లైంగిక దాడులు సహించం
రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి
రాజమహేంద్రవరం రూరల్ : జిల్లాలో గిరిజన విద్యార్థినులకు అన్యాయం చేస్తే సహించమని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హెచ్చరించారు. బొమ్మూరులోని గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఇటీవల పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపులపై ఆరా తీశారు. లైంగిక వేధింపులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టంచేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్లకు డోర్లు, బోల్టులను వేయించాలని విద్యార్థినులకు రక్షణ ఉండాలంటే ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. విద్యార్థినులకు పెట్టే అన్నంలో ఒడ్లు, పోపు లేని చారు, నూనె లేకుండా కూర చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బొబ్బర్లకు బదులు బిస్కట్లు పెట్టడమేమిటని అధికారులను ప్రశ్నించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తనకు ఫోన్ చేస్తే సమస్యను కలెక్టరు, ఐటీడీఏ పీడీ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. పాఠశాలకు వెంటనే ఏఎన్‌ఎంను నియమించాలని, వార్డెన్, హెచ్‌ఎం, వాచ్‌మెన్లు మహిళలే ఉండాలన్నారు.గిరిజన విద్యార్ధినుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వీరి సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు. ఇప్పటికే గిరిజన విద్యార్థినుల సమస్యలపై శాసనసభలో ప్రస్తావించానని గుర్తు చేశారు. అనంతరం ఆమె గిరిజన శిక్షణా కేంద్రానికి కూడా పరిశీలించారు. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, రంపచోడవరం జెడ్పీఈసీ పత్తిగోళ్ల భారతి, వైస్ ఎంపీపీ స్వామిదొర, ఎంపీటీసీలు లింగారెడ్డి, కామరోడి పూజ, నండూరి గంగాధరరావు, బొల్లోజి కాంతం, హెచ్‌ఎం ఉదయకుమారి తదితరులు పాల్గొన్నారు.