారా చైతన్యం కలిగించే నవల. బజారున పడిన ఆడవాళ్ల గురించే గాక ఇళ్లలో ఉండే ఆడవాళ్లు పడే హింసను కూడా చూపుతుంది. భార్యాభర్తల నడుమ ఉండవలసిన సహజమైన ప్రేమ కూడా వ్యభిచారానికి ఒక విరుగుడే. స్త్రీల సంగతి ఏమోగాని ప్రతి మగవాడూ తప్పక చదవాల్సిన నవల ఇది. మార్కెట్లో అందుబాటులో ఉంది. వెల: రూ.50 -
రంపచోడవరం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రాజేశ్వరి
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వంతెల రాజేశ్వరి పోటీ చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను ఆమోదించి ఫ్యాన్ గుర్తు కేటాయించారు. ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా అనంత సత్య ఉదయభాస్కర్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన స్థానంలో రాజేశ్వరి ఫ్యాన్ గుర్తుపై రంగంలో ఉంటారన్న విషయాన్ని ఓటర్లు గుర్తించాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ సోమవారం తెలిపారు. రాజేశ్వరికి అవకాశం రావడంతో అసెంబ్లీకి పోటీపడుతున్న వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థుల సంఖ్య 12కు పెరిగింది. -
ముదిమిలో ‘ఫేస్బుక్’ బంధం
74ఏళ్ల వయస్సులో మళ్లీ వివాహం పత్తికొండ, న్యూస్‌లైన్: ఫేస్బుక్ బంధం 74ఏళ్ల వయస్సున్న వ్యక్తిని, 52ఏళ్ల మహిళను ఒకటి చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు బిజినేపల్లి నారాయణగుప్త భార్య రెండేళ్ల క్రితమే చని పోయింది. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వృద్ధాప్యంలో కన్నబిడ్డలకు భారం కాకూడదని, పైగా తనకు వస్తున్న పెన్షన్ తదనంతరం కూడా మరొకరికి ఉపయోగపడాలని భావించాడు. తన సామాజిక వర్గానికి చెంది, భర్తను కోల్పోయిన వితంతువు కావాలని ఫేస్బుక్లో సమాచారాన్ని ఉంచాడు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాజేశ్వరి భర్త గుండెపోటుతో మరణించాడు. ఈమె కుమార్తె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఫేస్బుక్లో నారాయణగుప్త వివరాలను చూసి, తల్లికి వివరించింది. ఆమె అంగీకరించింది. గురువారం మహానందిలో ఆదర్శ వివాహం చేసుకున్నారు. చట్టరీత్యా వివాహ రిజిస్ట్రేషన్ కూడా చేయించి తన భార్యకు అన్ని విధాలా భద్రత ఇస్తానని నూతన వరుడు నారాయణ గుప్త తెలిపారు. -
జిల్లా ఆస్పత్రిలో వైద్యుల మధ్య విభేదాలు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : అసలే వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా ఆస్పత్రిలో... ఉన్న వైద్యులు వారం రోజులుగా ఒకరికొకరు వాగ్వాద పడుతున్నా రు. దీంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. విధుల్లో కావాలనే వేధిస్తున్నారని గైనిక్ వైద్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గత బుధవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి లిఖిత పూర్వకంగా వారు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి వైద్యాధికారులు తమకు ఎక్కువగా బాధ్యతలు అప్పగిస్తూ కావాలని వేధిస్తున్నారని, కళాశాల ప్రొఫెసర్లుగా ఉన్న తమకు వైద్యసేవలు అందించడానికి వీలులేదని కోరుతూ లేఖలో ఆస్పత్రిలోని స్త్రీ వైద్యనిపుణులు రాజేశ్వరి, మంజుల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ప్రతిరోజు 40 ప్రసవాలు చేయాల్సి వస్తుందని, ఉన్న ముగ్గురు వైద్యులు సక్రమంగా విధులకు రాకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆస్పత్రి అధికారులు పేర్కొంటున్నారు. ఇరువురి మధ్య డ్యూటీల కేటాయింపులో తరుచుగా వాగ్వాదం చోటుచేసుకుంటున్నాయి. తమకు డ్యూటీలు వేయవద్దని వైద్యురాళ్లు, డ్యూటీలు చేయాల్సిందేనని వైద్యాధికారులు పట్టుబడుతుండడంతో వీరిమధ్య వారం రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే ఫిర్యాదు అందగానే కలెక్టర్ శుక్రవారం మెడికల్ కళాశాల అధికారులను , వైద్యులను తను చాంబర్‌కు పిలిపించుకొని సమావేశం నిర్వహించారు. వైద్యులు విభేదాలు మాని రోగులకు సేవలు అందించాలని, ఒకరికొకరు ఫిర్యాదు చేసుకోవడం తగదని హెచ్చరించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో గైనిక్ సేవలు అందించడానికి వైద్యురాళ్లు పనిభారం అనుకోకుండా, వీలైనంత ఎక్కువగా సేవలు అందించాలని సూచించారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు అదనం గా సేవలు అందించాలని కోరినట్లు తెలి సింది. లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించి నట్లు సమాచారం. కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యుల పనితీరు నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఇందులో 40 మంది ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని తెలపడంతో కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని రప్పించి వైద్యసేవలు అందిచాలని ఆదేశించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, పరిపాలన అధికారి నరేందర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
తొలి గురువులకు మలిపాఠం
నేను సైతం.. పిల్లలకు తల్లిదండ్రులే తొలిగురువులు అన్నారు. నిజమే...ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మానాన్నల మాటలు, ప్రవర్తన, అలవాట్లు... ఇలా చెప్పుకుంటూపోతే అన్నింటిలో వారి ప్రభావం పిల్లలపై ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి, అవసరమైతే అప్పులు చేసి చదివిస్తున్న ఎంతోమంది తల్లిదండ్రులు తమ ప్రవర్తన వల్ల ఇబ్బందిపడుతున్న పిల్లల మనసుల గురించి ఆలోచించడం లేదని ఆవేదన పడతారు అనంతపురానికి చెందిన టీచర్ నల్లారి రాజేశ్వరి. ఓ ఉపాధ్యాయురాలిగా పిల్లలకు పాఠాలు చెప్పి ఊరుకోకుండా... వారి తల్లిదండ్రులకు ఉచిత కౌన్సెలింగ్‌లు ఇస్తూ తన వంతు సాయం చేస్తున్నారు రాజేశ్వరి. పిల్లలు చదువుకోబోయే పాఠశాల ఎంత విశాలంగా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి, ఉపాధ్యాయుల బోధన బాగుంటుందా లేదా... ఇలా సవాలక్ష విచారణల తర్వాత గాని బిడ్డను స్కూల్లో చేర్పించడం లేదు. ‘మరి మీరెలా ఉంటున్నారు? మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది?’ అని విద్యార్థుల తల్లిదండ్రుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు రాజేశ్వరి టీచర్. ‘‘నాలుగో తరగతిలో ఒకబ్బాయి చాలా చురుగ్గా ఉండేవాడు. బాగా చదువుతాడు కూడా. ఉన్నట్టుండి నిరాశతో నీరసంగా అయిపోయాడు. నేను చాలా దగ్గరగా గమనించి వాళ్ల అమ్మానాన్నలకు కబురు పంపాను. అబ్బాయి తల్లి వచ్చింది. ఎంతసేపు మాట్లాడినా అసలు విషయం చెప్పలేదు. చివరికి తన కష్టాలు చెప్పింది. రోజు సాయంత్రమయ్యేసరికి తన భర్త తాగొచ్చి ఇంట్లో గోల చేస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి ప్రవర్తన కారణంగా పిల్లాడిలో చురుకుదనం పోయి ఏదో నలతపడ్డవాడిలా కనిపిస్తున్నాడని చెప్పింది. ఆ తల్లి మాటలు వినగానే నా మనసు గందరగోళంలో పడిపోయింది. అప్పటికి ఆమెకు నాలుగు ఓదార్పు మాటలు చెప్పి పంపించేశాను. తర్వాత పిల్లల తల్లిదండ్రులకు ‘ఇంటి వాతావరణం’ పై కౌన్సెలింగ్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాను’’ అని చెప్పారు రాజేశ్వరి. అనంతపురం రాంనగర్‌లోని పాఠశాలలో ప్రతి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇతరులకు కూడా... పేద విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహిస్తున్న రాజేశ్వరి టీచర్ ఆదివారం మాత్రం కౌన్సెలింగ్‌లతో బిజీగా ఉంటారు. ఆమె కౌన్సిలింగ్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులే కాదు...చుట్టుపక్కల సమస్యలతో ఇబ్బందిపడుతున్న చాలామంది భార్యాభర్తలు వస్తుంటారు. ‘‘నా స్కూల్లో చాలామంది పిల్లల తల్లిదండ్రులు నా దగ్గర వారి సమస్యలు చెప్పుకుని పరిష్కారాలు తెలుసుకుని పిల్లల కోసం వారిని వారు మార్చుకున్నారు. తమ కోసం తాము మారని చాలామంది తల్లిదండ్రులు పిల్లలకోసం మారతారని నిరూపించారు. విషయాల్లో మారకపోయినా... పిల్లలకు కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్నంతలో ప్రయత్నించారు. నా కౌన్సెలింగ్ గురించి తెలిసిన ఇతరులు కూడా నా దగ్గరకు రావడం మొదలుపెట్టారు. పిల్లలకు పాఠాలు చెప్పే నేను ఆదివారమయ్యేసరికి పెద్దలకు పాఠాలు చెప్పే సైకియాట్రిస్ట్‌గా మారిపోవాల్సివస్తోంది. నేనే కాదు... ఉపాధ్యాయులెవరైనా సరే తెలిసింది చెప్పకుండా, వచ్చింది నేర్పకుండా ఉండలేరు కదా’’ అని నవ్వుతూ అన్నారు రాజేశ్వరి టీచర్. ఆమె లాంటి వారి అవసరం విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఉంది కదూ! -
పల్లెలో ‘మొల్లి’ వికాసం
=పేదింటి విద్యా కుసుమం =ఒకేసారి ఐదు ఉద్యోగాలు రావికమతం, న్యూస్‌లైన్ : సకల సదుపాయాలున్న పట్టణాల్లో విద్యాభ్యాసం చేసిన వారికే సర్కారు ఉద్యోగం దొరకని రోజులివి. అలాంటిది, కనీస సౌకర్యాల్లేని మారుమూల పల్లెలో పట్టుదలే పెట్టుబడిగా ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఐదు ప్రభుత్వ కొలువులను అవలీలగా హస్తగతం చేసుకుంది ఆ యువతి. కష్టపడి చదివితే సాధించలేనిది లేదని, పేదరికం అడ్డుకాబోదని నిరూపించింది. పలువురికి ఆదర్శంగా నిలిచింది. మండలంలోని పి.పిన్నవోలు శివారు ఆర్.కొత్తూరులో నిరుపేద కుటుంబానికి చెందిన మొల్లి రాజారావు, రాజు దంపతుల కుమార్తె రాజేశ్వరి. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించింది. స్వగ్రామం, టి.అర్జాపురం, రావికమతం ప్రభుత్వ పాఠశాలల్లో బీసీ వసతి గృహంలో ఉంటూ చదివిన ఆమె అప్పట్లో పదో తరగతి పరీక్షల్లో మండల టాపర్‌గా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుడు భాస్కరరావు తదితరుల సహాయ సహకారాలతో ఎస్.కోట కాలేజీలో చేరి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. దీంతో మాకవరపాలెం అవంతి కాలేజీలో బీటెక్‌లో చేరింది. ఆ కళాశాల కరస్పాండెంట్ ఈ చదువుల సరస్వతికి ఫీజు లేకుండానే ఉచిత విద్య అందించారు. పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకుంటూ ఉన్నత చదువులు చదవాలని భావించిన రాజేశ్వరి బ్యాంకు క్లర్కు పోస్టుకు పరీక్షలు రాసి అందులో విజయం సాధిం చింది. ప్రస్తుతం రావికమతంలో ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తూనే జూనియర్ లెక్చరర్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్టల్ అసిస్టెంట్, ఎల్ఐసీ డెవలప్మెంట్ అధికారి, సీజీఎల్ఏ పోస్టులకు దరఖాస్తు చేసి పరీక్షలు రాసింది. ఒక్కొక్కటిగా అన్నీ పాసైనట్టు ఆమె తెలియజేసింది. అయితే జూనియర్ కాలేజీ లెక్చరర్ కన్నా మిగిలిన పోస్టులకు ఆమె ఇష్టపడక ఇంట ర్వ్యూలకు హాజరు కాలేదు. రావికమతం ఆంధ్రా బ్యాంకు నుంచి పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా చేరేందుకు సిద్ధమవుతోంది. స్వయంకృషితో కష్టాలను లెక్కచేయకుండా అరుదైన ఘనత సాధించిన రాజేశ్వరిని తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, రావికమతం ఆంధ్రా బ్యాంకు సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి తన విజయానికి కారకులైన గురువులు భాస్కరరావు, అప్పలనాయుడు, రామారావు, గిరిజారాణి, రామునాయుడులకు కృతజ్ఞతలు తెలిపింది.