=పేదింటి విద్యా కుసుమం
=ఒకేసారి ఐదు ఉద్యోగాలు
రావికమతం, న్యూస్‌లైన్ : సకల సదుపాయాలున్న పట్టణాల్లో విద్యాభ్యాసం చేసిన వారికే సర్కారు ఉద్యోగం దొరకని రోజులివి. అలాంటిది, కనీస సౌకర్యాల్లేని మారుమూల పల్లెలో పట్టుదలే పెట్టుబడిగా ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఐదు ప్రభుత్వ కొలువులను అవలీలగా హస్తగతం చేసుకుంది ఆ యువతి. కష్టపడి చదివితే సాధించలేనిది లేదని, పేదరికం అడ్డుకాబోదని నిరూపించింది. పలువురికి ఆదర్శంగా నిలిచింది.
మండలంలోని పి.పిన్నవోలు శివారు ఆర్.కొత్తూరులో నిరుపేద కుటుంబానికి చెందిన మొల్లి రాజారావు, రాజు దంపతుల కుమార్తె రాజేశ్వరి. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించింది. స్వగ్రామం, టి.అర్జాపురం, రావికమతం ప్రభుత్వ పాఠశాలల్లో బీసీ వసతి గృహంలో ఉంటూ చదివిన ఆమె అప్పట్లో పదో తరగతి పరీక్షల్లో మండల టాపర్‌గా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుడు భాస్కరరావు తదితరుల సహాయ సహకారాలతో ఎస్.కోట కాలేజీలో చేరి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. దీంతో మాకవరపాలెం అవంతి కాలేజీలో బీటెక్‌లో చేరింది.
ఆ కళాశాల కరస్పాండెంట్ ఈ చదువుల సరస్వతికి ఫీజు లేకుండానే ఉచిత విద్య అందించారు. పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకుంటూ ఉన్నత చదువులు చదవాలని భావించిన రాజేశ్వరి బ్యాంకు క్లర్కు పోస్టుకు పరీక్షలు రాసి అందులో విజయం సాధిం చింది. ప్రస్తుతం రావికమతంలో ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తూనే జూనియర్ లెక్చరర్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్టల్ అసిస్టెంట్, ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ అధికారి, సీజీఎల్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసి పరీక్షలు రాసింది. ఒక్కొక్కటిగా అన్నీ పాసైనట్టు ఆమె తెలియజేసింది. అయితే జూనియర్ కాలేజీ లెక్చరర్ కన్నా మిగిలిన పోస్టులకు ఆమె ఇష్టపడక ఇంట ర్వ్యూలకు హాజరు కాలేదు.
రావికమతం ఆంధ్రా బ్యాంకు నుంచి పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా చేరేందుకు సిద్ధమవుతోంది. స్వయంకృషితో కష్టాలను లెక్కచేయకుండా అరుదైన ఘనత సాధించిన రాజేశ్వరిని తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, రావికమతం ఆంధ్రా బ్యాంకు సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి తన విజయానికి కారకులైన గురువులు భాస్కరరావు, అప్పలనాయుడు, రామారావు, గిరిజారాణి, రామునాయుడులకు కృతజ్ఞతలు తెలిపింది.