
ఆ నమ్మకంతో పెళ్ళి చేసుకున్నా!
ఫస్ట్ పర్సన్
భర్త తాగుడికి బానిస అయితే... భార్య తాగుబోతుకి బానిస కావాలా?
భర్తది వ్యసనం అయితే... భార్యది సహనం కావాలా..?
జబ్బు అర్థం కాకపోతే, భర్త అర్థం కాడు.
మందు మానాలంటే... మందు రాయాలి.
మార్గం చూపించాలి.
మత్తు మైకం నుంచి బయటపడేయడానికి మమైకం అయ్యింది రాజేశ్వరి.
మత్తు మైకం
ఆల్కహాలిక్‌తో లైఫ్ షేర్ చేసుకోవడమంటే... ఆ పెయిన్ మాటల్లో చెప్పలేం! మనిషి భౌతికంగా మనతోనే ఉంటాడు.. కానీ మానసికంగా ఎక్కడో ఉంటాడు. అదో డిసీజ్ అని తెలియక ముందు... రాహుల్ ఏం చేసినా కావాలనే చేస్తున్నాడనుకునేవాళ్లం. ఈ మనిషితో కలిసుండం కష్టం అనిపించేది. ప్రేమించిన మనిషికి దూరమై బతకడం, దూరంగా బతకడం బాధే. కాని కలిసుండి చేసిన ఆ స్ట్రగుల్ నాలో నిరాశనే పెంచింది. కనీసం సపరేట్‌గా ఉంటేనన్నా, జీవితంలోని ఛాలెంజెస్‌లో పడి ఆ బాధను మరిచిపోవచ్చేమో అనుకున్నా. అందుకే దాదాపు నాలుగేళ్లు రాహుల్‌కి దూరంగా ఉన్నా. మొత్తానికి మేం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్.. ఎక్స్‌పీరియెన్స్‌తో ఇద్దరం ఓ ఇన్‌స్టిట్యూషన్‌లా పెరిగాం.
ఆ నమ్మకంతో పెళ్ళి చేసుకున్నా!
నేను ఢిల్లీ యూనివర్సిటీలో సైకాలజీ చేసి ట్రైనింగ్ కోసం బెంగుళూరు వెళ్లా. అక్కడే రాహుల్ పరిచయమయ్యాడు. అప్పటికే ఆయన డీ-ఎడిక్షన్ సెంటర్‌లో ఉన్నాడు. ఆల్కహాల్ మానేందుకు! రెండేళ్ల ఆ పరిచయం పెళ్లి వరకూ వెళ్లింది. పెళ్లికి ముందే ఆల్కహాల్‌కి ఎడిక్ట్ అవడం... ఆ అలవాటును మానేందుకు ట్రై చేయడం... ఇవన్నీ తెలిసినా రాహుల్‌తో పెళ్లికి నాకేమీ అభ్యంతరం అనిపించలేదు. ప్రేమగా చూసుకుంటే మనిషి నార్మల్ అవుతాడనే నమ్మకంతో పెళ్లి చేసుకున్నా. రెండేళ్లలో పాప(రైసా) పుట్టింది. అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం!
అప్పుడర్థమైంది... అది డిసీజ్ అని!
రాహుల్ ఆల్కహాల్ మానలేదు. ప్రేమగా చూసుకుంటే నార్మల్ అవుతాడనే నమ్మకంతోపాటు ధైర్యమూ పోయింది. అసలు మా ఇంట్లో ఎవరికీ తాగే అలవాటు లేదు. అందుకే ఈ ప్రాబ్లమ్‌ను ఎలా డీల్ చేయాలో తెలియలేదు. మామూలుగా అందరిలాగే నేనూ తనను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించా. బెడిసికొట్టింది. అలా అయిదేళ్లు గడిచిపోయాయి. పాప పెరుగుతోంది. రాహుల్ అలవాటు, అతనితో నా ఘర్షణ - పాప మీద ఎఫెక్ట్ చూపించసాగాయి. మళ్లీ బెంగుళూర్‌కి వెళ్లాం. ఆయనకు ట్రీట్‌మెంట్, నాకు, పాపకు కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్‌లో తెలిసింది. ఆల్కహాల్‌కి ఎడిక్ట్ కావడమనేది ఒక డిసీజ్ అని. రాహుల్‌తో ఎలా డీల్ చేయాలో చెప్పారు కౌన్సిలింగ్‌లో. అయినా ఆయనతో కలిసి ఉండే ధైర్యం చేయలేకపోయా! నిజానికి ఆయనకూ ఫ్యామిలీ అంటే ప్రాణమే. అయినా నాకు ట్రస్ట్ పోయింది. ఓపిక నశించింది. నిరాశలో పడిపోయా. దేవుడి మీదా నమ్మకం పోయింది.
సపరేట్ అయ్యాం
ఇక కలిసి ఉండడం నావల్ల కాలేదు. విడిగా ఉంటే కనీసం కొత్త ఛాలెంజెస్ ఉండవ్. రోజూ ఈ యాతన ఉండదు కదా... అని ఆలోచించి పాపను తీసుకొని వెళ్లిపోయా! అయితే నాకు మా అత్తగారు, మామ (ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర లూథర్)గారి సపోర్ట్ చాలా ఉంది. లేకపోతే ఓవర్‌కమ్ అవడం ఇంకా కష్టమయ్యేదేమో! సాధారణంగా భర్త ఆల్కహాలిక్ అయితే ఇంట్లో అందరూ భార్యనే తప్పుపడతారు. దాంతో భార్య విపరీతమైన స్ట్రెస్ ఫీలవుతుంది. సమస్య మరింత సీరియస్ అవుతుంది. నాకు అలాంటి స్ట్రెస్ లేదు. మా పేరెంట్స్ కూడా రాహుల్ పరిస్థితిని అంతే ఇదిగా అర్థం చేసుకున్నారు తప్ప అవమానించలేదు. డిస్క్రిమినేట్ చేసి గొడవ పెట్టుకోలేదు. నేను రాహుల్‌తో సపరేట్‌గా ఉన్నా అమ్మ వాళ్లింట్లో ఏ ఫంక్షన్స్ అయినా రాహుల్‌ని పిలిచేవాళ్లు.
నాలుగేళ్లు గడిచాయి..
1999లో మా తమ్ముడి మ్యారేజ్ అయింది. ఆ ఫంక్షన్‌కి రాహుల్ వచ్చాడు. అందరూ ఫ్యామిలీస్‌తో ఉండడం.. పిల్లలతో సంతోషంగా గడపడం చూశాడు ఆయన. తనూ తన ఫ్యామిలీతో ఉండాలని ఆరాటపడ్డాడు. అప్పటికే ట్రీట్‌మెంట్‌లో ఉన్నాడు. పాపను చాలా మిస్ అవుతున్నాడని మాకూ అర్థమైంది. బాధ అనిపించింది. అయినా రీ-కన్సిలియేషన్‌కు నాకు ధైర్యం చాలలేదు. తనకు మాతో ఉండాలన్న బలంతోనే మళ్లీ కలిశాం. అప్పటికి పాపకు తొమ్మిదేళ్లు. ఏళ్ల తరబడి ఆల్కహాల్ అలవాటున్న మనిషి పర్సనాలిటీ చాలా ఛేంజ్ అవుతుంది. తాగినందుకు వాళ్లూ హ్యాపీగా ఉండరు. మనకన్నా ఎక్కువ సఫర్ అవుతారు. మంచి, చెడు విశ్లేషించుకోలేరు. కౌన్సిలింగ్ సహాయంతో...చాలా ఓపికగా సమస్యను సాల్వ్ చేసుకునే పనిలో పడ్డాం. రాహుల్ కూడా నన్ను ట్రస్ట్ చేయడంతో ఆ అలవాటు నుంచి ఆయనను బయటకు లాగడం ఇదివరకటి కన్నా ఈజీ అయింది. రెండేళ్లకు బాబు (రిషల్) పుట్టాడు.
ఆ యాంగిల్ తెలియదు
వాడు వచ్చాక అయితే రాహుల్ పూర్తిగా మారిపోయాడు. బాబుకి వాళ్ల నాన్నతో మంచి రిలేషన్ ఉంది. వాళ్లిద్దరికీ ఎటాచ్‌మెంట్ ఎక్కువ. పాప వాళ్ల నాన్నలోని నెగటివ్ షేడ్స్ చూసింది. కానీ వీడికి ఆ యాంగిల్ తెలియదు. మేం చెప్పినా నమ్మడు. పిల్లలతో చాలా ఓపెన్‌గా ఉంటాం. వాళ్ల దగ్గర దాచాల్సిన అవసరం లేదనుకుంటాం. మనం దాస్తే.. వాళ్లూ విషయాలను దాచడం నేర్చుకుంటారు. అందుకే ఏదైనా ఓపెన్‌గానే చర్చిస్తాం.
ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ కుదరదు
ఆల్కహాలిక్స్, వాళ్ల కుటుంబాలు పడుతున్న బాధను చూశా కాబట్టి హైదరాబాద్‌లో డీఎడిక్షన్ సెంటర్ పెట్టాల నుకున్నా. రాహుల్ కూడా సపోర్ట్ చేశాడు. వర్క్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రాహుల్ ట్రీట్‌మెంట్ తీసుకున్న డీ-ఎడిక్షన్ సెంటర్ హైదరాబాద్ బ్రాంచ్‌లో రెండు మూడేళ్లు ఇద్దరం పనిచేశాం. 2002లో సొంతంగా ‘హోప్ ట్రస్ట్’ స్టార్ట్ చేశాం. పేషంట్‌తో పాటు ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇవ్వడం మా ప్రత్యేకత. మురికివాడల్లో ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాలు చేస్తుంటాం. అంతేకాదు లోకల్ స్కూల్స్‌ని అడాప్ట్ చేసుకొని పిల్లలను చైతన్యపరుస్తుంటాం. ఆల్కహాలిక్స్ ఉన్న కుటుంబాలకు నేను చెప్పేది ఒకటే.. తప్పునంతా భార్యల మీదకు నెట్టొద్దు. అల్కహాలిక్స్‌ని పేషంట్స్‌లా చూడాలి. వాళ్లను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ మార్చుకోవడం కుదరదు. నిరాశానిస్పృహలకు లోను కాకుండా ప్రొఫెషనల్స్ దగ్గరకెళ్లాలి. సమస్య చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. పేషంట్‌కు ట్రీట్‌మెంట్ ఎంత ముఖ్యమో, అతన్ని డీల్ చేసే ఫ్యామిలీకి కౌన్సిలింగ్ అంతే ముఖ్యం. ఇది నయం కాని వ్యాధి కాదు. కాకపోతే ఓపిక అవసరం అంతే! ఎవరమూ పర్‌ఫెక్ట్ కాదు. అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని సరిదిద్దుకునేందుకు ఒకరి సపోర్ట్ ఒకరికి కావాలి!
ఆయన... బెస్ట్ హజ్బెండ్
గతాన్ని తల్చుకోలేను. నెగటివ్ పాస్ట్‌లోకి వెళ్లడానికి ఇష్టపడను. ఇప్పటి మా ఈ అచీవ్‌మెంట్ రాహుల్ సపోర్ట్ లేనిదే కుదిరేది కాదు. తాను అందులోంచి బయటకు రావాలని అనుకున్నాడు కాబట్టే మా ప్రయత్నాలకు సహకరించాడు. నేను కలలు కన్న ది బెస్ట్ హజ్బెండ్‌గా మారాడు. అప్పుడు సిట్యుయేషన్ వరెస్టే. అసలు మా పరిస్థితి మారుతుందా అని దిగులు పడ్డ సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం తను బెస్ట్ హజ్బెండ్ ఎవర్. ఎంత మారినా ఆల్కహాలిక్స్‌లో ఎమోషనల్ ఎక్స్‌పోజింగ్ డామేజ్ అయి ఉంటుంది. అందుకే మన మీదున్న ప్రేమను.. ఇష్టాన్ని మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేరు. వాళ్ల యాక్టివిటీ ద్వారా బయటపెడుతుంటారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో రాహుల్ కూడా అంతే. సారీ, థ్యాంక్స్‌లు చెప్పరు. కాంప్లిమెంట్స్ ఉండవు. అలాగని ఆయన మనసులో ఆ ఫీల్ లేదని కాదు. నాకిష్టమైన పనులు చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తుంటాడు.
- సరస్వతి రమ