
ముదిమిలో ‘ఫేస్‌బుక్’ బంధం
74ఏళ్ల వయస్సులో మళ్లీ వివాహం
పత్తికొండ, న్యూస్‌లైన్: ఫేస్‌బుక్ బంధం 74ఏళ్ల వయస్సున్న వ్యక్తిని, 52ఏళ్ల మహిళను ఒకటి చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు బిజినేపల్లి నారాయణగుప్త భార్య రెండేళ్ల క్రితమే చని పోయింది. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వృద్ధాప్యంలో కన్నబిడ్డలకు భారం కాకూడదని, పైగా తనకు వస్తున్న పెన్షన్ తదనంతరం కూడా మరొకరికి ఉపయోగపడాలని భావించాడు.
తన సామాజిక వర్గానికి చెంది, భర్తను కోల్పోయిన వితంతువు కావాలని ఫేస్‌బుక్‌లో సమాచారాన్ని ఉంచాడు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాజేశ్వరి భర్త గుండెపోటుతో మరణించాడు. ఈమె కుమార్తె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఫేస్‌బుక్‌లో నారాయణగుప్త వివరాలను చూసి, తల్లికి వివరించింది. ఆమె అంగీకరించింది. గురువారం మహానందిలో ఆదర్శ వివాహం చేసుకున్నారు. చట్టరీత్యా వివాహ రిజిస్ట్రేషన్ కూడా చేయించి తన భార్యకు అన్ని విధాలా భద్రత ఇస్తానని నూతన వరుడు నారాయణ గుప్త తెలిపారు.